గుడ్‌బై Google Orkut
ఆర్కుట్‌ను గూగుల్ త్వరలోనే శాశ్వతంగా మూసేయనుందట! అయినా ఆర్కుట్‌ను గూగుల్ మూసేయడం ఏమిటి? నెటిజన్లు ఏనాడో దాన్ని క్లోజ్ చేశారు కదా! లాగిన్ కావడం అత్యంత అరుదైపోయింది కదా! ఆర్కుట్ మొదలైన ఏడాదిలోనే ప్రారంభమైన ఫేస్‌బుక్ ప్రభావంతో ఆర్కుట్ అడ్రస్ గల్లంతయింది కదా! అయితే ఆర్కుట్‌ను మరీ అంతా చీప్‌గా తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్కుట్ అపురూపమైనది. ప్రత్యేకించి భారతీయులకు సోషల్‌నెట్‌వర్కింగ్ మజాను పరిచయం చేసింది ఆ వెబ్‌సైటే. ఆర్కుట్ భారతీయ నెటిజన్లకు తొలి రచ్చబండ. ఫేస్‌బుక్‌కు ప్రాభవానికి ముందే ఒక వెలుగు వెలిగిన వెబ్‌సైట్! కాబట్టి అది కాలం కౌగిలిలో ఒదిగిపోతుండటం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశమే.
టర్కీదేశానికి చెందిన ఆ యువకుడు చాలా కాలం కిందట దూరమైన తన స్నేహితురాలి ఆచూకీ తెలుసుకోవాలని అనుకొన్నాడు. అందుకు అనేక మార్గాల గురించి ఆలోచించగా అప్పుడప్పుడే విస్తృతం అవుతున్న ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఆమెను కలుసుకొనే అవకాశం ఉందని గ్రహించాడు. అందుకోసం ఒక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాడు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తన స్నేహితులందరినీ అందులోకి చేరమని కోరాడు. వారి ద్వారా మరి కొందరిని అందులోకి చేర్చే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆ పోర్టల్ నెట్‌వర్క్ విస్తృతమైంది. మూడు సంవత్సరాలు గడిచే సరికల్లా ఆ పోర్టల్ టర్కీలో బాగా పాపులర్‌అయ్యింది. సోషల్ నెట్‌వర్కింగ్ అనేమాట పాపులర్ కావడానికి కారణమైంది. ఆ పాపులర్ నెట్‌వర్క్‌ను గూగుల్ కొనుగోలు చేయడంతోనే దాని పేరు మార్మోగింది. అప్పటికే పేరుపొందిన ఆ సెర్చ్ ఇంజన్ ఆ సైట్‌ను కొనుగోలు చేసి మరింత పాపులర్ చేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ అనే మాటకు నిర్వచనంగా మార్చింది. ఆర్కుట్ బమొక్కొటెన్ అనే ఆ యువకుడు స్థాపించి, గూగుల్ చేత టేకోవర్ చేసిన ఆ వెబ్‌సైట్ ‘ఆర్కుట్ డాట్ కామ్’
భారత్, బ్రెజిల్‌లలో దుమ్మురేపింది!
అదేం విచిత్రమో కానీ గూగుల్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆర్కుట్‌ను పాపులర్ చేసినా అది బాగా నచ్చింది మాత్రం బ్రెజిల్, భారతదేశాలకు మాత్రమే. ఆర్కుట్ యూజర్లలో దాదాపు 50 శాతం మంది బ్రెజిల్‌కు చెందిన వాళ్లే. వారి తర్వాత 20 శాతం యూజర్లు మన దేశానికి చెందినవాళ్లు. మనదేశంలో కూడా కేరళలో ఆర్కుట్ వినియోగం ఎక్కువగా ఉండేది.
ఆర్కుట్ సందడి అంతా ఇంతా కాదు!
సినిమా హీరోల ఫ్యాన్ కమ్యూనిటీల దగ్గర, సినిమా పేర్ల మీద ఏర్పాటు చేసి ఆ సినిమా ఫ్యాన్స్‌ను ఒక వేదికపైకి తెచ్చే కమ్యూనిటీలతో మొదలు... కులాల పేర్లతో ఏర్పాటు అయిన కమ్యూనిటీల వరకూ అనేకం ఆర్కుట్‌లో సందడి చేశాయి. చాట్‌రూమ్ ఆప్షన్‌లుకూడా ఆకట్టుకొన్నాయి.
ఫేస్‌బుక్ దెబ్బతో ఫేడవుటయ్యింది!
ఎంత తొందరగా విస్తృతమైందో అంతే త్వరగా పతనావస్థకు చేరుకొంది ఆర్కుట్. అప్పటికే అమెరికా వంటి దేశాలను ఉర్రూతలెక్కించిన ఫేస్‌బుక్ మనదేశంలోనూ తన పంథాను కొనసాగించింది. దీంతో ఆర్కుట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. విస్తృతం అయిన మూడు సంవత్సరాల్లోనే ఫేస్‌బుక్ జనాలను ఆర్కుట్‌కు దూరం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి ఆర్కుట్‌లో అకౌంట్ కలిగిన వారు కూడా దాంట్లోకి లాగిన్ కావడం పూర్తిగా మానేశారు. అంత వరకూ స్క్రాప్‌లతోనూ, చాట్‌రూమ్‌లతోనూ ఆర్కుట్‌లో యాక్టివ్‌గా ఉన్నవారు కూడా ఫేస్‌బుక్ మాయలో పడిపోయారు.
గూగుల్ అప్పుడే గుర్తించింది!
‘గూగుల్ ప్లస్’ను ప్రారంభించి జనాలను ఫేస్‌బుక్ వైపు నుంచి తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించింది గూగుల్. ఆ కొత్త సైట్ ప్రారంభంతోనే ఆర్కుట్‌కు ప్రాధాన్యం తగ్గించేసింది. ఇప్పుడు కూడా తమ ఇతరసైట్లపై దృష్టిపెట్టడానికి గూగుల్ ప్లస్, యూట్యూబ్‌లను మరింత విస్తృతం చేసుకోవడానికి ఆర్కుట్‌ను మూసివేస్తున్నట్టుగా గూగుల్ ప్రకటించడం విశేషం!
ఇప్పుడెలా?!
ఆర్కుట్‌లో ప్రతి యూజరూ కొన్ని వందల కొద్దీ ఫోటోలను షేర్ చేసుకొని ఉంటాడు, లాగిన్‌కాకపోయినా ఆ ఫోటోలు, ఆ జ్ఞాపకాలు విలువైనవే, దాన్ని దృష్టిలో ఉంచుకొనే వాటన్నింటినీ బ్యాకప్‌లో ఉంచుతామని, ఆర్కీవ్స్‌లో అవి లభ్యమవుతాయని గూగుల్ వివరించింది. మరి ఆ ఆర్కీవ్స్ ఎలా తీసుకోవాలి? అనేదానిపై ఇంకా పూర్తి వివరణ లభ్యం కావడం లేదు.
అప్పట్లోనే షేర్ చేసుకొమ్మంది!
గూగుల్ ప్లస్‌ను ప్రారంభించిన కొత్తలో తన యూజర్ల చేత తప్పనిసరిగా ఆ సోషల్‌సైట్‌లో అకౌంట్ మొదలు పెట్టించింది. అలా ప్రారంభించిన అకౌంట్‌లోకి ఆర్కుట్‌లోని ఫోటోలను ఒకే క్లిక్‌తో షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ అప్పుడే అలా క్లిక్ చేసి ఉంటే.. బ్యాకప్ గురించి బెంగపెట్టుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు కూడా గూగుల్ తన గూగుల్‌ప్లస్‌ను పాపులర్ చేసుకొనే ఉద్దేశంతో ఆర్కుట్‌బ్యాకప్‌ను అందులోకి షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని అంచనా!
పీఎస్: ఆర్కుట్ త్వరలో శాశ్వతంగా మూతబడుతోందనే విషయాన్ని నెటిజన్లు తమ ఫేస్‌బుక్ వాల్‌పై షేర్ చేస్తుండటం విశేషం! ఏదేమైనా టెక్నాలజీ విస్తృతం కావడంతో దూరమైన టేప్‌రికార్డర్లు, వీసీపీలు ఎంత అపురూపమైనవనిపిస్తాయో.. సోషల్‌నెట్‌వర్కింగ్ విషయంలో ఆర్కుట్‌కూడా వాటిస్థాయిలోనే అపురూపమైనదనడంలో అతిశయోక్తి లేదు!
- జీవన్‌రెడ్డి. బి