సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే! | Cellulitis Symptoms, Causes, Diagnosis | Sakshi
Sakshi News home page

సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే!

Published Wed, Aug 7 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే!

సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే!

చర్మానికి సోకే ఒక తరహా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఈ కండిషన్‌లో కాలు లేదా చేయి  విపరీతంగా వాచిపోయి, ఎర్రగా కనిపిస్తూ, ముట్టుకుంటేనే నొప్పి (టెండర్‌నెస్)ని కలిగిస్తూ బాధాకరంగా మారిపోతుంది. ఇది  కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే మొదట కాలుకి మాత్రమే పరిమితమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతటికీ పాకి ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సెల్యులైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం తప్పనిసరిగా తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సెల్యులైటిస్, దాని లక్షణాలు, దానివల్ల కలిగే పరిణామాల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 
 
 సెల్యులైటిస్ సోకగానే కాలు బాగా వాచి, ఎర్రబారి (ఎరిథిమా), ముట్టుకుంటే మంట (ఇన్‌ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఇన్‌ఫ్లమేషన్‌తో సెల్యులైటిస్ కనిపించిందంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అంటే అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించినకొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. 
 
 సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... 
 నిజానికి సెల్యులైటిస్ అన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. కానీ ప్రధానంగా శరీరంలోని కింది భాగమైన కాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సెల్యులైటిస్ సోకిన కాలు ఎర్రగా నునుపుదనంతో మెరుస్తూ కనిపిస్తుంది. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరి, అది సెకండరీ కండిషన్‌లో సెల్యులైటిస్‌కు దారితీవయచ్చు. ఇందుకు చాలారకాలైన సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) దోహదపడతాయి. అవి... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్‌పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధానమైన రకాలూ ఉన్నాయి. 
 
 సెల్యులైటిస్ ఎలా వస్తుంది? 
 సాధారణంగా మన చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ మనకు రక్షణ కలిగిస్తుందన్న విషయం తెలిసిందే. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలుగాని, చీరుకుపోయి గాని ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి బయటి సూక్ష్మజీవులు చర్మాన్ని దాటి  లోపలి భాగాలకు వెళ్లగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియాపెడిస్) వంటి కండిషన్‌లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. దాంతో వెంటనే చర్మం తనను తాను రక్షించుకునే వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో భాగంగా ఎర్రబారుతుంది. అది క్రమంగా సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. 
 
 లక్షణాలు 
 ఏ చర్మపు రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. దాంతో అప్పటికే ఎర్రటి చర్మం కలవారు కొందరిలో దీన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. అదే నల్లటి చర్మం కలవారిలో ఈ రంగు కారణంగా దీన్ని వెంటనే గుర్తుపట్టి, తగిన చికిత్స చేయడానికి వీలవుతుంది. 
 
  వాపు: సాధారణంగా కాలివాపు పాదం నుంచి మొదలై పైకి వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలవుతుంది. ఏ కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది నునుపుదనాన్ని ఆపాదించుకుని మెరుస్తూ కనిపిస్తుంది. వాపుకారణంగా చర్మం బాగా బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. ఏ ముట్టుకుంటే మంట, నొప్పితో పాటు ఆ ప్రాంతంలో లోపల వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఏ ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలు, చలితో కూడిన జ్వరం వచ్చినట్లుగా అనిపించడం కూడా కనిపించవచ్చు. ఏ రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి సూచన. ఏ వాచిన కాలి భాగంలో ఉన్న పుండ్ల నుంచి పసుపు రంగుతో చీము స్రవిస్తుంటుంది. 
 
 సెల్యులైటిస్‌కు దారితీసే పరిస్థితులు
 ఏ చర్మానికి గాయమై, అది దీర్ఘకాలికంగా ఉండటం. చర్మం చీరుకుపోయి ఆ గాయం చాలాకాలంగా మానకుండా ఉండటం. కాలికి పుండ్లు. ఏ  కాలికి దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి మానకుండా ఉండటం (ప్రధానంగా అథ్లెట్స్ ఫూట్ వంటివి) ఏ డయాబెటిస్ ఉన్నవారికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు (వేరికోసిక్ వెయిన్స్ వంటివి) ఏ పెరిఫెరల్ వ్యాస్కులార్ డిసీజ్ వంటి జబ్బులు ఏ శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం ఏ దీర్ఘకాలికంగా కాలేయ జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో (క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్ కనిపించే అవకాశాలెక్కువ) ఏ స్థూలకాయంతో బాధపడేవారిలో ఏ ఎగ్జిమా,
 
  సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఏచర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్- ఉదాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఏ దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా సెల్యులైటిస్ రావచ్చు ఏ ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కూడా ఒక్కోసారి సెల్యులైటిస్‌కు కారణం కావచ్చు. ఏ కాలిన గాయాలు చాలా సందర్భాల్లో సెల్యులైటిస్‌కు దారితీస్తాయి. 
 
 ఏ చర్మంలో మనం ప్రవేశపెట్టే సూదులు (ఇంట్రావీనస్‌గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మం లోపల అమర్చే వస్తువుల వంటి వాటితో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏ చర్మంలోపల ఉండే ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఏ కొన్ని కీటకాల కాటు తర్వాత (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల కూడా సెల్యులైటిస్ ప్రమాదం ఉంటుంది ఏ దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉన్నవారిలో స్వాభావికంగా ఉండే వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడంతో సెల్యులైటిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. 
 
 ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’గా అభివర్ణిస్తారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోకపోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది.
 
  దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు. ఇక సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూ పోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. మామూలుగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో ఇది జరుగుతుంది. సాధారణంగా సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటుంది. దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. అయితే రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించడం ఒకింత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. సాధారణంగా మన కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. 
 
 నివారణ / చికిత్స
 ఒకసారి సెల్యులైటిస్ కనిపించాక దానికి చికిత్స చేయడమే మార్గం. అది రాకముందే కొన్ని జాగ్రత్తలతో దాన్ని నివారించుకోవచ్చు. ఉదాహరణకు కాలిపై ఎలాంటి దీర్ఘకాలికమైన గాయాలు, రంధ్రాలు, పుండ్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒకవేళ అలాంటివేవైనా ఉంటే అవి తగ్గేలా ముందే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. 
 
 ఏ చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం (డ్రై స్కిన్): చర్మాన్ని ఆరోగ్యంగా, పొడిగా ఉంచుకోవడం వల్ల వీలైనంతగా సెల్యులైటిస్‌ను నివారించవచ్చు. సాఫ్ట్ పారఫిన్‌ను, లిక్విడ్ పారఫిన్‌ను సగం, సగం పాళ్లలో కలిపి, చర్మానికి ప్రధానంగా కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇలాంటి చర్యలతో సెల్యులైటిస్‌ను నివారించవచ్చు. ఏ వాచిన కాలిని కాస్త ఎత్తున ఉండేలా జాగ్రత్త తీసుకోవడం: మనం పడుకున్న సమయంలో  సెల్యులైటిస్‌తో వాపు వచ్చిన కాలిని శరీర భాగం కంటే కాస్త ఎత్తున ఉండేలా చేయడటం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది. 
 
 ఏ యాంటీబయాటిక్స్‌తో చికిత్స: స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ బ్యాక్టీరియాను తుదముట్టించే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకునేలా చేయడం లేదా నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపితో చికిత్స చేస్తారు. 
 
 ఏ వ్యాయామం: వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం. 
 సెల్యులైటిస్ అన్నది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి అది వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కంటే చిన్న చిన్న జాగ్రత్తలతో అసలు రాకుండానే చూసుకోవడం చాలా మంచిది.
 నిర్వహణ: యాసీన్
 
 కొన్ని జాగ్రత్తలు
 సెల్యులైటిస్ రాకుండా నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ కాలికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ కాలికి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కాలి వేళ్లకు గోళ్లు తొలగించే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవాలి ఏ కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ మాత్రమే ధరించాలి. గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా ధరించకూడదు. షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి చేస్తుంటే ఆ పాదరక్షలను విసర్జించి, సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. అంతేతప్ప ఎంతో డబ్బుపోసి కొన్నాం కదా అని వాటినే బలవంతంగా ధరించడాన్ని  కొనసాగించకూడదు. పాదరక్షల వల్ల కాలికి ఏదైనా గాయాలవుతున్నాయేమో తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ విషయంలో  మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. 
 
 పైన పేర్కొన్న లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 
 కీటకాలు, జంతువులు కుట్టకుండా/కరవకుండా జాగ్రత్త వహించాలి. 
 కాలిన గాయాలు అయినప్పుడు అవి పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి. 
 కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైనవారు మురికినీళ్లలోకి వెళ్లకూడదు. గాయమైన భాగాన్ని సముద్రపు నీటిలో ముంచకూడదు. 
 అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్‌కు, అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కు తగిన చికిత్స తీసుకుని అవి పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి. 
 మనదేశంలో దీర్ఘకాలికంగా ఉండే వేరికోస్‌వెయిన్స్‌కు చికిత్స తీసుకోకుండా ఉండటం మామూలే. ఈ పరిస్థితి ఉన్నవారు తప్పనిసరిగా చికిత్స తీసుకుని, సెల్యులైటిస్ వంటి రిస్క్‌ను తగ్గించుకోవాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement