భర్త నారాయణతో ప్రజ్ఞా కేస్కర్
‘తినే స్పూన్లను తయారుచేస్తాను. నాకు లోన్ ఇవ్వండి’ అని నారాయణ పీసపాటి బ్యాంకులను సంప్రదించినప్పుడు,బ్యాంకు మేనేజర్‌లు కూడాఆయన్ని తినేసేలా చూశారు. అయితే ఇక్రిశాట్‌లో సైంటిస్టుగా ఆయన పనితనం, అంతకుముందు బరోడాలో పన్నెండేళ్ల అనుభవం గురించి తెలిశాక ‘కుదరదు’ అని గట్టిగా చెప్పలేకపోయారు. కానీ.. ‘తినే స్పూన్లను కొనేదెవ్వరు? మీరు మా లోన్ తీర్చే మార్గం çసమీప భవిష్యత్తులో కనిపించడం లేదు’ అన్నారు. అలా.. ‘మీకు లోన్ ఇవ్వడం కుదరదు’ అనే అర్థాన్ని సున్నితంగా తెలియచేశారు. బ్యాంకు వాళ్లే కాదు నారాయణ్ భార్య ప్రజ్ఞా కేస్కర్ కూడా ‘ఏమిటిది ఫన్నీగా’ అని నవ్వేశారు.
నిజానికి నారాయణ దశాబ్దాల పాటు చదివిన చదువుని, చూసిన సమాజాన్ని మేళవించి, మేధనంతా రంగరించి చేసిన పరిశోధన ఇది. అంతకంటే ఎక్కువగా తాను నమ్మిన సిద్ధాంతం. దానిని ఆచరణలో పెట్టడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును వదిలేది లేదనుకున్నారు. ఆయన ఇక్రిశాట్ ఉద్యోగాన్ని వదిలింది కూడా ఈ ప్రాజెక్టు కోసమే, కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించిన తర్వాత తనకు దొరికిన ఒక సొల్యూషన్ ఇది. సమాజానికి ఈ తినే స్పూన్లను అలవాటు చేయడం సైంటిస్టుగా తన బాధ్యత అనుకున్నారు. అందుకే చేతిలో ఉన్న డబ్బుతోపాటు ఉన్న ఇంటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి ‘బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో 2010లో తినే స్పూన్లు, ఫోర్కులను తయారు చేసే యూనిట్‌ని స్థాపించారు. ఆ యూనిట్ నిర్వహణ బాధ్యత చూసుకుంటున్న ప్రజ్ఞా కేస్కర్ నారాయణ్ ఈ ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.
ప్లేటుంది.. స్పూన్ లేదు!
ఇక్రిశాట్‌లో ఉన్నప్పటి నుంచి భూగర్భ జలాల పరిరక్షణ, నీటిని అనవసరంగా తోడేయడాన్ని నివారించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం వంటి కోణాల్లో మా వారి పరిశోధనలు సాగాయి. ప్లాస్టిక్ స్పూన్ల వల్ల ఎంత గ్రీజ్ కడుపులోకి వెళ్తుందనే విషయాలను కూడా నిశితంగా పరిశోధించేవారు. వీటన్నింటినీ అరికట్టాలంటే ఎవరో ఒకరు ఒక ప్రయత్నమంటూ చేయాలి కదా. సమాజంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగిందనేదొక్కటే మనకు కనిపిస్తోంది. ఇంకా లోతుల్లోకి తవ్వుతూ పోతే భయంకరమైన నిజాలు తెలిశాయి. ఒక ఫంక్షన్ జరిగితే భోజనాల తర్వాత ఆ ప్లేట్లు, స్పూన్‌లు చెత్త బుట్టల్లోకి చేరాలి కదా! ధర్మాకోల్ ప్లేట్లు మాత్రమే గార్బేజ్ బిన్‌లో కనిపిస్తాయి, ప్లాస్టిక్ స్పూన్లు చేరవు. ఒకరోజు మావారు ఐస్‌క్రీమ్ పార్లర్ ముందు రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు నిలబడి అక్కడేం జరుగుతోందో గమనించారు. పార్లర్ మూసేస్తూ పార్లర్ వాళ్లు డస్ట్‌బిన్‌ను బయట పెట్టి వెళ్లిపోయారు. ఆ బిన్‌లో కర్రపెట్టి కెలికి మరీ చూశారట నారాయణ! ఐస్‌క్రీమ్ కప్పులతోపాటు విరిగిన స్పూన్లు రెండు మూడు మాత్రమే ఉన్నాయి. కప్పులు ఉన్నన్ని స్పూన్లు ఉండాలి కదా, అలా లేవు. అంటే మిగతావి రీయూజ్ అవుతున్నాయన్నమాట!
భోజనానికి ప్లేట్‌కి కనీసంగా ఐదు వందల రూపాయలు వసూలు చేసే హోటళ్ల నుంచి.. కప్పు ఐస్‌క్రీమ్‌కి రెండు వందలు వసూలు చేసే పార్లర్ల వరకు ప్లాస్టిక్ స్పూన్‌ల రీయూజ్ కి పాల్పడుతున్నాయి. వాటిని ఎలా వాడినా అనారోగ్యం తప్పదు. అంతకంటే ఘోరం ఏమిటంటే.. స్పూన్లు తయారు చేసే కంపెనీల్లో.. ప్యాకింగ్‌కి ముందు స్పూన్‌లను తుడిచే క్లాత్‌ను చూస్తే ‘ఇప్పటికి మన కడుపులోకి ఎంత గ్రీజ్ వెళ్లి ఉంటుందో’ ననే ఆలోచనతో కడుపు తిప్పినట్లవుతుంది. ఒక్కో స్పూన్‌కి ఉన్న గ్రీజ్‌ను తుడిచి, తుడిచి... రోజుకి వేలాది స్పూన్లను అదే క్లాత్‌తో తుడుస్తుంటారు. మావారు ఇవన్నీ నాకు చెబుతూ... జొన్న, గోధుమ, వరి పిండితో స్పూన్లు తయారు చేస్తే, భోజనం పూర్తయిన తర్వాత వాటిని కరకరా నమిలి తినేయవచ్చని, తినకుండా పారేసినా త్వరగా నేలలో కలిసిపోతుంది, పర్యావరణానికి హాని కలగదని వివరించారు. ఈ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తే ప్లాస్టిక్‌తో గ్రీజును తినే దుస్థితి తప్పుతుంది, జొన్న పంటకు డిమాండ్ పెరుగుతుంది. జొన్నలు పండించే రైతులకు మంచి మార్కెట్ ఉంటే వాటినే ఎక్కువగా పండిస్తారని అని కూడా చెప్పారు.
ఆయన వాదనతో నేను కన్విన్స్ అయ్యాను. కానీ ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే ఎలాగనే భయం కూడా ఉండింది. ఆయన అప్పటికే మానేసి పూర్తిగా ఇందులోనే మునిగిపోయారు. ఒకరి ఉద్యోగమైనా ఉంటే కొంత భరోసా ఉంటుందనిపించింది. నాలుగేళ్ల తర్వాత నేనూ మానేసి ఆయనతో పాటు యూనిట్ నిర్వహణ బాధ్యతను పంచుకున్నాను. స్పూన్లను మొదట మాన్యువల్‌గా చేశాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం వచ్చిన తర్వాత మెషినరీతో చేస్తున్నాం. మూడు షిఫ్టులు పని చేస్తే రోజుకు పాతిక వేల స్పూన్లు చేయవచ్చు. పవర్ సప్లయ్‌లో ఇబ్బందులతో రెండు షిఫ్టులే చేస్తున్నాం.
పిండి.. స్పూన్‌గా మారాలంటే..
పిండి కలిపి స్లైడర్ మీద పెడితే రొట్టెలా ప్రెస్ అయ్యి, స్లైడర్ మౌల్డ్‌లోకి వెళ్తుంది. మౌల్డ్‌లో స్పూన్ ఆకారంలో కట్ అయి, బేకింVŠ సెక్షన్‌లో బేక్ అవుతుంది. ఆ తర్వాత డీహైడ్రేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్‌కి ఇరవై నిమిషాలు పడుతుంది. పిండి కలపడం నుంచి మొదలు పెట్టి, బేకింగ్, డీహైడ్రేటింగ్, క్వాలిటీ చెకింగ్, ప్యాకింగ్ వరకు అన్ని దశలు పూర్తి కావడానికి రెండు గంటలు పడుతుంది. ఒకసారి రౌండ్‌కి వెయ్యి స్పూన్లు వస్తాయి. వెయ్యికి రెండు–మూడు ఓవర్ బేక్ అవుతుంటాయి. మధ్యలో కరెంట్ పోయిందంటే అంతా వృథా. కరెంట్ వచ్చాక మళ్లీ మెషీన్ వేడెక్కడానికే ఒకటిన్నర గంట పడుతుంది. ప్లెయిన్ స్పూన్లతోపాటు షుగర్, సాల్డ్, పెప్పర్, జీరా, వాము ఫ్లేవర్లలో చేస్తున్నాం. అదృష్టం ఏమిటంటే ఆర్డర్లు బాగా వస్తున్నాయి, మా మెషినరీ కెపాసిటీ ఇంత పెద్ద ఆర్డర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదు. దాంతో సప్లయ్ లేటవుతోంది. ఫారిన్ ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. యూనిట్‌ని విస్తరించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరింది కాబట్టి ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తాయేమో కానీ, ఉన్న అప్పులు తీరకుండానే కొత్త అప్పు చేయడానికి మాకే భయంగా ఉంది.
వ్యాపారం కోసం కాదు
మేము ఈ తినే స్పూన్ల కాన్సెప్ట్‌ను మొదలు పెట్టింది... అనారోగ్యకరమైన అలవాట్లను మాన్పించి ఆరోగ్యకరమైన అలవాటు చేద్దామని మాత్రమే. మా ప్రయత్నంలో పాత్‌బ్రేకర్స్‌గా ఓ గుర్తింపును తెచ్చుకోగలిగాం. అయితే వ్యాపారంగా మార్చుకోవడం మాకు తెలియని పని. స్పూన్ తయారీ కంటే ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్టుకే ఎక్కువ ఖర్చవుతోంది. ఆ ఖర్చులన్నీ స్పూన్ మీదనే మోపడం అనేది వ్యాపార సూత్రం, వ్యాపారం నిలబడాలంటే అలాగే చేయాలి కూడా. అలాగని ధర పెంచుతూ పోతే మా ఉద్దేశం నెరవేరదు. ప్లాస్టిక్ స్పూన్‌కి ప్రత్యామ్నాయంగా జొన్న పిండి స్పూన్లను వాడుకలోకి తేవడంలో విజయవంతం అయ్యాం. కానీ వీటి ధర పెరిగితే ఎవరూ వీటి వైపు చూడరు, కడుపులోకి గ్రీజ్ పోతే క్యాన్సర్ వస్తుందని తెలిసినా తక్కువ ధరలో దొరికే ప్లాస్టిక్ స్పూన్లకే మొగ్గుచూపుతారు. సమాజం అలా వెళ్లకుండా ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గర చేయడమే మా లక్ష్యం. అంతర్లీనంగా రైతుల ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. మాది వ్యాపారం కాదు, ఒక సోషల్ కాజ్ మాత్రమే. మా అమ్మాయి కెనడాలో మేథమెటీషియన్. తనకు ఈ రంగం మీద ఆసక్తి లేదు. ఇక మా ఇద్దరికీ ఇదే ప్రపంచం’’.
పిండి స్పూన్ పాడవదు
మచిలీపట్నంలో పుట్టి కోల్‌కతాలో పెరిగి బరోడాలో ఉద్యోగం చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. జొన్నపిండి స్పూన్‌ల కాన్సెప్ట్‌ని డిజైన్ చేసుకున్నాకే పనిలోకి దిగాను. కానీ మెషినరీ కోసం ప్రయత్నించినప్పుడు కొత్త సంగతి తెలిసింది. ఇంత వరకు అలాంటి మెషీన్ అవసరం రాకపోవడంతో ఎవరూ డిజైన్ చేయలేదని! దాంతో మెషినరీ డిజైన్ కూడా మేమే చేయాల్సి వచ్చింది. జామ్‌బాగ్, మసాబ్‌ట్యాంకులు తిరిగి మౌల్డ్ మేకర్స్ దగ్గర కూర్చుని, చేత్తో చేసిన స్పూన్లను చూపించి నా ఐడియా వాళ్లకు అర్థమయ్యేలా వివరించాను. బ్యాంకు వాళ్లు చూసినట్లే వీళ్లూ వింతగా చూశారు. ఐదారు ప్రయత్నాలతో ఒకతడు ముందుకొచ్చాడు. ఎల్‌బి నగర్‌లో ఉన్న మా యూనిట్ ఇప్పుడు పూర్తిస్థాయి మెషినరీతో నడుస్తోంది. సమాజం మర్చిపోయిన జొన్నలు ఇతర చిరుధాన్యాలను తిరిగి తీసుకురావాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఈ స్పూన్లను నూటికి నూరుశాతం సహజమైన ఉత్పత్తులతో తయారు చేస్తున్నాం, కాబట్టి వాటి కారణంగా ఏ విధమైన అనారోగ్యాలూ రావు. ఏ మాత్రం తేమ లేకుండా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఇవి పాడుకావు.
– నారాయణ పీసపాటి, సైంటిస్ట్, బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపకులు
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment