
ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుందని మనకు తెలుసు. వెయిల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో విషయాన్ని కనుక్కున్నారు. ఈ రకమైన ఆహారంతో మతిమరుపు మొదలుకొని అనేక మెదడు సంబంధిత కార్యకలాపాల్లో తేడాలు రావచ్చునని ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా వీరు గుర్తించారు. మెదడుకు.. మన కడుపు/పేగులకు మధ్య ఇప్పటివరకూ గుర్తించని ఓ సంబంధం వల్ల ఇలా జరుగుతోందన్నది వారి అంచనా. కొన్ని ఎలుకలకు అధిక మోతాదులో ఉప్పు ఉన్న ఆహారాన్ని అందించినప్పుడు వాటి మెదడులోని కార్టెక్స్ ప్రాంతంలో రక్త సరఫరా 25 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. అలాగే ఎనిమిది వారాల తరువాత హిప్పోకాంపస్‌లోనూ ఇంతే స్థాయి తగ్గుదల నమోదైంది.
ఈ ఎలుకలకు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు సాధారణ ఎలుకల కంటే చాలా అధ్వానమైన ఫలితాలు వచ్చాయి. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు తెల్ల రక్తకణాలు ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం.. ఫలితంగా ఎండోథీలియల్ కణాల్లో నైట్రిక్ యాక్సైడ్ తగ్గిపోవడం ద్వారా మెదడుపై ప్రభావం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మందుల ద్వారా ఈ ప్రొటీన్‌ను అందించగా పరిస్థితులు చక్కబడ్డాయి. కీళ్లనొప్పుల వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలప్పుడు కూడా ఈ ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఎలుకలు నాలుగు వారాల్లో సాధారణ స్థితికి వచ్చినట్లు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment