ఆకుల అలలు..
బ్యూటిప్స్
తాజా ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం మెరగవుతుంది. అలాగే శిరోజాల నిగనిగలు పెరగాలంటే ఆకులతో చెలిమి చేయాలి.రెండు కప్పుల నీళ్లను మరిగించి అందులో 5-6 తాజా /ఎండు తేయాకులను వేసి, మూత పెట్టాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తల వెంట్రుకలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూ వాడకుండా కేవలం చల్లని నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల కేశాలు పొడిబారవు. చిట్లడం వంటి సమస్యలు కూడా రావు.
గుప్పుడు తులసి ఆకులను తీసుకొని మెత్తగా రుబ్బి, రసం తీయాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. చుండ్రు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.కలబంద ఆకును మధ్యకు విరిచి, దాని నుంచి వచ్చిన జెల్‌ను తలకు రాయాలి. తలస్నానం చేసిన తర్వాత కలబంద జెల్ ప్యాక్ వేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల వెంట్రుకలకు కండిషనర్ లభించి, మృదువుగా మారుతాయి. వేప ఆకులను శుభ్రం చేసి, ముద్దగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చుండ్రు, పేల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.