
టీనేజీలో ఆ అమ్మాయి డిప్రెషన్ బారిన పడింది. జీవితంపై నిరాసక్తత పెంచుకుంది. అప్పుడు ఆమె తల్లి యోగా గురించి చెప్పింది. భారతదేశం పట్ల అలా మొదలైన ఆసక్తి హిందూమతం, వేదాలపైకి మళ్లింది. గత ఏడాది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను నగరాలను సందర్శించింది. యోగ ముద్రలపై ప్రస్తుతం పరిశోధన చేస్తూ ఇటీవల మరింత సమాచార సేకరణ కోసం ఐఐటీ హైదరాబాద్‌కు చేరుకుంది. పునర్జన్మపై తనకు నమ్మకం ఉందని పూర్వ జన్మలో తాను భారతీయురాలినని గాఢంగా విశ్వసిస్తోంది. భారత్‌లోనే స్థిరపడాలని ఆకాంక్షిస్తున్న బ్రెజిల్ అమ్మాయి డఫన్ పరిచయం ఇది. 30 ఏళ్ల బ్రెజిల్ యువతి డఫన్ స్వస్థలం బ్రెజిల్‌లోని ‘రియో డి జెనీరో’. ఆమె తల్లి, తండ్రి అక్కడి యూనివర్సిటీలో పని చేసేవారు. టీనేజ్‌లో డఫన్‌కు డిప్రెషన్ వచ్చింది. ఈ క్రమంలో తల్లి సూచనతో యోగా అభ్యసించడం ప్రారంభింది. మొదట్లో బరువు తగ్గడం, ఆరోగ్యంగా ఉండటం మాత్రమే డఫన్ యోగా అభ్యసన ఉద్దేశం. పుస్తకాలు చూస్తూ, ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ మొదలైన యోగా అభ్యసనం కాస్తా క్రమంగా దినచర్యగా మారింది.
శారీరకంగా, మానసికంగా అద్భుతమైన ఫలితాలు కనిపించడంతో యోగవిద్యను అధ్యయనం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయమే అక్కడి యూనివర్సిటీలో యోగా సర్టిఫికేట్ కోర్సులో డఫన్ చేరేందుకు దారి తీసింది. కోర్సు చదువుతున్న సమయంలో ఓ ఉపాధ్యాయిని ద్వారా బుద్ధుడి బోధనల గురించి తొలిసారిగా తెలుసుకుంది. బుద్ధుడి బోధనల పట్ల ఆసక్తి పెంచుకున్న డఫన్ క్రమంగా హిందూ మతం, భారతీయసంస్కృతి అధ్యయనం వైపు మళ్లింది. ‘హిందూమతం పట్ల నేను ఎందుకు ఆకర్షితురాలిని అవుతున్నాననే ప్రశ్న నన్ను తరచూ వెంటాడేది. పునర్జన్మను నేను గట్టిగా విశ్వసిస్తాను. పూర్వజన్మలో నేను హిందువును అయి వుంటానని అనిపిస్తోంది’ అని డఫన్ చెప్తోంది. పతంజలి యోగ సూత్ర, భగవద్గీత, అద్వైత వేదం, ఉపనిషత్తులు, మహా భారతం, వివేకచూడామణి, ఆత్మయోగి రామకృష్ణ పరమహంస బోధనలను లోతుగా చదివింది. దశాబ్ద కాలంగా భారతీయ సంస్కృతి, తత్వం, మతం తదితరాల గురించి డఫన్ తెలుసుకుంటూ వస్తోంది.
యోగా శిక్షకురాలిగా
భారతీయ సాంప్రదాయానికి అద్దం పట్టే చీరలతో పాటు ఇతర భారతీయ వస్త్రధారణను అమితంగా ఇష్టపడే డఫన్ ఐదేళ్ల క్రితం మాంసాహారాన్ని పూర్తిగా మానేసింది. ప్రస్తుతం యోగా శిక్షకురాలిగా పరిణితి చెందింది. రియో డి జెనీరోలోని రియో విశ్వవిద్యాలయం నుంచి బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీ నుంచి ‘బయో మెకానికల్ స్టడీ ఆఫ్ యోగా పోస్చర్స్’అనే అంశంపై పరిశోధన చేస్తోంది. ‘గత ఏడాది మార్చిలో పర్యాటకురాలిగా భారత్‌కు వచ్చి వారణాసి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లో పలు దేవాలయాలను సందర్శించాను. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లోని బయో మెడికల్ విభాగంలో జరుగుతున్న పరిశోధనల గురించి కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్నా. రియో యూనివర్సిటీలో చేస్తున్న పరిశోధనలో భాగంగా ఆరోగ్యంపై యోగా ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఐఐటీ హైదరాబాద్‌కు ఈ ఏడాది మే నెలలో వచ్చా. బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ మోహన్ రాఘవన్‌ను కలుసుకుని, నా పరిశోధనకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నా’ అని డఫన్ వెల్లడింది.
ఇస్కాన్‌తో అనుబంధం
థియోసాఫికల్ సొసైటీతో అనుబం«ధాన్ని కలిగి ఉన్న డఫన్ వీలు చిక్కినప్పుడల్లా రియోలోని ఇస్కాన్ సభ్యులను కలుస్తూ వారాంతాల్లో జరిగే భారతీయ తత్వ బోధనలను శ్రద్ధగా వింటుంది. హఠయోగ, అష్టాంగయోగ వంటి యోగాసనాల్లో ప్రావీణ్యం సంపాదించిన డఫన్ ప్రస్తుతం భారత్‌లో మరిన్ని సంక్లిష్టమైన ఆసనాలు నేర్పే భారతీయ గురువుల కోసం అన్వేషిస్తోంది. ‘నా ఆలోచనల విషయంలో నా కుటుంబంతో కొంత సంఘర్షణ ఉన్న మాట వాస్తవమే. అయినా వాళ్లు నన్ను నన్నుగానే ప్రేమిస్తారు. త్వరలో హిందూ మతంలోకి మారి భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడాలని ఉంది’ అని డఫన్ తన మనసులోని మాటను వెల్లడించింది.
– కల్వల మల్లికార్జున రెడ్డి,సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి