
ఋషుల ప్రశ్నలతో భాగవతం ప్రథమ స్కంధం ప్రారంభమవుతుంది. తరువాత వివిధ అవతారాలకు సంబంధించిన వివరణ వస్తుంది. అటు పిమ్మట భాగవతం ఎలా మొదలైందో వివరిస్తుంది. మహాభారతం రచించి, పురాణాలు రాసిన వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది.
అప్పుడు వ్యాసభగవానుని ఆధ్యాత్మిక గురువు అయిన నారద మహర్షి విచ్చేసి భాగవతం రాయమని ఉపదేశించి, అనేక విషయాలను బోధించి వెళ్లిన కథ ప్రథమ స్కంధం చెబుతుంది. తన మనస్సులో కలిగిన ఆందోళనకు ఉపశమనంగా వ్యాసుల వారు భాగవత రచన ఆరంభించిన విధానం, ఆ తరువాత భాగవతాన్ని ఏ విధంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారో ఈ స్కంధం వివరిస్తుంది.
భీష్ముని నిర్యాణం, శ్రీకృష్ణుడు ద్వారకకు పయనం కావడం, ద్వారకలో ప్రవేశించడం, పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్లడం, శ్రీకృష్ణనిర్యాణం, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్లడం, పరీక్షిత్తు – కలి సంవాదం, కలిపురుషుడిని పరీక్షిత్తు దండించడం, దయ చూపడం, పరీక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపం ఇవ్వడం, శుకమహర్షి ఆగమనం, పరీక్షిత్తు ప్రశ్నలు అడగడం... ప్రథమ స్కంధం వివరిస్తుంది.
– జయ