లాక్‌డౌన్ సమయం కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను పెంచుకోవడానికే కాదు వారితో ఉన్న విభేదాలను కూడా తరచి చూసుకోవడానికి ఉపయోగపడుతున్నట్టు తెలుస్తోంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి ఈ పరిస్థితి ఎదురైంది. అతని భార్య ఆలియా అతనికి విడాకుల నోటీసు పంపింది. ‘కారణాలు చాలా ఉన్నాయి. అవి తీవ్రమైనవి. బయటకు చెప్పేవి కావు’ అని ఆమె మీడియాకు తెలియచేసింది.
‘పెళ్లయిన మరుసటి సంవత్సరం నుంచే మా కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఎలాగో ఉగ్గబట్టుకుని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇప్పుడు అసంభవం అనిపిస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో నా జీవితాన్ని తరచి చూసుకునే వీలు కలిగింది. తక్షణమే అతనికి విడాకుల నోటీసు పంపాను’ అని ఆమె చెప్పింది. మే 7న వాట్సాప్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా సిద్దిఖీకి ఆమె నోటీసు పంపింది. నేరుగా పంపడానికి పోస్టల్ సర్వీసులు అందుబాటులో లేవన్న సంగతిని గుర్తు చేసింది. కాగా ఈ విషయంపై నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించాల్సి ఉంది.
పదేళ్ల కాపురం
నవాజుద్దీన్ సిద్దిఖీకి, ఆలియాకు సుదీర్ఘకాలంగా స్నేహం ఉంది. ఇద్దరూ ముంబైలో సినిమా రంగంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చి ఆమె అతని నుంచి విడిపోయింది. ఆ సమయంలో తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని నవాజుద్దీన్ పెళ్లి చేసుకున్నాడని అయితే ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదని, అందుకు కారణం బావమరిది జోక్యం అధికంగా ఉండటమేనని ఒక కథనం ఉంది.
ఆ తర్వాత ఆలియా మళ్లీ నవాజుద్దీన్ సిద్దిఖీకి సన్నిహితమయ్యింది. ఈసారి పెళ్లి ప్రస్తావన చేసింది. 2010లో వారు వివాహం చేసుకున్నారు. ఆలియా అసలు పేరు అంజనా ఆనంద్ కిశోర్. పెళ్లి తర్వాత ఆలియాగా మారింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇన్నాళ్ల తర్వాత విడాకులకు సిద్ధపడింది. ‘మా నోటీసుకు స్పందిస్తే సరే. లేకుంటే కోర్టులు తెరుచుకోగానే విడాకుల పిటిషన్ దాఖలు చేస్తాం’ అని ఆలియా లాయర్ తెలియచేశాడు. ప్రస్తుతం ఆమె మెయిన్‌టెనెన్స్ డిమాండ్ చేస్తోంది.
వివాదాలు
తొలి రోజుల్లో చిన్న వేషాలు వేసిన నవాజుద్దీన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్’, ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘బద్‌లాపూర్’ వంటి సినిమాలతో ఊహించలేనంత పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్’, ‘ఫ్రీకీ అలీ’, ‘థాకరే’ తదితర సినిమాలతో హీరో అయ్యాడు. ఈ క్రమంలోనే ఆటోబయోగ్రఫీ వెలువరించి అందులో తన ప్రేమ సంబంధాలన్నీ రాసుకొచ్చాడు. అది వివాదాస్పదం కావడంతో ఆ ఆటోబయోగ్రఫీని వెనక్కు తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం సిద్దిఖీ తన భార్య మీద డిటెక్టివ్‌లను నియమించాడన్న వార్త గుప్పుమంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆలియా వాటిని ఖండించింది.
సిద్దిఖీ అలా చేయడని, ప్రస్తుతం తన కాపురం హాయిగా సాగుతోందని తెలిపింది. అయితే ఆమె తాజా నిర్ణయం వీటన్నింటి కొనసాగింపు అని అనుకోవాల్సి వస్తోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం తన సొంత ఊరు ముజఫర్ నగర్‌లో ఉన్నాడు. అతడి సోదరి ఇటీవల మరణించడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఆమె అంత్యక్రియలకు హాజరయ్యి క్వారంటైన్‌లో ఉన్నాడు. ‘నా తల్లిని చూసుకుంటున్నాను’ అని ట్విటర్‌లో షేర్ చేశారు. ఆలియా నోటీసుకు గానీ, ఆమె ఆరోపణలకు గానీ అతను ఇంకా స్పందించలేదు. త్వరలో అతని వివరణ రావచ్చని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment