
కన్నమ్మ
తొమ్మిది నెలలు మోసే భారాన్ని... భారం కాకుండా చేసింది
.ప్రభుత్వాలలో కూడా మమకారం ఉంటుందని నిరూపించింది
the human face of tamilnadu goverment..
తమిళనాడు రాష్ట్రానికి మానవీయ ముఖచిత్రం గిరిజా వైద్యనాథన్.
మానవ ప్రయత్నానికి దేవుని ఆశీర్వచనం మాత్రమే చాలునని...
ప్రమోషన్‌లతో నిమిత్తం లేకుండా తన పని తను చేసుకుపోతోంది.
సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు పురుడు పోస్తున్న ఈ ఆఫీసరమ్మ...
ప్రతి ఉద్యోగినికీ ఇష్టమైన కన్నమ్మ.
స్త్రీ కష్టం స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ‘పురిటినొప్పులు, పుడమి తల్లులు’ అని మగవాళ్లు ఎన్ని కవిత్వాలు రాసినా అవి కాగితం పువ్వులే. అది కాగితం పూల అర్చనే. ఆ అర్చన కూడా గర్భిణులకు అక్కరకు రానిదే! మరి వాళ్లకేం కావాలి? మంచిమాట కావాలి. దాన్నివ్వాలి. చల్లనిచూపు కావాలి. దాన్నివ్వాలి. ధైర్యం కావాలి. దాన్నివ్వాలి. ఒక వెచ్చని స్పర్శ కావాలి. దాన్నివ్వాలి. ఆ తొమ్మిదినెలలు వారిని ‘కంఫర్ట్’గా ఉంచాలి. చుట్టూ కుటుంబ సభ్యులు చేరాలి. చేతిని చేతిలోకి తీసుకుని ‘మేమున్నాం కదా.. నిశ్చింతగా ఉండు’ అని నమ్మకాన్ని ఇవ్వాలి.
కుటుంబ సభ్యులే కాదు, కుటుంబ పెద్ద లాంటి ప్రభుత్వం కూడా గర్భిణికి ధీమా ఇవ్వాలి. ‘నువ్వేం ఆలోచించకు, ఈ తొమ్మిది నెలలు నీ గురించి నేనే ఆలోచిస్తాను’ అన్నంతగా... తల్లి కాబోతున్న ఆ తల్లిని ప్రత్యేక సదుపాయాలతో ప్రభుత్వం తన పొత్తిళ్లలోకి తీసుకోవాలి. ఇది సాధ్యమా? ఇళ్లలో ఉన్నట్లే, ప్రభుత్వాలలోనూ కర్తవ్య పాలనంతా దాదాపుగా మగవాళ్లదే అయినప్పుడు.. స్త్రీకి ఇంత లాలన, స్త్రీ చుట్టూ ఇంత సావధాన సంరక్షణ సాధ్యమా? సాధ్యమే! ప్రభుత్వ యంత్రాంగంలో గిరిజా వైద్యనాథన్ వంటి సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారులు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. అలా సాధ్యమైనదే... గర్భిణులకు తొమ్మిది నెలల సెలవు హక్కు! సెలవులో ఉంటూనే ఆ తొమ్మిది నెలలూ జీతం పొందే హక్కు.
అమ్మ.. జయమ్మ.. గిరిజమ్మ
‘‘తొమ్మిది నెలలు తల్లి బిడ్డను మోస్తుంది. ఆ తొమ్మిది నెలలూ మనం తల్లిని మోయాలి’’. గిరిజా వైద్యనా£ý న్ ఈ మాట అన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఆమె వైపు అబ్బురంగా చూశారు. మంచి ఆలోచన! 2011లో జయలలిత మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, స్త్రీల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని యోచిస్తున్నప్పుడు గిరిజ ఈ ఐడియా ఇచ్చారు. అప్పుడామె ఆరోగ్యశాఖలో కీలకమైన నిర్ణయాధికారి. చెన్నై ఐ.ఐ.టి. నుంచి హెల్త్ ఎకనమిక్స్‌లో íపీహెచ్‌డీ చేసిన గిరిజకు.. గర్భిణి ఆరోగ్యానికి, ఆమె ఆర్థిక అవసరాలకు మధ్య ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. జయకు గిరిజ ఆలోచన నచ్చింది. అప్పటి వరకు గర్భిణులకు ఉన్న 3 నెలల మెటర్నిటీ లీవును 6 నెలలకు పెంచుతూ తక్షణం ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే ముందు ఆ 6 నెలల మెటర్నిటీ లీవును 9 నెలలకు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 8 నుంచి అక్కడ ఈ జీవో అమలు అవుతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా క్రమంగా మూడు నుంచి ఆరుకు, ఆరు నుంచి తొమ్మిదికి షిఫ్ట్ అవడం వెనుక ఉన్నది తమిళనాడు అయితే, తమిళనాడు వెనుక ఉన్నది జయ, జయ వెనుక ఉన్నది గిరిజా వైద్యనాథన్! దేశాన్ని ఇప్పుడు మోదీ స్పీడుగా నడిపిస్తుండవచ్చు. కానీ ఉద్యోగినులైన గర్భిణీ స్త్రీలను పదిలంగా చెయ్యిపట్టి నడిపిస్తున్నది మాత్రం.. గిరిజా వైద్యనాథన్. సీనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్.
అందమైన ఓ పూల ముగ్గు!
చెన్నై నుంచి 235 కి.మీ. దూరంలో ఉంటుంది సర్కళి. అక్కడికి సమీపంలో ఉన్న వైదీశ్వరన్ ఆలయ దర్శనానికి వెళుతున్నప్పుడు.. గిరిజను తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని చేసిందన్న న్యూస్ బ్రేక్ అయింది. విషయం తెలిసేటప్పటికే గిరిజ వైదీశ్వరన్ ఆలయంలోని శివుని సన్నిధిలో ఉన్నారు. ఆ పదోన్నతి ఆదేశాలు ఆలయ ప్రాంగణంలో ఆమె కోసం కాసేపు వేచి ఉండవలసి వచ్చింది. విశేషం ఏమిటంటే.. కెరియర్‌లోని ప్రతి ఉన్నతీ అలా ఆమె కోసం ఎదురు చూసిందే! మరో మూడేళ్లలో రిటైర్ కాబోతున్న గిరిజ గత 34 ఏళ్లలో దాదాపు 12 శాఖల్లో పనిచేశారు. మాతా, శిశు సంక్షేమం; విద్య, ఆరోగ్యం, పౌర సరఫరాలు, సాధారణ పరిపాలన, పరిశ్రమలు, ఫైనాన్స్; అడవులు, పర్యావరణం; ప్రణాళికలు, పథకాల అమలు; పవర్, పట్టాణాభివృద్ధి, భూములు, పాలనా సంస్కరణలు! ఎక్కడా తొట్రు పడలేదు. ఎక్కడా రాజీ పడలేదు. ఎక్కడా మాట పడలేదు. మీడియాలోనూ కనిపించలేదు. పనిని తప్ప గుర్తింపును, ప్రమోషన్‌లను పట్టించుకోని గిరిజ.. ఇప్పుడీ ప్రమోషన్ కూడా మరో కొత్త పనిలా భావిస్తున్నారు తప్ప, మహా ప్రసాదంగా భావించడం లేదు. ఇన్నేళ్లుగా గిరిజ పని మాత్రమే అప్‌డేట్ అయింది. ఇతరత్రా వివరాలు ఎక్కడా అప్‌డేట్ కాలేదు. ఆఖరికి ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌లో కూడా. ఆమె వాల్‌పేపర్‌లో అందమైన ఓ పూలముగ్గు మాత్రం కనిపిస్తుంది... ఎప్పటికీ వాడిపోని ఆమె చిరునవ్వులా!
అప్‌రైట్.. క్లీన్.. బ్రిలియంట్
గిరిజా వైద్యనాథన్‌కి ఇవి తల్లిదండ్రులు పెట్టని పేర్లు. కెరియర్‌లో తన ఈడువారు, తన కిందివారు, తన పైఅధికారులు గిరిజకు పెట్టిన పేర్లు! తనకు ఇలాంటి పేర్లు ఉన్నట్లు కూడా గిరిజకు తెలీదు! ఎవరూ పేరు పెట్టకుండా, ఎవరూ వేలెత్తి చూపకుండా తన పని తను చేసుకుపోవడం ఒక్కటే ఆమెకు తెలుసు. అయితే డిసెంబరు 22న కొన్ని వేళ్లు ఆమె వైపు తిరిగాయి! తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో 30 లక్షల విలువైన కొత్త కరెన్సీ, 5 కిలోల బంగారం బయటపడడంతో వెంటనే ఆయన స్థానంలో ఆ ప్రభుత్వానికి ఒక కొత్త కార్యదర్శి అవసరం ఏర్పడింది. ఇదిగో అప్పుడే అందరి వేళ్లూ గిరిజా వైద్యనాథన్ వైపు తిరిగాయి. షి ఈజ్ ద రైట్ పర్సన్ అని.
పనే తన పదవి, పనే తన పదోన్నతి!
నిజానికి రెండేళ్ల క్రితమే గిరిజ ఈ పోస్టులోకి రావలసింది! కనీసం ఆరు నెలల క్రితమైనా ఆమె ప్రధాన కార్యదర్శి కావలసింది. కానీ ఈ రెండు సందర్భాలలోనూ ఆమె కన్నా జూనియర్లు ‘ఆమె పోస్టు’లోకి వచ్చేశారు. వాటి వెనుక ఉన్న రాజకీయ కారణాలను, ఒత్తిళ్లను గిరిజ పట్టించుకోలేదు. వాస్తవానికి ఇప్పుడు కూడా ఆమెను పక్కన పెట్టి రామ్మోహన్‌రావు స్థానంలో ఆమె కన్నా నాలుగేళ్లు జూనియర్ అయిన ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి కె.షణ్ముగంను తెచ్చే పెట్టే ప్రయత్నాలు జరిగాయి. అక్రమం జరిగిందని రావును తొలగించినప్పుడు, ఆ స్థానానికి జరిగే ఎంపికలో అక్రమం ఉండకూడదన్న నైతిక స్పృహ ఎవరికి కలిగిందో కానీ, గిరిజకు న్యాయం జరిగింది. అయితే అన్యాయం జరిగినప్పుడు తనకు అన్యాయం జరిగిందని ఆమె ఎలాగైతే చెప్పుకోలేదో, న్యాయం జరిగిందని కూడా ఇప్పుడు చెప్పుకోవడం లేదు. ఎప్పటిలా... ముందున్న పని మీదే ఆమె తన దృష్టిని కేంద్రీకరించారు.
చెన్నైలోని మా సాక్షి ప్రతినిధి చెబుతున్న దానిని బట్టి .. ఆమె వెంటనే పనిలో పడిపోయారు!గిరిజా వైద్యనాథన్‌కు ముందు ముగ్గురు మహిళలు.. లక్ష్మీ ప్రాణేశ్ (2002–2005), ఎస్.మాలతి (2010–2011), షీలా బాలకృష్ణన్ (2013–2014) తమిళనాడు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఆ వరుసలో గిరిజ నాల్గవ మహిళా ప్రధాన కార్యదర్శి. గిరిజ ఎంతగా ‘లో–ప్రొఫైల్’లో ఉంటారంటే.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం గం. 9.20 కు సచివాలయంలోని తన కార్యాలయానికి చేరుకున్న ఈ ప్రధాన కార్యదర్శి.. మీడియా దృష్టిని తప్పించుకోడానికి దాదాపు 40 నిమిషాలు వేచి ఉండి, ఆ తర్వాత మాత్రమే తన కేబిన్‌లోకి వెళ్లారు.
మహిళల్లో నెం.1 లక్ష మందిలో నెం.9
మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ్ట. డిగ్రీలో గిరిజ సబ్జెక్టులు. చెన్నైలోని ఖయెదె మిల్లత్ ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివారు. తమిళ్, హిందీ, ఇంగ్లిష్... ఈ మూడు భాషల్లో గిరిజ ఎక్స్‌పర్ట్. ఇంచుమించు ఒక భాషా పండితురాలు. 1981లో సివిల్స్‌లో ఆమె సాధించిన ర్యాంకు.. మహిళల్లో నెం.1. మొత్తం లక్ష మంది అభ్యర్థులలో 9వ ర్యాంక్. 1983లో తిరువళ్లూరు కలెక్టర్‌గా గిరిజ కెరీర్ మొదలైంది. 1991లో మధురై కలెక్టర్‌గా బదిలీ అయింది. తర్వాత తమిళనాడులోని రెండు ప్రభుత్వాల (డి.ఎం.కే., అన్నాడీఎంకే) హయాంలోనూ ఆర్థికశాఖలో ఉన్నతాధికారిగా పని చేశారు గిరిజ. ఐ.ఏ.ఎస్. అధికారిగా తీరిక లేని విధుల్లో ఉంటూనే 2011లో ఆమె చెన్నై ఐ.ఐ.టి. నుంచి హెల్త్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తమిళనాడు మాతాశిశు సంక్షేమ పథకాల వ్యూహరచనలో గిరిజకు ఆ íపీహెచ్‌డీ ఎంతగానో తోడ్పడింది.
ఒక్క రిమార్కు కూడా లేదు
ఐఏఎస్ పూర్తి చేసిన నాటి నుండి నేటి వరకు ఒక్కటంటే ఒక్క వివాదాన్ని కూడా ఆమె ఎరుగరు. రూల్స్, రెగ్యులేషన్స్‌ను కాదని ప్రభుత్వంలో ఏపనీ చేయరు. ఈ క్వాలిఫికేషన్స్ వల్లనే ఎవరి సిఫార్సు లేకుండా ఆమె సీఎస్ అయ్యారు. ఇలాంటి నిజాయితీ పరురాలైన వ్యక్తి ప్రభుత్వ కార్యదర్శి కావడం మా కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికే గర్వకారణం.
– ఎస్వీశేఖర్, ప్రముఖ తమిళ సినీ, స్టేజీ హాస్యనటుడు, రాజా వైద్యనాథన్ అన్న
గిరిజా వైద్యనాథన్ (57)
తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి
జన్మస్థలం : నాగర్ కోయిల్ (దక్షిణ తమిళనాడు)
కుటుంబం : అయ్యంగార్లు
తల్లి : జలజా వెంకిటరమణన్ (గృహిణి)
తండ్రి : ఎస్.వెంకిటరమణన్ (1990–92లో రిజర్వుబ్యాంకు గవర్నర్)
భర్త : రాజా వైద్యనాథన్ ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్ సీఎండీ (సొంత కంపెనీ)
కుమారుడు : సంజీవ్ వైద్యనా«థన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు
కుమార్తె : డాక్టర్ అంజనా ఆనంద్. ఎండీ
మాధవ్ శింగరాజు
ఇన్‌పుట్స్: సాక్షి చెన్నై ప్రతినిధి కొట్రా నందగోపాల్