సెంటిమెంట్స్ ప్రతివాళ్లకూ ఎంతో కొంతమేర ఉంటాయి. అవి సహజం కూడా. సెంటిమెంట్‌ల విషయంలో మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉంటారో, పర్టిక్యులర్‌గా ఉంటారో చెక్ చేసుకోండి.
1. అర్జెంట్ పనిమీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే...ఆ పని నలుగురితో కలిసి వెళ్లాల్సినదైతే అలాగే సాగిపోతారు. అంతేగాని ఆగరు.
ఎ. అవును బి. కాదు
2. మీరు రెగ్యులర్‌గా ముఖం చూసి లేచేవారి ముఖం చూడని రోజున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వేళ కనబడ్డ వారిని ద్వేషించరు. అది యాదృచ్ఛికం అని సర్దుకుపోతారు.
ఎ. అవును బి. కాదు
3. ముహూర్తాలపై నమ్మకం ఉన్నా... మీరు బయల్దేరాలనుకున్న ఆ సమయం మీ ప్రయాణానికి అనువుగా లేకపోతే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతారు.
ఎ. అవును బి. కాదు
4. పరీక్ష విజయవంతంగా రాసేందుకు దోహదం చేస్తుందనే పెన్ను పైనగాని, షర్ట్‌పైగాని మీకు సెంటిమెంట్ ఉంటే... ఒకవేళ అందుబాటులో లేకపోతే కొత్తదానితో ప్రొసీడ్ అవ్వగలరు.
ఎ. అవును బి. కాదు
5. పరీక్షలయ్యాక ఫలానా థియేటర్‌లో సినిమా చూడాలనే సెంటిమెంట్ ఉన్నా ఆ పూట టిక్కెట్లు దొరకకపోతే మీరు బాధపడరు.
ఎ. అవును బి. కాదు
6. మీరు రోజూ పొద్దున్నే దినఫలాలు యథాలాపంగా చూస్తారు గాని... మళ్లీ అవి గుర్తుండవు. మీ రోజు గడిచిన తీరును దానికి ఆపాదించరు.
ఎ. అవును బి. కాదు
7. పర్స్ వంటి వాటిపై సెంటిమెంట్ ఉన్నా, అది పూర్తిగా చిరిగిపోతే కొత్తది కొనుక్కుంటారు.
ఎ. అవును బి. కాదు
8. విధి రాతను మీరు నమ్మినా, మీ ప్రయత్నాల వల్లనే మీకు విజయాలు లభిస్తాయని తెలుసు. పూర్తిగా విధినే నమ్ముకుని, మీరు చేయాల్సిన వాటిని గాలికి వదిలేయరు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకు మించి వస్తే మీకు సెంటిమెంట్స్ ఉన్నా వాటికి మీరు బానిస కాదు. ‘బి’ సమాధానాలు ఆరు దాటితే మీరు సెంటిమెంట్‌లను బలంగా నమ్ముతారు.
సెంటిమెంట్ ఆత్మవిశ్వాసం కలిగించేదిగా ఉండాలి గాని దినచర్యకు అడ్డంకిగా మారకూడదు. సెంటిమెంట్ స్థాయిని మించి మూఢనమ్మకంగా మారుతుంది. కాబట్టి ఒకవేళ మీలో సెంటిమెంట్స్ ఉన్నా మీ జీవితంలో వాటి జోక్యాన్ని మితిమీరనివ్వవద్దు