
జీవితమంటే ఏమిటి? జీవితం ఇలాగే ఎందుకుంది? ఈ నక్షత్రాలు, గ్రహాలూ ఎందుకున్నాయి? కాలం ఎంతో శక్తిమంతమైనదా? అసలీ ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? దేవుడంటే ఎవరు? ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు? సమాజంలో మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది? చెడు చేస్తున్న వారిని నిగ్రహించేవారే లేరా? ఈ ప్రకృతి ఏమిటి? ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు...
ఎపుడైనా ఇటువంటి ప్రశ్నలు మీ మదిలో మెలిగాయా? వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నించారా? అవునో, లేదో కానీ ఇటువంటి మరెన్నో సందేహాలకు సంతృప్తికర సమాధానాలతో తాత్వికదర్శనాన్ని అందించే గ్రంథమే శ్రీమద్భగవద్గీత. వేదసారాన్ని అందించే ఉపనిషత్తులలో మేటియైన ఈ గ్రంథమే గీతోపనిషత్తుగా కూడా ఖ్యాతినొందింది. అసలెందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అని అడిగితే అందుకు సమాధానమొక్కటే, అది ఈ సకల చరాచర సృష్టికి మూలకారణమైన దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీ కృష్ణునిచే స్వయంగా ఉపదేశించబడినందుకే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అంటుంది శ్రీమద్భాగవతం. ధర్మాచరణయందు సందిగ్ధతలో పడి, మనస్తాపంతో చింతామగ్నుడైన అర్జునునికి కర్తవ్యబోధ చేసి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉపదేశించినదే భగవద్గీత. అలా భగవద్గీతను విన్న అర్జునుడు చివర్లో ఈ విధంగా అన్నాడు – ఓ అచ్యుతా! నా మోహం ఇప్పుడు నశించింది. నీ కరుణతో నా స్మృతిని తిరిగి పొందాను.
ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను.’’– భగవద్గీత 18.73 మనం జీవితంలో ఎటువంటి పరిస్థితులలో వున్నా, భగవద్గీతలోని ఉపదేశాలను అనుసరిస్తే మన కర్తవ్య నిర్వహణయందు గల సందేహాలు నివృత్తి అవడమేగాక, దృఢమైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకెళ్ళగలం. భగవద్గీత అందించే ఆత్మవిశ్వాసం, చేసే పనుల్లో స్పష్టత మరే ఇతర వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలంటూ నేడు నిర్వహిస్తున్న పలు తరగతుల పాఠ్యాంశాలలో సైతం లభించదు. అసలు జీవన నిర్మాణ మూల ఉద్దేశమేమిటో తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసమన్నది సాధ్యపడుతుంది. ఆ విషయాలను గీత విపులంగా వివరిస్తుంది. సమస్త వేదసారాన్ని, భగవతత్త్వాన్ని సమగ్రంగా అందించేదే భగవద్గీత. క్రమం తప్పకుండా పఠించినవాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అయితే వందల రకాల భగవద్గీతలు అందుబాటులో వున్న నేటి తరుణంలో ఒక విశుద్ధభక్తుడు రచించిన గీతను ఎంచుకోవటమే సకల విధాలా శ్రేయస్కరం.
బ్రహ్మ–మధ్వ–గౌడీయ పరంపరలో 32వ ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు చిన్ననాటినుండే శ్రీ కృష్ణుని విశుద్ధ భక్తులు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరులచే దీక్షను పొందిన వీరు కృష్ణ పరంపర సందేశాన్ని ‘భగవద్గీత యథాతథం’ గ్రంథంగా రచించారు. భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు అత్యంత విలువైన భగవద్గీతలోని 700 శ్లోకాలను పారాయణ చేయడం ద్వారా విశ్వశాంతి, లోక కళ్యాణం కలుగుతాయి. అలానే విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహభావనలు పెరుగుతాయి. మన లోపల ఉండే అసూయ, ద్వేషం లాంటి వాటిని జయించగలం. ఈ గీతాజయంతి రోజున ప్రతి ఒక్కరూభగవద్గీత చదవడం, చదివించడం వంటి సంకల్పాన్ని పాటించండి. (5054 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీ కృష్ణుని అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం వల్ల దీనిని గీతాజయంతి పర్వదినంగా జరుపుకుంటున్నాం).
►భగవద్గీతలోని ముఖ్యమైన 108 శ్లోకాలను తాత్పర్య సహితంగా పారాయణ చేయడం ద్వారా దేవాది దేవుడైన శ్రీ కృష్ణభగవానుడి అనుగ్రహం పొంది శాంతి సౌఖ్యాలు పొందుతారు. గీతా సందేశం ఏదో ఒక మతానికే కాకుండా ఈ విశ్వంలోనే అందరూ సమతా భావాన్ని కలిగి ఐకమత్యంతో కలిసి మెలిసి పని చేసేలా చేయగలదు. నేడు గీతా జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ‘యత్ర యోగేశ్వరో కృష్ణో...’ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతిరోజూ భగవద్గీతను పఠిస్తే సంపద, విజయం, అసాధారణశక్తి, నీతి నిశ్చయంగా సంప్రాప్తిస్తాయి. భగవద్గీతపై వివిధ రకాలుగా వ్యాపించి ఉన్న అపోహలను విడనాడి, జీవితంలో ఆచరించవలసిన సన్మార్గానికి చేయూతనిచ్చే భగవద్గీతను ఇంటిల్లిపాదీ చదువుకోవచ్చు. కావున, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాము.
– సత్యగౌర చంద్ర ప్రభు,
హరేకృష్ణమూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు,
అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు.