దివి నుంచి భువికి ముక్కోటి | Devotional Storys Of Mukkoti Ekadashi | Sakshi
Sakshi News home page

దివి నుంచి భువికి ముక్కోటి

Published Sun, Jan 5 2020 12:38 AM | Last Updated on Thu, Apr 14 2022 1:23 PM

Devotional Storys Of Mukkoti Ekadashi - Sakshi

వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. సంక్రాంతిలాగే ఇది కూడ సౌరమానాన్ననుసరించి  జరిపే పండుగలలో ఒకటి. కర్కాటక సంక్రమణం, ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరమాసంలో లేదా పుష్యమాసంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ఆ నిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగను దక్షిణాదిన కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత కలది కావడం చేత దీనికీ పేరు వచ్చిందని చెబుతున్నారు. ‘కృతయుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని ‘ముర‘ అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు.

దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మీదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ పర్వదినాన దేవాలయాల ఉత్తరద్వారాన శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రప్రమాణం. ఈరోజే శ్రీరంగ క్షేత్రాన శ్రీరంగ దేవాలయంలో ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు.

ఈరోజు ఏం చేయాలి?
ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటాన్ని గంధంతోటీ, జాజిమాలతోటీ అలంకరించి ఆయనకు ప్రీతికరమైన పాయసంతో పాటు వివిధరకాల తీపిపదార్థాలను లేదా ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించడం విశిష్ట ఫలదాయకమని పెద్దలు చెబుతారు. అన్నింటికీ మించి ఈ పర్వదినాన స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం, విష్ణులీలలను తెలిపే గ్రంథాలను భగవద్భక్తులకు దానం చేయడం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఉపవసించడం, యథాశక్తి దాన ధర్మాలు చేయడం, జాగరణ చేయడం  వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమలలోనూ, ఉడిపిలోనూ, గురువాయూర్‌లోనూ, అరసవిల్లి, శ్రీకూర్మం, లోనూ, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోనూ, భద్రాద్రిలోనూ, యాదాద్రిలోనూ ఇంకా అనేకానేక ఆలయాలో నేడు భక్తులు తెల్లవారు జామునుంచే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని పులకాంకితులవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement