విజ్ఞాన గనులుగా మారాలి | chit chat with Professor Shyam Sundar | Sakshi
Sakshi News home page

విజ్ఞాన గనులుగా మారాలి

Published Sun, Jan 18 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

విజ్ఞాన గనులుగా మారాలి

విజ్ఞాన గనులుగా మారాలి

గెస్ట్ కాలమ్
‘భారత్‌లో ఐఐఎం, ఐఐటీలు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే దేశంలో విద్యా సంస్థలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా మారాలి. ఇవి డిగ్రీల ముద్రణ కేంద్రాలుగా కాకుండా.. భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి’ అని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ సుందర్. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన భారతీయ రైల్వేలో ఇంజనీర్‌గా పని చేసి ఆసక్తితో అకౌంటింగ్ రంగంలో ప్రవేశించారు. తర్వాత అకౌంటింగ్ థియరిస్ట్, ఎక్స్‌పరిమెంటల్ ఎకనామిస్ట్‌గా పేరు గడించి.. పలు అవార్డులు, ఫెలోషిప్‌లు పొందినప్రొఫెసర్ శ్యామ్ సుందర్‌తో ఇంటర్వ్యూ..
 
నాణ్యమైన విద్య
ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కోవడానికి గట్టి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువ ప్రతిభావంతులను బోధన రంగంవైపు ఆకర్షించాలి. ఉన్నత విద్యాసంస్థలను లాభాలు ఆర్జించేవిగా పరిగణించకూడదు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు భారీస్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు పటిష్టమైన విధానాలను అమలు చేయాలి. లేకుంటేవిద్యార్థులకు సరైన విద్య అందక దేశ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది.
 
బోధనపై ఆసక్తి పెంచాలి
ప్రస్తుతం సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే.. నాణ్యమైన ఉన్నత విద్యనందించేందుకు అధ్యాపకుల సంఖ్యను భారీగా పెంచాలి. మన దేశంలో ఏటా దాదాపు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని అంచనా. అలాగే కోటిన్నర మంది కొత్తగా వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ అంచనాల ఆధారంగా స్టూడెంట్-టీచర్ నిష్పత్తిని 1:50గా చూసినా.. మనకు యూనివర్సిటీ/ కాలేజీ స్థాయిలో 30 లక్షల మంది అధ్యాపకులు అవసరం. ఒకసారి విధుల్లో చేరిన టీచర్లు 35ఏళ్లు పనిచేస్తారని భావించినా.. ప్రతి ఏటా కొత్తగా లక్ష మంది అధ్యాపకులు కావాలి. కాబట్టి ఈ కొరతను పూడ్చేందుకు దేశంలోని యంగ్ టాలెంట్‌ను ఆకర్షించేలా బోధన కు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా సంస్థలు బోధ నపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, ప్రోత్సహించాలి.
 
మేధో సంపత్తి
ఉన్నత విద్య వ్యాప్తి దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. నాణ్యమైన విద్య అంటే మేధో సంపత్తిని పెంచడమని గుర్తించాలి. ఇన్‌స్టిట్యూట్‌ల విస్తరణ, భవంతుల నిర్మాణంతో లక్ష్యం పూర్తయిందని భావించకూడదు. కేవలం మౌలిక సదుపాయాలతో మెరుగైన విద్య లభించదు. నాణ్యమైన ఫ్యాకల్టీ కావాలి. బోధనలో నాణ్యతను మెరుగుపర్చాలి. ఐఐటీలు, ఐఐఎంలలో ఎంతో తెలివైన విద్యార్థులు అడుగుపెడుతున్నారు. కానీ బోధన, పరిశోధన, ఆవిష్కరణల పరంగా వారికి సరైన గెడైన్స్ లేని కారణంగా ఆశించిన స్థాయి ఫలితాలు ఉండటం లేదు. అందుకే స్మార్ట్ ఫోన్స్ అంటే యాపిల్, జియోమీ; విమానాల కోసం బోయింగ్; ఆయుధాలు, అణుశక్తి కేంద్రాల కోసం రష్యావైపు చూస్తున్నాం.
 
మేక్ ఇన్ ఇండియా
ఇటీవల ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. రహదారులు, ఇంటర్నెట్, ఇంధనంతోపాటు నాణ్యమైన మానవ వనరులూ అవసరం. అందుకోసం మన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఇలాంటి చర్యలతోనే కొన్ని దశాబ్దాల క్రితం మనకంటే వెనుకంజలో ఉన్న చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు నేడు మనల్ని అధిగమించే స్థాయికి చేరుకున్నాయి.
 
ఆసక్తితో బహుళ రంగాల్లో నైపుణ్యం
ప్రస్తుతం మనదేశంలో యువతలో ఎక్కువమంది ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, మెడిసిన్.. ఇలా ఏదో ఒక రంగానికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. మరికొందరు అరకొర అవకాశాలతో సరిపుచ్చుకుంటున్నారు. కారణం వారిలోని ఆసక్తుల్లో వ్యత్యాసాలే.

ఆసక్తి, పట్టుదల ఉంటే బహుళ రంగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఇష్టం లేకున్నా ఇంజనీరింగ్‌లో లేదా మరే ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థి తర్వాత దశలో తనకు నచ్చిన కోర్సులో చేరొచ్చు. తద్వారా భవిష్యత్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు. విభిన్న రంగాల్లో ప్రపంచ గమనాన్ని మార్చిన ప్రముఖుల స్ఫూర్తితో అడుగులు వేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement