
బెల్ ద క్యాట్..
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశించాలంటే రాయాల్సిన పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). వేలల్లో ఉండే సీట్ల కోసం లక్షల మంది పోటీ పడే పరీక్ష.. క్యాట్. గతేడాది 13 ఐఐఎంలలో ఉన్న 3335 సీట్ల కోసం రెండు లక్షల మంది పోటీపడ్డారు. ప్రస్తుతం క్యాట్ - 2014 ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ విధానంలో ఉండే పరీక్షను ఈ ఏడాది నవంబర్ 16, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది పరీక్షలో ప్రశ్నల సంఖ్యను, పరీక్ష వ్యవధిని పెంచనున్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థులు మంచి పర్సంటైల్ సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు..
క్యాట్-2014 సమాచారం
అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ (ఎన్‌సీ) - రూ.1600, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు రూ.800. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 6, 2014
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 30, 2014
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: నవంబర్ 16, 22 తేదీల్లో
ఫలితాల ప్రకటన: డిసెంబర్ మూడోవారం 2014.
వెబ్‌సైట్: www.iimcat.ac.in
రెండు విభాగాల పరీక్ష
గత కొన్నేళ్లుగా క్యాట్‌లో రెండు విభాగాల్లో (క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్) అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. గతేడాది ప్రతి విభాగానికి 70 నిమిషాలు చొప్పున మొత్తం 140 నిమిషాలు సమయం కేటాయించారు. అదే విధంగా ప్రతి విభాగంలో 30 ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ఏడాది ప్రతి విభాగంలో 50 ప్రశ్నలు ఇవ్వనున్నారు. సమయాన్ని కూడా 140 నిమిషాల నుంచి 170 నిమిషాలకు పెంచుతున్నట్లు క్యాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలి. వీటికనుగుణంగా ప్రిపరేషన్ సమయంలోనే తగిన కసరత్తు చేయాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
క్యాట్‌లోని మిగతా విభాగాలతో పోల్చితే విజయ సాధనలో అత్యంత కీలకమైన విభాగం.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ. అందుకే ప్రిపరేషన్‌ను కూడా వ్యూహాత్మకంగా చేయాలి. తొలుత ఈ విభాగానికి సంబంధించి నిర్దేశిత సిలబస్‌లోని అన్ని అంశాలను ఆసాంతం చదవాలి. ఇదే వ్యూహాన్ని.. అభ్యర్థులు ఆన్‌లైన్ టెస్ట్ తేదీకి నాలుగు వారాల ముందు వరకు అనుసరించాలి. ప్రతి అంశంలోని ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా జామెట్రీ, అల్జీబ్రా, నంబర్స్‌కు సంబంధించి ఆయా అంశాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. చదివేటప్పుడే ఆయా అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్ట్‌లను షార్ట్‌నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. టెస్ట్ తేదీలకు కనీసం నెలరోజుల ముందు నుంచి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. అలాగే రివిజన్ కొనసాగించాలి. చివరి నెలరోజుల వ్యవధిలో కొత్త అంశాలు చదవాలనుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇంగ్లిష్
రీడింగ్ కాంప్రహెన్షన్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండే విభాగం.. ఇంగ్లిష్. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తులనాత్మక అధ్యయనం చేయాలి. ఒక ప్యాసేజ్‌లోని ‘కీ’ వర్డ్స్‌ను, ‘కీ’పాయింట్స్‌ను గుర్తించే విధంగా సూక్ష్మ పరిశీలన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు సరైన సాధనం.. ఇంగ్లిష్ దినపత్రికలను, మేగజైన్లను క్రమం తప్పకుండా చదవడం. వాటిలోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలను చదివి.. సదరు అంశం సారాంశాన్ని సంక్షిప్తంగా రాయగలిగే నేర్పు మెరుగుపరచుకోవాలి. వొకాబ్యులరీని పెంచుకునేందుకు కృషి చేయాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ విభాగం నుంచి సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉంటాయి. కంపేరిటివ్ అప్రోచ్ కూడా ఎంతో కలిసొస్తుంది. గణాంకాలు, కూడికలు, తీసివేతల ప్రమేయం ఎక్కువగా ఉండే ఈ విభాగంలో రాణించడానికి మరో ముఖ్య సాధనం.. వేగంగా గణించే నేర్పు సొంతం చేసుకోవడం. దీనికి మార్గం రెగ్యులర్ ప్రాక్టీస్. ముఖ్యంగా పర్సంటేజెస్, సగటులు, ప్రాబబిలిటీ సంబంధిత అంశాలపై బాగా పట్టు సాధించాలి. స్టాండర్డ్ మెటీరియల్, ఆన్‌లైన్ టెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో చక్కటి ఫలితాలు ఆశించొచ్చు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ కోసం అరుణ్ శర్మ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
లాజికల్ రీజనింగ్
అభ్యర్థుల్లోని తులనాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం.. లాజికల్ రీజనింగ్. ఇందు లో స్వీయ ఆలోచన శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిన విభాగం. కాబట్టి అభ్యర్థులు పజిల్స్, డిడక్షన్, వెన్ డయాగ్రమ్స్, క్యూబ్స్, లాజికల్ కనెక్టివిటీస్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశముంది. పజిల్స్ కోసం శకుంతలా దేవి, జార్జ్ సమ్మర్స్ పుస్తకాలను చదివితే సరిపోతుంది. మిగిలిన అంశాల కోసం ఏదైనా క్యాట్ స్టాండర్డ్ మెటీరియల్‌ను చదవడం లాభిస్తుంది.
వెర్బల్ రీజనింగ్
పేరా జంబ్లింగ్, పేరా కంప్లీషన్, క్రిటికల్ రీజనింగ్ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడిగే వెర్బల్ రీజనింగ్‌లో రాణించేందుకు పేరాగ్రాఫ్ ఇంట్రడక్టరీ స్టేట్‌మెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఒక పేరాలో రెండు వాక్యాలను అనుసంధానం చేసే పదాలను గుర్తించగలగాలి. దీనికి కూడా ప్రాక్టీస్ కీలక పాత్ర పోషిస్తుంది.
వెర్బల్ ఎబిలిటీ
ఇంగ్లిష్ బేసిక్ గ్రామర్, పదాల ఆధారిత ప్రశ్నలు ప్రధానంగా ఉండే వెర్బల్ ఎబిలిటీలో మంచి స్కోర్ కోసం.. గ్రామర్‌కు సంబంధించి రెన్ అండ్ మార్టిన్ లేదా ఇతర స్టాండర్డ్ గ్రామర్ బుక్స్‌ను చదివితే సరిపోతుంది. వర్డ్ బేస్డ్ కొశ్చన్స్‌లో స్వీయ ప్రాక్టీస్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ తప్పనిసరిగా కొన్ని కొత్త పదాలను ప్రాక్టీస్ చేయాలి. కనీసం రోజుకు 60 నుంచి 80 కొత్త పదాలు తెలుసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి.
క్యాట్ - టైం ప్లాన్
ప్రతి రోజూ తప్పనిసరిగా మూడు నుంచి నాలుగు గంటలు క్యాట్ కోసం కేటాయించాలి.
ఆయా విభాగాలకు సంబంధించి తాము బలహీనంగా ఉన్న అంశాలపై ముందుగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
దీనికి అనుగుణంగా ప్రిపరేషన్‌కు కేటాయించిన సమయాన్ని విభజించుకోవాలి.
క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ అప్రోచ్‌తో విజయం
క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా అలవర్చుకోవాల్సిన లక్షణాలు.. క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ స్టడీ అప్రోచ్. సిలబస్‌లోని నిర్దేశిత అంశాలను చదివేటప్పుడు ఆయా అంశాలను తులనాత్మకంగా, సూక్ష్మ పరిశీలనతో అధ్యయనం చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలు పూర్తి చేయడం సులభమే. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి ఆందోళన చెందక్కర్లేదు. పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్‌లో పట్టు ఉన్న అభ్యర్థులెవరైనా సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉంటాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇప్పటి నుంచే బేసిక్స్‌పై పట్టు కోసం సీబీఎస్‌ఈ టెన్త్ స్టాండర్డ్ బుక్స్‌ను అధ్యయనం చేయాలి. ప్రస్తుత సమయంలో కచ్చితంగా నిర్దిష్ట సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతల ఆధారంగా ఆ సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరై.. వాటి ఫలితాల విశ్లేషణ ద్వారా ఇంకా మెరుగుపరచుకోవాల్సినఅంశాలను గుర్తించాలి. పరీక్షలో వాటి ప్రాధాన్యం ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి.
- కె.రామనాథ్, డెరైక్టర్, క్యాట్ కోచింగ్ (టైమ్ ఇన్‌స్టిట్యూట్)
ప్రాక్టీస్.. మాక్ టెస్ట్స్
క్యాట్‌లో మంచి స్కోరుకు మార్గం వేసే ముఖ్య సాధనాలు.. ప్రాక్టీస్, మాక్ టెస్ట్స్. ప్రిపరేషన్ సమయంలో థియరాటికల్ అప్రోచ్‌కు పరిమితం కాకుండా ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగానికి సంబంధించి ఇది ఎంతో కీలకం. కంప్యూటేషనల్ స్కిల్స్ పెంచుకోవాలి. ప్రిపరేషన్ ప్రారంభ దశ నుంచే మాక్ టెస్ట్స్‌కు హాజరవడం కలిసొస్తుంది. ముందుగా తాము బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టి సారించాలి. దీన్ని కూడా కొంత వరకే పరిమితం చేయాలి. లేదంటే మిగతా అంశాల ప్రిపరేషన్‌కు సమయం సరిపోదు. పరీక్షకు నెల రోజుల ముందు నాటికి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. అప్పుడు క్యాట్‌లో మంచి స్కోరు ఆశించొచ్చు.
- పి.వెంకట కృష్ణ, క్యాట్-2013 విజేత (100 పర్సంటైల్)
క్యాట్ - ఫ్యాక్ట్స్
అభ్యర్థులు క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రతి ఐఐఎంకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఐఐఎంలు.. క్యాట్ కటాఫ్ స్కోర్‌ను కూడా ప్రకటిస్తాయి.
క్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు తదుపరి దశలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఐఐఎంలు తుది జాబితా ప్రకటిస్తాయి.
ఈ క్రమంలో క్యాట్ స్కోర్, జీడీ/పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లకు నిర్దిష్టంగా వెయిటేజీలు ప్రకటిస్తున్నాయి. ఇవి.. ఆయా ఐఐఎంలకు వేర్వేరుగా ఉంటాయి. ఇవే కాకుండా.. అకడెమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లకు కూడా వెయిటేజీ ఉంటుంది.