నా వయసు 38 ఏళ్లు. పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. పిల్లలు లేరు. స్కానింగ్ తీయించాం. నా ఓవరీలలో సిస్ట్ ఉందని తేలింది. ఈ సిస్ట్ భవిష్యత్తులో క్యాన్సర్‌గా పరిణమిస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హెదరాబాద్
ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు మా డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయిస్తాం. కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటాం.
అయితే కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చిన దాఖలాలు ఉన్నవారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లుగానే చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్‌లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది.
అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్‌లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు సాధ్యమైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి.