స్మార్ట్‌ఫోన్లతో ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో అన్న బెంగ మాత్రం తీరడం లేదు. రకరకాల అప్లికేషన్లు వాడుతూండటం, డేటా కనెక్షన్లు ఎక్కువ కావడం దీనికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ ఛార్జ్‌ను ఆదా చేసుకోవాలంటే రెడీమేడ్ అప్లికేషన్లతోపాటు కొన్ని సింపుల్ టెక్నిక్‌లను పాటించడం మేలు. వాటిల్లో కొన్ని మీ కోసం...
1- రంగుల స్క్రీన్‌తో చిక్కే...
స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లోని రంగులు బ్యాటరీ వాడకంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల రంగు రంగుల బ్యాక్‌గ్రౌండ్లు, వాల్‌పేపర్ల స్థానంలో వీలైనంత వరకూ డార్క్ కలర్‌వి వాడటం మేలు. దీనివల్ల బ్యాటరీ సమయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చునని అంచనా. అమోలెడ్ స్క్రీన్ల విషయంలో ఇది దాదాపు 21 శాతం వరకూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బానే ఉంది కానీ.. నా అందమైన వాల్‌పేపర్‌ను ఎలా వదులుకోవడం అనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. బ్యాటరీ ఛార్జ్ బాగా తక్కువగా ఉన్నప్పుడైనా... యానిమేటెడ్, రంగుల వాల్‌పేపర్ల స్థానంలో డార్క్ వాల్‌పేపర్‌ను వాడండి.
2- ప్రకటనలతో బ్యాటరీ ఖాళీ...
బ్యాటరీ, మెమరీలను సేవ్ చేసుకునేందుకు మనం రకరకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటాం. వీటితో కొంత ప్రయోజనమున్నప్పటికీ ఆ అప్లికేషన్లతోపాటు వచ్చే ప్రకటనలతో మాత్రం బ్యాటరీ ఖాళీ అవుతూంటుందని మైక్రోసాఫ్ట్, పర్‌డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. గేమ్స్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనలు డౌన్‌లోడ్ అయ్యేందుకు బ్యాటరీ, ప్రాసెసర్లను ఉపయోగించడం దీనికి కారణం. కొన్ని లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ మెజారిటీ వాటిల్లో మాత్రం తప్పనిసరి అవుతోంది.
3- సాధారణ అప్లికేషన్లతో కూడా...
ప్రకటనలతో కూడిన ఆప్లికేషన్లు మాత్రమే బ్యాటరీని ఖర్చు చేస్తాయనుకోవద్దు. వాటితోపాటు సాధారణ అప్లికేషన్లు.. ముఖ్యంగా వాతావరణ సంబంధిత, మెసేజింగ్, ఈమెయిల్స్, జీపీఎస్ వంటివి కూడా దుబారాకు కారణమవుతున్నాయి. అప్‌డేట్స్ కోసం తరచూ రిక్వెస్ట్‌లు పెట్టాల్సి రావడం వల్ల ఇలా జరుగుతోంది. ఫోన్ సెట్టింగ్స్‌ను కొంత మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అరగంటకు ఒకసారి అప్‌డేట్ చేసుకునే బదులు రెండు గంటలకు ఒకసారి చేసుకోవడం వంటిదన్నమాట.
4- వైబ్రేషన్స్‌ను ఆపేయండి...
రింగ్‌టోన్లు ఇబ్బంది పెడుతున్నాయని అనుకునేవారు వైబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లడం చాలామంది చేసే పని. అయితే మొత్తం బ్యాటరీని వేగంగా కదల్చాల్సినంత శక్తి అవసరమవుతుంది కాబట్టి వైబ్రేషన్స్‌తో బ్యాటరీ ఠక్కున ఖాళీ అయ్యే అవకాశముంది. వైబ్రేషన్స్‌ను పూర్తిగా తొలగించుకోవడం లేదా.. దాని తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని సౌండ్ అప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని ‘వైబ్రేట్ వైల్ రింగింగ్’, ‘వైబ్రేట్ ఆన్ టచ్’ అప్షన్లను తీసేయండి.
5- వేడితోనూ ఇబ్బందే...
మనమాదిరిగానే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పరిసరాల్లోని వాతావరణానికి ముఖ్యంగా వేడికి స్పందిస్తూంటుంది. ఎక్కువ వేడెక్కినా... చల్లగా ఉన్నా బ్యాటరీ వేగంగా ఖాళీ అవడంతోపాటు లోపలి పరికరాలు పాడయ్యే ప్రమాదముంది. వీలైనంత వరకూ గది ఉష్ణోగ్రతలకు దగ్గరగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవడం ఈ సమస్యకు ఒక పరిష్కారం. వేసవి ఎండల్లో వాహనాల్లోపల వదిలేయడం అంతమంచిది కాదు. ఆ పరిస్థితుల్లో ఫోన్‌ను వాడినా ఇబ్బందే. అందువల్ల సాధారణ ఉష్ణోగ్రతలకు చేరుకునే వరకూ వాడకుండా చూసుకోవాలి.
6- సెట్టింగ్‌లు సరిచూసుకోండి...
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ సరిగా లేకపోతే మీ ఫోన్ బ్యాటరీ వేగంగా కొండెక్కుతుంది. స్క్రీన్ ప్రకాశం వీటిల్లో అత్యంత ముఖ్యమైంది. పూర్తిస్థాయికి బదులు సగం స్థాయికి దీన్ని తగ్గిస్తే కొన్ని గంటలపాటు బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని డిస్‌ప్లే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీ కంటికి నప్పే స్థాయి వరకూ ప్రకాశాన్ని తగ్గించుకోవడం లేదా... తక్కువ బ్రైట్‌నెస్ ఉన్న ఫోన్లను ఎంచుకోవడం మేలు.
బ్యాటరీ ఆదాకు ఆరు దారులు...
Published Wed, Jul 2 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement