నాట్ ఏ జోక్ | comedian dhanraj and shakalaka shankar special interview | Sakshi
Sakshi News home page

నాట్ ఏ జోక్

Published Sat, Jun 4 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

నాట్ ఏ జోక్

నాట్ ఏ జోక్

కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. కామెడీ ఆడకపోతే ఏడ్చిన సినిమాలెన్నో! సినిమాకి రన్ ఉన్నట్లే... కమెడియన్‌కు కూడా రన్ ఉంటుంది. క్లాప్‌లు పడుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అసలు మొదటి క్లాప్ పడటానికే ఎన్ని గడపలు తొక్కాలో!  తొక్కాలో, తొక్కించుకోవాలో!  ధన్‌రాజ్, షకలక శంకర్ నవ్వించడానికి, కవ్వించడానికి  రియల్ లైఫ్ టేకులు ఎన్నో తిన్నారు.  అన్ని బొప్పులు కట్టాక.. ఇండస్ట్రీలో నిలబడ్డారు.  ఇదిగో ఇలా మీ ముందు కూర్చున్నారు.

ధన్‌రాజ్: హాయ్ శంకర్.. ‘రాజుగారి గది’ సినిమాలో ఇద్దరం కలిసి బోల్డన్ని సీన్లు చేశాం. మన కాంబినేషన్‌లో ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందంటావ్?
శంకర్:
: ఇప్పుడు చేస్తున్నవే కంటిన్యూ చేస్తే బెటర్ అన్నయ్యా. అప్పట్లో కోట శ్రీనివాసరావుగారు, బాబు మోహన్‌గారు అన్ని సినిమాల్లోనూ తెగ నవ్వించారు. వాళ్లలా మనం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా.

ధన్‌రాజ్: కొత్తగా ఏదైనా ట్రై చే స్తేనే కదా మన గొప్పదనం. సీరియస్ పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది?
శంకర్:చాలా బాగుంటుంది. ఒక పని చేద్దాం. ప్రభాస్, రామ్‌చరణ్ సినిమాల్లో విలన్లుగా చేద్దాం. అప్పుడు వాళ్ల ఫ్యాన్స్ మనకు ట్రీట్‌మెంట్ ఇస్తారు. అది మనకు కొత్తగా ఉంటుంది (నవ్వు).

ధన్‌రాజ్: నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ‘వారెవా ఏమి ఫేసు...అచ్చం హీరోలా ఉంది బాసు..’ అనుకుని ఉంటావు కదా. మరి నీకు హీరోగా చేయాలని ఎప్పుడూ అనిపించలేదా?

 శంకర్: లేదు. నువ్వే హీరోగా మొన్నో సినిమా చేశావ్. ఇప్పుడు ‘బంతిపూల జానకి’ చేస్తున్నావ్. నేను కూడా ఎంటరైతే పేక్షకులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతారన్నయ్యా (నవ్వుతూ).

ధన్‌రాజ్:ఏదో నా ఈ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేవి చేస్తున్నా తప్పితే హీరోగా సెటిల్ అవుదామన్న ఉద్దేశం నాక్కూడా లేదు. మహా అయితే ఒక మూడు నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తానేమో. కమెడియన్‌గా అయితే మూడొందలు సినిమాలు చేసేయొచ్చు.

ఓకేనండి.. ఇప్పుడు మేం (సాక్షి) కొన్ని ప్రశ్నలడుగుతాం..?

 ధన్, శంకర్: ఏవండీ.. మేమిద్దరం పదో తరగతి పాస్. కొంచెం మా స్థాయికి తగ్గట్టుగా అడుగుతారా (నవ్వులు).

హీరోలు సిక్స్ ప్యాక్ చేయాలి.. మీకా ప్రాబ్లమ్ లేదు కదా...
ధన్‌రాజ్: అవునండి. మాలాంటివాళ్లు వర్కవుట్లు గట్రా అంటూ ఇరగబడిపోకూడదు. జిమ్ సెంటర్‌కి వెళ్లి బాగుందా లేదా అని చూసి రావడం బెటర్. ఒకవేళ జిమ్ చేసినా నాకు కండలు రావు. నా జీన్స్ అలాంటివి.

శంకర్: సిక్స్ ప్యాక్ లేకపోయినా కొంచెం ఫిజిక్ బాగుండాలండీ. నన్ను చూసి ఏంట్రా.. ఆ పొట్టేసుకుని! కొంచెం బాగుండాల్రా అని ఇద్దరు, ముగ్గురు హీరోలన్నారు. ‘అదేంటండి.. కమెడియన్‌నే కదా’ అంటే, ‘అయితే ఇలానే ఉండాలని లేదురా... కామెడీ అంటే బాడీతో కాదు.. ఎక్స్‌ప్రెషన్స్ నుంచి కామెడీ పుట్టాల’న్నారు. అప్పట్నుంచీ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. 

హీరోలకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పైగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా.  మీకు ఏమీ అనిపించదా?

ధన్‌రాజ్: మాకూ ఫేస్‌బుక్‌లో ఫాలోయర్స్ ఉన్నారు.  ‘ఆ క్యారెక్టర్ బాగా చేశావ్. లవ్ యు’ అని అమ్మాయిలు మెసేజ్‌లు ఇస్తుంటారు. అభిమానంతో వాళ్లలా అంటారు. అది గ్రహించకుండా మేం కూడా ‘లవ్ యు’ అంటే తేడాలొచ్చేస్తాయ్ (నవ్వు).

ధనరాజ్‌లో మీకు నచ్చిన అంశాలు?
శంకర్: మంచివాడు. ఫ్రెండ్స్‌కు ఏదైనా కష్టమొస్తే ఎంత అర్ధరాత్రి అయినా స్పందిస్తాడు. ఒకవేళ తను చేయాల్సిన పాత్ర వేరొకరికి వస్తే ‘సరే.. తను చేస్తాడా.. ఓకే’ అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అందుకే మా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది.

కామెడీకి ఓ రూపం ఉందనుకుందాం.. అప్పుడు అది ఆడ అయ్యుంటుందా? మగ అయ్యుంటుందా?
ధన్‌రాజ్: నేనైతే అబ్బాయి అనే అంటాను. అబ్బాయి అయితే ఎలాంటి కామెడీ అయినా చేయొచ్చు. అమ్మాయి అయితే హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది.

పువ్వుల్లో కామెడీగా ఉండే పువ్వు ఏది?
ధన్‌రాజ్:మొగలిపువ్వు అండి. ఎందుకోనండి మొగలిపువ్వు అని వినగానే నాకు నవ్వొచ్చేస్తుంది. అందుకని కామెడీ ఫ్లవర్ అంటే నాకు మొగలిపువ్వే.
శంకర్: నాకు పువ్వులతో పెద్దగా పరిచయం లేదండి.
ధన్‌రాజ్: ఏం తమ్ముడూ.. ఈ మధ్య పెళ్లయ్యింది కదా.. మల్లెపువ్వులు కూడా తీసుకెళ్లవా..?
శంకర్: అన్నయ్యా.. సంపేయమాక.

ఫ్రూట్స్‌లో కామెడీగా ఉండేది?
ధన్‌రాజ్: సీమచింతకాయలు. అవి అలా వంకర టింకరగాఎందుకుంటాయ్ అనిపిస్తుంది. ఇవి జంతికల్లా ఎలా పుట్టాయ్ అని నవ్వుకుంటాను.
శంకర్: అయ్య బాబోయ్.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదండి. నాకు అన్ని పండ్లూ రుచిగా అనిపిస్తాయి కానీ, నవ్వు తెప్పించేది ఏదీ లేదండి.

ధన్‌రాజ్:  మనతో నటించేవాళ్లతో కెమిస్ట్రీ సెట్ అయితే దర్శకులు ఇంకా కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య చాలామంది దర్శకులు మాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు.
శంకర్: త్రివిక్రమ్‌గారితో ‘అ..ఆ’ చేశాను. ఆయన ‘శంకర్... నీకో ఫ్లో ఉంటుంది కదా చేసి చూపించు’ అన్నారు. అంత పెద్ద డెరైక్టర్ కూడా అలా అడిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది.

శంకర్... మీరు రామ్‌గోపాల్‌వర్మగారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా! ఆయన ఎప్పుడైనా మెచ్చుకున్నారా?
శంకర్: ‘సత్య-2’ ఆడియో ఫంక్షన్లో ఆయన్ను ఇమిటేట్ చేశాను. సరదాగా నవ్వారు.

అవకాశాలు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడి ఉంటారు?
ధన్‌రాజ్: అవునండి. ఇప్పుడు సినిమాల్లో రావడం చాలా ఈజీ. యూట్యూబ్‌లో మనం చిన్న వీడియో పెడితే చాలు బాగుంటే తీసేసుకుంటున్నారు. నేను ‘జగడం’ చేసే టైమ్‌లో ఫొటో పట్టుకుని తిరిగేవాణ్ని. దాని వెనకాల ‘కె.ధనరాజ్’ అని నా పేరు, హైట్, ఫోన్ నెంబర్ రాసుకునేవాడిని. అది కూడా సొంత ఫోన్ నంబర్ కాదు. పీపీ నంబర్. ఇన్‌కమింగ్ కాల్‌కి రూపాయి తీసుకునేవాళ్లు. ఇప్పటివాళ్లకి అంత బాధ లేదు. శంకర్ అయితే ‘జబర్దస్త్’తో బాగా ఫేమస్ అయ్యాడు.

మీ ఇద్దరికీ మధ్య జరిగిన గమ్మత్తయిన సంఘటన ఏదైనా..
ధన్‌రాజ్: కెరీర్ కొత్తల్లో శంకర్‌కి నేను 1500 రూపాయలకు సెల్‌ఫోన్ అమ్మా. ఇప్పటికీ రూ.500 బాకీ. మరి.. నా 500 ఎప్పుడు ఇస్తావ్? (శంకర్ తో నవ్వుతూ).
శంకర్: చెక్ ఇస్తాన్లే అన్నయ్యా (నవ్వుతూ).

ఇంతకీ మీ కష్టాలు తీరిపోయాయనుకుంటున్నారా?
ధన్‌రాజ్: లేదండి. ఏ స్థాయికి వె ళ్లినా దానికి తగ్గ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా కృష్ణానగర్‌లో మాకన్నా టాలెంటెడ్ కమెడియన్స్ బోల్డంత మంది ఉన్నారు. మా అదృష్టం బాగుండి టీవీలో క్లిక్ అయ్యాం.

స్టూడియో గేటు లోపలికి ఎంటర్ కానివ్వనప్పుడు మనసులో రగిలిపోయారా?
శంకర్: రగిలిపోయిన రోజులు చాలా. ఆ మంట ఉండాలి. లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు.
ధన్‌రాజ్: కాన్ఫిడెన్స్ పెరగకపోయినా ఫర్వాలేదు కానీ, తగ్గితే మాత్రం ఇంత దూరం రాలేం. స్టూడియో గేటుల దగ్గర ఆపేసినప్పుడు ఏదో రోజు మాకు సలామ్ కొడతారని అనుకునేవాళ్లం. కానీ, ఈరోజు మేం ఆ సలాముల కోసం ఎదురు చూడటంలేదు. మా కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉండటం కోసం అప్పట్లో అలా అనుకునేవాళ్లం.

హీరోల్లా మీకు జోడీ ఉండదు కదా.. బాధగా ఉండదా?
శంకర్:ఉంటే బాగానే ఉంటుంది. లేడీ కమెడియన్లు తక్కువ ఉన్నారు. తమిళమ్మాయి విద్యుల్లేఖా రామన్ చాలా బాగా నవ్విస్తుంది. ఇంకా చాలామంది రావాలి.
ధన్‌రాజ్: అంటే లేడీ కమెడియన్ జోడీగా ఉండాలనుకుంటున్నాడన్న మాట. చూశారా.. శంకర్  మనసులో ఎంత ఆలోచన ఉందో (నవ్వుతూ).
శంకర్:జోడీ అని కాదండి. లేడీ కమెడియన్లు ఉంటే బాగుంటుంది కదా అని.

హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలని లేదా?
శంకర్: ఇప్పుడో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాం.
ధన్‌రాజ్: అవునండీ.. ఆవిడెవరో కాదు.. హాట్ గాళ్ సన్నీ లియోన్. మేమిద్దరం ‘బుర్రకథ’ అనే సినిమాలో చేస్తున్నాం. ఆ సినిమాలోనే సన్నీ లియోన్‌తో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. భలే గమ్మత్తుగా ఉంటాయ్.

ఇంకా  స్ట్రగుల్ చేస్తున్నారా? సెక్యూర్డ్ ప్లేస్‌కి చేరుకున్నారా?
ధన్‌రాజ్: ఇంటికి సెక్యూర్టీ పెట్టుకునేంత రేంజ్‌కి ఎదగలేదు కానీ భార్యా కొడుకుని బాగా చూసుకునేంత సెక్యూర్డ్ పొజిషన్‌లో ఉన్నాను. మొన్నీ మధ్యే ఇల్లు కూడా కొనుకున్నాను. హ్యాపీ అండి.

రియల్‌లైఫ్‌లో ఎవరు బాగా నవ్విస్తారు?
శంకర్: నా కన్నా ధనరాజ్ ఎంతమందినైనా నవ్విస్తాడు. ఎదురుగా వందమంది ఉన్నా కంగారు పడడు.
ధన్‌రాజ్: నేను మాట్లాడుతూనే ఉంటా. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను సరదాగా ఉండటానికే ఇష్టపడతాను. శంకర్ నాతో కాకుండా ఎవరితోనూ అంతగా కనెక్ట్ కాలేడు. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. కామెడీ చేసే విషయంలో నాకన్నా తనే బెస్ట్.

మీ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీస్!
ధన్‌రాజ్: ఇద్దరం బుల్లితెర మీద ఫేమస్ అయ్యాం. చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ‘రాజుగారి గది’తో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఒకే ఒక్క తేడా. శంకర్ లావుగా ఉంటాడు...నేను సన్నగా ఉంటా అంతే.

శంకర్ గురించి ఎవరికీ తెలియని విషయం?
ధన్‌రాజ్: శంకర్‌లో మంచి చిత్రకారుడు ఉన్నాడు. ఇలా చూసి అలా గీసేస్తాడు. వంట బాగా చేస్తాడు.
శంకర్: నాకు వంట బాగానే వచ్చండి. బయటివాళ్లకు అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటాను. వినాయక్‌గారికి, కృష్ణవంశీ గారికీ ఇష్టం. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అప్పుడు పవన్ కల్యాణ్‌గారికి చేపల పులుసు వండి తీసుకెళ్లాను. మూడు రోజుల పాటు తిన్నారు.

శంకర్:
నాకీ మధ్యే పెళ్లయ్యింది. ఏదో అలా అలా ఎదుగుతున్నాను. కెరీర్, పర్సనల్ లైఫ్ హ్యాపీ.

హీరోలకైతే పెళ్లి సంబంధాలు క్యూలు కడతాయి. మరి కమెడియన్ల పరిస్థితి ఏంటి? ప్రేమ... గట్రా!
ధన్‌రాజ్: నాది ప్రేమ వివాహం. వన్ డే లవ్‌స్టోరీ. చూడగానే నచ్చింది. చెప్పేశాను. ఒప్పేసుకుంది. పెళ్లి చేసేసుకున్నాను.
శంకర్: నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమలు మనకు సూట్ కావు కూడా. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా.

మ్యారీడ్ లైఫ్‌లో కామెడీ ఎలా ఉంటుందనుకుంటున్నారు?
ధన్‌రాజ్: పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. ఇంటికి త్వరగా వెళ్లిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ కూడా అదే అంటున్నాడు. ‘అన్నా నేను ఇంటికి వెళిపోతాను. నా భార్యతో కబుర్లు చెప్పుకుంటా. కాలక్షేపం అవుతుంది’ అని అంటున్నాడు. నేను తొమ్మిదేళ్ల క్రితం ఇదే అన్నా. జీవితాంతం ఎవరూ ఇలా అనరు. చిన్ని చిన్ని గొడవలు, అలకలు ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా కోసం నటించి, ఇంటి దగ్గర కూడా నటిస్తే మాత్రం జీవితం కూడా సినిమా అయిపోతుంది.

ఏడ్చినా నవ్వినా కన్నీళ్లొస్తాయి... మీకలాంటి సందర్భాలు ఉన్నాయా?
ధన్‌రాజ్:  ‘పిల్ల జమిందారు’ సినిమాలో మా నాన్నగారు చనిపోయే సీన్ ఒకటుంది. మా అమ్మ చనిపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు జేబులో అర్ధరూపాయో, రూపాయో ఉంది. ఆవిడ దహన సంస్కారాలు ఎలా చేయాలి? నాకు ఏడపు రాలేదు. భయం వేసింది. డబ్బు సమకూరాక ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మణికొండలో పూడ్చి పెట్టడానికి స్థలం ఇవ్వలేదు. కాలిస్తేనే ఇస్తాం.. ఇక్కడ ప్లేస్ లేదన్నారు. ‘భవిష్యత్తులో నేను డబ్బులు సంపాదించుకుంటాను. సమాధి కడతాను’ అన్నప్పటికీ ఇవ్వలేదు. అంతకు మించిన పెద్ద బాధాకరమైన సంఘటన నా జీవితంలో ఉండదు. అది గుర్తు చేసుకుని ‘పిల్ల జమిందారు’ సీన్ చేశాను. దాంతో సీన్ పండింది.
శంకర్: సెట్లో మేం కామెడీ సీన్ ఇరగదీసినప్పుడు హాయిగా నవ్వుకుంటాం. బాగా చేశామనే ఆనందం తట్టుకోలేక కూడా కన్నీళ్లొచ్చేస్తాయ్.

నవ్వు రాని కామెడీ ఉంటుంది.. అలా ఎవరైనా కామెడీ చేసినప్పుడు ఎలా ఉంటుంది?
ధన్‌రాజ్: మేం కూడా అలాంటివి కొన్ని చేస్తుంటాం. జేబ్ శాటిస్‌ఫేక్షన్ కోసం చేసినప్పుడు ఇలాంటివాటి గురించి ఆలోచించకూడదు.

ఫైనల్లీ కామెడీ లేని సినిమా గురించి చెబుతారా?
ధన్‌రాజ్: కామెడీ లేని సినిమా అంటే ఆ సినిమా టైటిలే ‘కామెడీ లేని సినిమా’. కామెడీ లేని సినిమా వేస్ట్ అనను. అది లేకుండా కూడా సినిమా ఆడితే అప్పుడా కంటెంట్ చాలా గొప్పగా ఉన్నట్లు. ‘మనీ మనీ’లో ఎక్స్‌ట్రార్డినరీ కామెడీ ఉంటుంది. ‘శివ’లో ఉండదు. ఆ రెండూ బాగా ఆడాయి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు కామెడీ లేకపోయినా ఫర్వాలేదు. కామెడీ లేని సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కొంచెం ఉప్పు తగ్గిన సాంబారు ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంటుంది.
శంకర్:: కామెడీ ఉన్న సినిమా బాగుంటుంది. కథ డిమాండ్ చేయకపోయినా కావాలని కామెడీ పెడితే కామెడీ రాదు. అందుకే, కథకు తగ్గ కామెడీ అయితే బెస్ట్. చివరిగా ఒక్క మాట. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. మమ్మల్నిద్దర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్ అండి.  - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement