ఇంటింటికీ తిరిగి ఎకో ప్యాడ్స్ పరిచయం చేస్తున్న ‘షైన్’ వలంటీర్లు
ప్లాస్టిక్‌తో తయారైన ఒక శానిటరీ ప్యాడ్ మట్టిలో కలిసిపోవడానికి 500–800 ఏళ్లు పడుతుందని అంచనా! ఇంత ప్రమాదకరమైన మెటీరియల్‌ని కొని, వాడి.. టన్నులకొద్దీ చెత్త పోగయ్యాక ప్రభుత్వాలని ప్రశ్నించడం సరైన పనేనా? మనలోనే ఒక సాధారణ మహిళ మదిలో ఈ ప్రశ్న తలెత్తింది. అందుకు సమాధానంగా తనే ముందడుగు వేసి, పర్యావరణహితమైన ప్యాడ్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఆ మహిళే చదురుపల్లి పరమేశ్వరి.
దుకాణాల్లో దొరికే శానిటరీ ప్యాడ్‌లు సింథటిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. వీటిని నాలుగు గంటలకొకసారి మార్చుకోవాలి. లేకపోతే వ్యాధులు సోకే అవకాశం ఉంది. వాడి పడేసిన ఈ ప్యాడ్‌లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి కూడా. అదే కలపగుజ్జుతో తయారు చేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా తొందరగా భూమిలో కలిసిపోతాయి అంటారు పరమేశ్వరి. ‘షైన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎకోఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌ల తయారీ, వాటి వినియోగంపై అవగాహనతో పాటు ఎంతమంది మహిళలకు జీవనోపాధి కూడా కల్పిస్తున్నారామె.
కష్టాలనుంచి ‘షైన్’ అయ్యారు
పరమేశ్వరిది పేద కల్లుగీత కార్మిక కుటుంబం. కుటుంబంలోని నలుగురు పిల్లల్లో ఆమె ఒకరు. కూలి పనులు చేసుకుంటూ చదువుకున్నారు. పలు వృత్తివిద్యా కోర్సులూ నేర్చుకున్నారు. 2009లో పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చేశారు. ‘‘కొన్నేళ్ల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను గర్భిణిని. ఎముకలు బలహీనంగా ఉన్నాయి, ఇక బతకటం కష్టం అని చెప్పారు. కాని సకాలంలో చికిత్స అందటం వల్ల బతికాను. ఏడాదిపాటు మందులు, ఆసుపత్రి ఖర్చుల తర్వాత నాలుగు లక్షల అప్పు నెత్తిన పడింది’’ తన కష్టకాలం గురించి చెప్పారు పరమేశ్వరి.
‘‘ఆ సమయంలోనే నాన్నకు పక్షవాతం రావడంతో అమ్మ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని నడిపేందుకు పడిన బాధలు గుర్తొచ్చాయి. ఆమెలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు సహకారం అందించాలనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం ‘సొసైటీ ఫర్ హెల్పింగ్ ఇంటిగ్రిటీ నెట్‌వర్క్ ఫర్ ఎంపవర్‌మెంట్’(షైన్) సంస్థను ప్రారంభించి, నేను, మరికొందరం కలిసి పేద మహిళలకు టైలరింగ్, బ్యూటీ కోర్సులూ, కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాం. దేశంలో పది రాష్ట్రాల్లో శానిటరీ ప్యాడ్‌ల తయారీ ప్రారంభించాం. మా నిర్వహణ, అవగాహన కార్యక్రమాల విషయంలో మా సెంటర్‌కు మొదటి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నుండి నాకు ‘స్త్రీ స్వాభిమాన్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ వచ్చింది. భవిష్యత్తులో మహిళలకు నైపుణ్య శిక్షణలతో పాటు ఆరోగ్యం–పరిశుభ్రతలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’’ అని చెప్పారు పరమేశ్వరి. ఇప్పుడు వీరి సంస్థ ‘షైన్’.. నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భాగస్వామి!
ఆలోచన ఎలా వచ్చింది?
శానిటరీ ప్యాడ్స్ తయారీకి ముందు పరమేశ్వరి వివిధ జీవన నైపుణ్యాలపై అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు. వాటన్నిటినీ పక్కకు నెట్టి పూర్తిగా ప్యాడ్‌ల తయారీలో నిమగ్నం అయ్యారు. అందుకు కారణాలు లేకపోలేదు. ‘‘షైన్‌ని స్థాపించే ముందు నేను కొన్ని పల్లెటూళ్లకి వెళ్లి రుతుస్రావ సమయంలో వారి అలవాట్లను పరిశీలించాను. చాలా ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని తండాల్లో మహిళలు నెలసరి సమయంలో బట్టలో ఇసుక చుట్టి వాడడం గమనించాను. కొంతమంది జనపనారను వాడుతున్నారు. దేవరకొండలో అయితే మరీ దారుణం. కట్టెల పొయ్యి బూడిదను పాతబట్టలో చుట్టి వాడుతున్నారు. దీని వల్ల వాళ్లకు ఇన్‌ఫెక్షన్లు వచ్చి, రోగాల బారిన పడుతున్నారు. నెలసరి సమయంలో యావరేజ్‌గా ఒక మహిళకు ఏడు శానిటరీ ప్యాడ్‌ల అవసరం ఉంటుంది. అయితే, ప్రతినెల వాటిని కొనే స్థోమత లేని వారు మోటు పద్ధతులను పాటిస్తున్నారు. దీనిని నివారించేందుకే చెట్టుబెరడుతో తయారైన పర్యావరణహిత శానిటరీ ప్యాడ్‌ల తయారీ చేపట్టాం. అవి ఇటు ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికీ మేలు చేస్తాయి’’ అన్నారు పరమేశ్వరి.
మెటీరియల్ ఎలా లభిస్తుంది?
కేంద్ర ఐటీ శాఖ మహిళల ఆరోగ్య రక్షణ, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలతో చేపట్టిన ‘స్త్రీ స్వాభిమాన్’ పథకంలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో తొలిసారిగా షైన్ పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీని ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరించారు. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జు రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌లోని షైన్ సంస్థకు తరలిస్తారు. అక్కడ ఎనిమిది దశల్లో గుజ్జును ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా చేతితో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 40 నుండి 50 వేల ప్యాడ్‌లను ఉత్పత్తి చేసి గ్రామాలకు పంపుతున్నారు. ప్యాడ్‌ల వాడకంపై అవగాహన కల్పించడం కోసం ఇరవై గ్రామాలు తిరిగారు.
సెర్వైకల్ క్యాన్సర్‌పైనా అవగాహన
‘‘మార్కెట్‌లో దొరికే ఇతర రకాల శానిటరీ ప్యాడ్‌ల ధర ఎక్కువగా ఉంటోంది. అందుకే పేద మహిళలందరికీ అందుబాటులో ఉండేలా మా షైన్ సంస్థ ఎనిమిది ప్యాడ్‌ల ప్యాక్‌ను రూ.28 కే అందజేస్తోంది. మనదేశంలో మహిళ సెర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనిని నివారించాలంటే నెలసరి గురించి బాలికలకు సరైన అవగాహన కల్పించాలి. ఇందుకు కావలసిన అవగాహన కార్యక్రమాలను కూడా మా వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా సహాయం లభిస్తే ఈ కార్యక్రమాలను మరింత విస్తృత పరచగలం’’ అని అశాభావ్యం వ్యక్తం చేస్తున్నారు పరమేశ్వరి.
తాము తయారు చేసిన ప్యాడ్స్‌ను స్థానిక విద్యార్థినులకు, చుట్టుపక్కల మహిళలకు ఉచితంగా అందజేశారు. వాళ్లిచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో తయారీలో లోపాలను సవరించుకుంటూ ప్యాడ్స్‌ను అత్యుత్తమ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో శిబిరాలు ఏర్పాటు చేసి పర్యావరణహిత ప్యాడ్‌ల వాడకం వల్ల కలిగే ప్రమోజనాలను వివరిస్తున్నారు.– ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment