రైతు జేబు చల్లగా...
పండిన పంట అమ్ముకుందామంటే... తగిన ధరలు ఉండవు.
ధరలొచ్చేదాకా ఆగితే... పంటలు పాడవుతాయి.
గిడ్డంగులు, అక్కరకొచ్చే శీతలీకరణ వ్యవస్థలూ అంతంతమాత్రమే.
ఇదీ 21వ శతాబ్దంలోనూ రైతు ‘భారతం’!
కానీ... కొన్ని సంస్థల పరిశోధనల పుణ్యమా అని...
ఈ చీకట్లోనూ చిన్న చిన్న కాంతిరేఖలు కనిపిస్తున్నాయి!
ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు. పాలు, పండ్లు, కూరగాయలు, తిండిగింజలు మార్కెట్‌కు చేరకముందే నష్టపోతున్న మొత్తమిది. ఉన్న అరకొర గిడ్డంగుల్లో తిండిగింజలు పందికొక్కులకు ఆహారమైపోతూంటే... శీతలీకరణ వ్యవస్థలు అందుబాటులో లేక 30 శాతం వరకూ కాయగూరలు, పండ్లు కుళ్లిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ నష్టం ఏడాదికి రూ.5600 కోట్ల వరకూ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితం... రైతు పంట అయినకాడికి అమ్ముకోవాలి. దళారీలు, మధ్యవర్తుల లాభాల పంట పండాలి! ఇలా కాకుండా.. గ్రామస్థాయిలోనే అతితక్కువ ఖర్చుతో పాలు, పండ్లు, కాయగూరలు నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటే ? అద్భుతంగా ఉంటుంది. కొందరు విదేశీ శాస్త్రవేత్తలు, దేశంలోని ఓ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా చేసిన పరిశోధనల ఫలితంగా ఇప్పుడీ అద్భుతం సాధ్యమయ్యే అవకాశముంది!
సూర్యుడే అండ..దండ!
గ్రామస్థాయిలో పండ్లు, కాయ గూరలు నిల్వ చేసుకునేందుకు నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎకోజెన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఓ వినూత్న శీతలీకరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు ముగ్గురు స్థాపించిన ఈ కంపెనీ అయిదేళ్లుగా రైతులకు ఉపయోగకరంగా ఉండే టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. సౌరశక్తితో పనిచేసే పంప్‌సెట్లు, విద్యుత్తును ఆదా చేసే పరికరాలతోపాటు రైతుల కోసం శీతలీకరణ వ్యవస్థలను తయారు చేస్తోంది. గ్రామాల్లోని విద్యుత్ కోతలను దృష్టిలో ఉంచుకుని దీన్ని సౌరశక్తి ఆధారంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. కానీ సౌరశక్తిని నిల్వ చేసుకునేందుకు బ్యాటరీల అవసరం మాత్రం ఉండదు.
ఎకోఫ్రాస్ట్ టెక్నాలజీస్ పేరుతో అభివృద్ధి చేసిన శీతలీకరణవ్యవస్థ పన్నెండు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు, ఎత్తుతో చిన్న కంటెయినర్ మాదిరిగా ఉంటుంది. ఒక్కోదాంట్లో దాదాపు 5 టన్నుల పండ్లు, కాయగూరలను నిల్వ చేసుకోవచ్చు. పండ్లు, కాయగూరలని వేర్వేరు ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి... అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి.
మొత్తమ్మీద కంటెయినర్ లోపలి ఉష్ణోగ్రతలు 0-20 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండేలా చేయవచ్చు. ప్రస్తుతం ఒక్కో ఎకోఫ్రాస్ట్ వ్యవస్థ ఖరీదు రూ. 6 లక్షల వరకూ ఉందని కంపెనీ వ్యవస్థాపకుడు దేవేందర్‌గుప్తా ‘శాస్త్ర’కు తెలిపారు. శీతలీకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు, అదేసమయంలో ఖరీదును తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
కొత్త బ్యాటరీతో పాలకు రక్ష...
పితికిన పాలు కొన్ని గంటల వ్యవధిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. నాలుగు గంటలు గడిచిందంటే చాలు.. అందులో హానికారక బ్యాక్టీరియా పెరిగిపోయి, పోషకవిలువలు తగ్గిపోతాయి. ఈ ఇబ్బందిని తొలగించేందుకే ఇళ్లల్లో మనం పాలు కాచేస్తూంటాం. మన సంగతి సరే, పాడి రైతు ఏం చేయాలి? పితికిన వెంటనే అమ్ముకోవాలి. లేదంటే పాలు పాడై పోతాయి. రైతు నష్టపోతాడు. మరి ఈ సమస్యకు పరిష్కారం? ప్రొమేథియన్ పవర్ సిస్టమ్స్ తయారు చేసిన ర్యాపిడ్ మిల్క్ ఛిల్లర్! విద్యుత్ సాయంతో చల్లగా మారిన ప్రత్యేక ద్రవ పదార్థం... మూడు డిగ్రీ సెల్సియస్ స్థాయికి పాలను వేగంగా చల్లబరచడం ఈ రిఫ్రిజరేటర్ ప్రత్యేకత గ్రామాల్లో అప్పుడప్పుడూ మాత్రమే ఉండే విద్యుత్తుతోనూ దాదాపు 12 గంటల పాటు పాలను చల్లగా ఉంచగలుగుతుంది.
సాధారణ బ్యాటరీ స్థానంలో విద్యుత్ శక్తిని ఉష్ణం రూపంలో నిల్వ ఉంచుకునే థర్మల్ బ్యాటరీ మహత్యమిది. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్త సామ్‌వైట్ ఈ రకమైన టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో ముందుగా సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఓ శీతలీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు కూడా. అయితే దాదాపు 300 చదరపు అడుగుల మేరకు ఉండే ఈ రిఫ్రిజరేటర్ 2000 లీటర్ల థర్మల్ బ్యాటరీని ఉపయోగించుకుని కేవలం 500 లీటర్ల పాలను నిల్వ చేసేది.
ఇదంత ఉపయోగకరం కాదని సామ్ గుర్తించారు. స్థానికంగా ఉన్న కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపడంతో సామ్ తన డిజైన్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఫలితంగా కేవలం 500 లీటర్ల థర్మల్ బ్యాటరీతో దాదాపు వెయ్యి లీటర్ల పాలను నిల్వ చేసే శీతలీకరణ వ్యవస్థ సిద్ధమైంది. దాదాపు రూ.5 లక్షలు ఖరీదు చేసే ఈ వ్యవస్థను ఇప్పటికే కొన్ని ప్రవేట్ కంపెనీలు గ్రామస్థాయిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా రైతులకు శ్రమ తగ్గడమే కాదు... కొంత సొమ్ము ఆదా చేసుకోగలుగుతున్నారు కూడా.