ప్రసవ ఆవేదన | Concerns childbirth | Sakshi
Sakshi News home page

ప్రసవ ఆవేదన

Published Tue, Nov 3 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

ప్రసవ ఆవేదన

ప్రసవ ఆవేదన

తొమ్మిదినెలలు మోసి పేగు తెగగానే బంధం తెగితుందా? జీవితం నడవడానికి కొంచెం డబ్బు రావచ్చుకానీ... పుట్టిన బిడ్డ నడవకముందే వదులుకోవడం ఎంత వేదన?మహిళకున్న కష్టాల గురించిపుటలు పుటలు రాస్తున్నా  కొత్త కష్టాలుపుట్టుకొస్తూనే ఉన్నాయ్!ఇదంతా డబ్బుకోసమే చేస్తున్నా స్త్రీ తనకోసం చేసుకోవడం లేదుతన కుటుంబం కోసమో..బంధువుల కోసమోకడుపును అద్దెకిచ్చిపేగు బంధాన్నే త్యజించిఒక ఫ్యాక్టరీగా మారిందిప్రసవ వేదన గురించి  విన్నాం..ప్రసవం తర్వాత ఉండే వేదన గురించీ విన్నాం..కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడ్తుందేమోనన్న ఆవేదన గురించి వింటున్నాం!
 
ఆనంద్... మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా! గుజరాత్ నుంచి పొంగే పాలధార. క్షీర విప్లవం వల్ల కళకళలాడిన ఊరు. అయితే అది ఇంకొకందుకు కూడా ఖ్యాతి గాంచింది. సరోగసీకి. అవును... అక్కడ నిత్యం పసిపిల్లల కేర్‌కేర్‌మనే ఏడుపులు వినిపిస్తాయి. వారిని ఒడిలోకి తీసుకున్న తల్లిదండ్రుల ఆనందబాష్పాలు కనిపిస్తాయి. ఆ ఆనందబాష్పాలకు వెల నిర్ణయించి స్థిరపడిన జీవితాలు కూడా కనిపిస్తాయి. అద్దె గర్భాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆనంద్ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ దేశంలోని అమ్మలు తమ గర్భాన్ని విదేశీ జంటలకు అద్దెకివ్వడానికి వీల్లేదు అనే ఆ తీర్పు మీద చర్చ జరుగుతున్న దరిమిలా ఆనంద్ అమ్మల ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బేబీ ఫ్యాక్టరీస్
అహ్మాదాబాద్ నుంచి వదోదరా వెళుతుంటే మార్గమధ్యంలో కనిపించే ఆనంద్ గత పదేళ్ల నుంచి సంతానలేమితో బాధపడ్తున్న భార్యభర్తలకు బిడ్డల్నిచ్చే కర్మాగారాల నెలవుగా మారింది. ఇక్కడి మెటర్నీటీ నర్సింగ్‌హోమ్స్ అన్నీ సరోగసీ సెంటర్సే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆనంద్‌ను సిటీ ఆఫ్ బేబీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద సరోగసీ కేంద్రం ఇది. ఈ ఊళ్లోని ఒక్క ఆకాంక్ష ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్కే ఇప్పటి వరకు వెయ్యిమంది సరోగసీ బిడ్డలకు పురుడు పోసిందంటే అదేం చిన్న సంఖ్య కాదు. ఈ క్లినిక్‌లో వారానికి ఇద్దరు సరోగసీ బిడ్డలు కేర్‌మంటున్నారంటే సరోగసికి ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇక్కడ యేడాదికి 13 వందల కోట్ల పై చిలుకు వ్యాపారం జరుగుతోంది కనుకనే దీనిని ‘సరోగసీ ఇండస్ట్రీ’ అని సగౌరవంగా పిలుస్తున్నారు. భారతదేశం నుంచే కాదు నైజీరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ జంటలు కూడా ఆనంద్‌కు చేరుకుంటుంటాయి.

వేలమందికి ఉపాధి
ఆనంద్‌లో వెయ్యిమంది సరోగసీ మదర్స్ ఉన్నారని అంచనా. ఆరోగ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఒక్కో అమ్మ తన గర్భాన్ని అద్దెకివ్వడానికి నాలుగు నుంచి పదకొండు లక్షలు చార్జ్ చేస్తోంది. హ్యుమన్‌రైట్స్ కమిషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్‌లో ఇలాంటి విశేషాలు అనేకం తెలిశాయి. బీనా అనే 34 ఏళ్ల సరోగసీ మదర్ తన గర్భాన్ని అద్దెకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో మంచి ఇల్లు కట్టుకుందట. కొడుకుని ఇంజనీరింగ్ చదివించిందట. భర్తకు రద్దీ చోట మంచి హోటల్ పెట్టించిందట. అంతే కాదు సరోగసీ వల్ల తనకు కలిగిన లాభాన్ని మరో ఇద్దరు పేద మహిళలకు వివరించి వారికి కూడా సరోగసీ ద్వారా ఉపాధి చూపించిందట. రాంజుది కూడా అలాంటి పరిస్థితే. ఆమె వయసు 32 ఏళ్లు. ఒక అగ్ని ప్రమాదంలో రాంజు భర్త గాయపడ్డాడు. ఆపరేషన్ కోసం పెద్దమొత్తంలోనే డబ్బులు కావాల్సి వచ్చింది. కూలీనాలీ చేసుకునే జీవితాలకు అంత డబ్బు అప్పుగా దొరకడం కల్లే కనుక ఎవరో చెప్తే విని సరోగసీ మదర్‌గా ఉండడానికి తన పేరును రిజిస్టర్ చేయించుకుంది.

ఒక కెనడియన్ జంటకు బిడ్డను కనిచ్చింది. అప్పటికే ఒక బిడ్డ తల్లి అయిన రాంజుకి ఈ ఒప్పందం ద్వారా ఎనిమిది లక్షలు వచ్చాయి. భర్తకు ఆపరేషన్ చేయించడమే కాక మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంది. తర్వాత రెండో విడతలో జర్మనీ జంటకు బిడ్డకు కనిచ్చింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో భర్తకు ఆటో కొనిపెట్టి తానూ ఓ బడ్డీ కొట్టు పెట్టుకుంది. కొడుకును పె చదువులకు ముంబై పంపించింది. సరోగసీ ద్వారా ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలెన్నో కనిపిస్తాయ్ ఆనంద్‌లో.

ఇతర వ్యాపారాలు
పిల్లల కోసం యేడాదికి రెండువందల విదేశీ జంటలు ఆనంద్‌కు చేరుకుంటాయి. కనీసం ఆర్నెల్ల దాకా బస చేసే ఈ జంటల వల్ల అక్కడి ఆసుపత్రులు, సరోగసీ సెంటర్సే కాదు... ఎయిర్‌పోర్ట్ నుంచి ఆనంద్‌కు తీసుకొచ్చే ట్రావెల్ ఏజెన్సీలకు, వాళ్లకు వసతి కల్పించే హోటళ్లకు, ఆయా దేశ వాసులకు వాళ్ల ఆహారాన్ని వండిపెట్టే రెస్టారెంట్లకు, గుజరాతీ థాలీ రుచులను చూపించే గుజరాతీ కిచెన్‌లకు, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్‌ను అందించే స్టోర్స్‌కు, డైపర్స్ నుంచి మల్టీవిటమిన్ డ్రాప్స్ దాకా ఫారిన్ కంపెనీల మందులను అమ్మే మెడికల్ షాప్స్‌కు, ఇంగ్లిష్ మాట్లాడే స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. గుజరాత్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఖజానా నిండుతోంది. నిజానికి ఆనంద్ శాకాహార రెస్టారెంట్లకు పేరు. కాని సరోగసీ సంతానం కోసం వస్తున్న విదేశీయుల కోసం నాన్‌వెజ్ రెస్టారెంట్ల డిమాండ్ ఏర్పడింది. అవి తెరవక తప్పలేదు. అన్నిటికీ మించి విదేశీ జంటలకు, సరోగసీ మదర్స్‌కు మధ్య లీగల్ అగ్రీమెంట్స్ కుదర్చడం లాయర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సుప్రీంకోర్టు ప్రస్తుత తీర్పుతో వీరందరి ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు మార్కెట్ అనలిస్ట్‌లు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా సరోగసీ మదర్స్ మాత్రం ‘సరోగసీకి మేం ఇష్టపడే ఒప్పుకున్నాం. తొమ్మిది నెలల్లో మంది సంపాదననిచ్చే మార్గం ఇది. కోర్టు తీర్పు వల్ల విదేశీయులు రాకపోవచ్చట. వాళ్లు ఇచ్చినంత డబ్బులు మన వాళ్లు ఇవ్వరు. మాకైతే సంపాదన పోయినట్టే. మళ్లీ కూలీనాలీ అంటే కష్టమే’ అని వాపోతున్నారు..
 
 - సాక్షి ఫ్యామిలీ
 
తెలుగు రాష్ట్రాల ఆనంద్

దేశంలో సరోగసీకి గుజరాత్ తర్వాత తెలుగు రాష్ట్రాలే ప్రధాన కేంద్రాలు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ఈ విషయంలో ముందంజలో ఉంది. విదేశీ జంటల దృష్టి ఇంకా పడకపోయినా ప్రవాస భారతీయ జంటల సంతాన సాఫల్య కేంద్రంగా ఇది ప్రచారం పొందుతోంది. గత అయిదేళ్లలో 100 మందికి పైగా సరోగసీ బిడ్డలకు ఈ నగరం జన్మనిచ్చింది. ఇక్కడి సరోగసి మదర్ కూడా 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులను డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. సరోగసీ వల్ల ఆనంద్ లాంటి మౌలిక సదుపాయాలు, వ్యాపారం ఇక్కడ పెరగకపోయినా,  సరోగసీ మదర్స్‌ను కంటికి రెప్పలా కాపాడే అత్యంతాధునిక వైద్యసదుపాయాలున్న ఆసుపత్రులు, సకల సౌకర్యాలున్న హాస్టల్స్, లైబ్రరీలు, వీడియో లైబ్రరీలు వెలుస్తున్నాయి.

ప్రవాస జంటలు తమ బిడ్డ ఉన్న సరోగసీ మదర్‌కు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే విషయంలో శ్రద్ధ చూపుతుండటం వల్ల  డైటీషీయన్లకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయ జంటలకు గర్భం అద్దెకివ్వచ్చు అన్న వెసులుబాటు సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఆనంద్‌కు ఉన్న గిరాకీ ఇక మీద కరీంనగర్‌కు మారవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్‌లోని సంతాన సాఫల్యకేంద్రాల్లోని గైనకాలజిస్ట్‌లు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement