అతి సర్వత్ర వర్జయేత్ అని సామెత. ఏదైనా అవసరానికి మించి చేస్తే ముప్పు తప్పదని దీనర్థం. కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచివని మనం చాలాకాలంగా వింటున్నాం కదా.. అలాగని వీటిని ఎక్కువగా తింటే గుండెకు చేటు అంటున్నారు మసాచూసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అమెరికాలోని దాదాపు 30 వేల మందిని ఏకంగా 31 ఏళ్లపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు కేథరీన్ టకర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జుకర్‌బర్గ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్త నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజుకు తినే గుడ్ల సంఖ్య ఎంత పెరిగితే ముప్పు కూడా అంతే పెరుగుతుంది.
అధ్యయనంలో పాల్గొన్న వారి ఆహారపు నాణ్యత, వ్యాయామం చేసే అలవాట్లు వంటివన్నీ పరిశీలించామని చెప్పారు. అమెరికాలో గుడ్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తమ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడిందని కేథరీన్ అంటున్నారు. 2017లో సగటున ఒక్కో అమెరికన్ 279 గుడ్లు తిన్నారని.. ఈ సంఖ్య 2012లో 254 మాత్రమేనని వివరించారు. ఒక్కో గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందని.. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశం 17 శాతం ఎక్కువవుతుందని మరణం సంభవించే అవకాశం 18 శాతం ఉంటుందని కేథరిన్ వివరిస్తున్నారు. దీన్నిబట్టి రోజుకు మూడు గుడ్లతో కూడిన ఆమ్లెట్లను తినడం అంత మంచిది కాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment