యోషికా నిషిమాస ప్రతిరోజూ పేపరు మీద పెద్ద లిస్టు రాయాలి. ప్రతిరోజూ జరిగిన సంవాదాలు, పనులు, భోజన సమయాలు... డైలీ రికార్డును పూర్తిచేస్తూనే ఉండాలి.ఆవిడ ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఈ లిస్టు ఆమె వృత్తికి సంబంధించినది కాదు. తన పిల్లల ప్రీస్కూల్‌కి సంబంధించిన విషయాలు. ఈ పనులన్నీ ఆవిడ ఆఫీసుకి వెళ్లేలోపు పూర్తి కావాలి. జపాన్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది మహిళలలాగే 38 సంవత్సరాల నిషిమాస కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. జపాన్‌లో ఆడవారి నుంచే ఎక్కువ పనిని ఆశిస్తోంది ప్రభుత్వం. జపాన్ ప్రధాని షింజో అబే, జపాన్‌లోని మహిళలతో ఎక్కువ పని చేయించి, జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు.
ఇందుకోసం మహిళలను ‘ఉమెనోమిక్స్’ (ఉమెన్+ఎకనామిక్స్) అంటున్నారు. ఈ జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో షింజో అబే, ‘జపాన్‌లో 67 శాతం మంది మహిళలు ఎంతో చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ సంఖ్య అమెరికా దేశం కంటే చాలా ఎక్కువ ’ అని గొప్పలు పలికారు. ఎక్కువ మంది పనిచేయడం ఆ దేశానికి గర్వకారణమా! వారు చిన్న పదవులలో మాత్రమే ఎందుకు ఉంటున్నారో అవసరం లేదా! ఇంటి బాధ్యతల కారణంగా జపాన్ మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగాలని కలలు కంటున్నా ముందుకు వెళ్లలేక పోతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం వారి నుంచి ఎక్కువ పని ఆశిస్తున్నాయి.
మగవారు సహాయం చేయరు
ఇక్కడ పనిచేస్తున్న మహిళల శాతం చాలా ఎక్కువే. కానీ, వంచిన నడుము ఎత్తకుండా ఇంటి పని చేయడం, ఇంట్లో వారందరినీ బాధ్యతగా చూసుకోవడంతో వారు అలసిపోతున్నారు, దీనికితోడు ఇంట్లోని మగవారు ఆడవారికి చేదోడువాదోడుగా ఉండరు. ప్రపంచంలోని ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే జపాన్‌లో ఇంటిపనులు, పిల్లలను చూడటం వంటి పనులు చేసే మగవారు చాలా తక్కువ. ‘నోరికో ఓ ట్సుయా’ అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన సర్వే ప్రకారం మహిళల కంటే పురుషులు ఇంటి పనులు తక్కువ చేస్తున్నారు. ఈ కారణంగా ఉద్యోగాలలో ఎదగలేకపోతున్నారు, ఇంటి దగ్గర కూడా బంధాన్ని పటిష్టపరచుకోలేకపోతున్నారు స్త్రీలు. నిషిమాస జీవితాన్ని పరిశీలిస్తే... ఆమెకు ప్రీస్కూల్ చదువుతున్న ఇద్దరు చిన్నపిల్లలు. నిత్యం వారి ఆరోగ్యం గురించి, రెండు పూటలా ఏం తింటారు, మూడ్స్‌ని బట్టి ఏ టైమ్‌లో ఏం చేస్తారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు ఆడుకుంటారు వంటివన్నీ రికార్డు రాసి ఆ పిల్లలను క్రెచ్‌లో దింపాలి.
నిత్యం ఈ పని చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఇవి కాకుండా ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిది సంవత్సరాల మరో కొడుకు గురించి చూసుకోవాలి. స్కూల్ అయిపోయాక ఆ పిల్లవాడు ట్యూటర్ దగ్గరకు వెళ్లాలి. అందుకోసం హోమ్‌వర్క్ అసైన్‌మెంట్ మీద సంతకం చేయాలి. వీటిలో ఏ ఒక్క పని మరచిపోయినా ఇబ్బందే. పేపర్ మీద ఇవన్నీ రాయడంతో ఆమె పనులు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం... ఇలా లెక్కలేనన్ని పనులు చేయాలి. ఇక వంటకాల విషయానికి వస్తే, రకరకాల జపనీస్ వంటకాలు తయారుచేయడం చాలా కష్టం. ఆ తరువాత లంచ్ బాక్సులను అందంగా, పిల్లలకు తినాలనిపించేలా సర్దాలి. పనివాళ్లు దొరకరు కనుక, అంట్లు, బట్టలు... ఈ పనులన్నీ పూర్తిచేయాలి.
నిషిమాస ఈ పనులన్నీ ఒంటిచేత్తో చేస్తోంది. నిషిమాస భర్త ఒక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. అప్పుడప్పుడు ఆయనకు ఆఫీసులో పని ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి క్లయింట్లతో బయటకు పార్టీలకు వెళ్తుంటాడు. జపాన్‌కి నిషిమాసలాంటి చదువుకున్నవారి అవసరం చాలా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ఆర్థికంగా చాలా వేగంగా ఎదిగింది. పెళ్లి అయిన తరువాత, గర్భిణులుగా ఉన్న సమయంలోను మహిళలు ఆఫీసు నుంచి చాలా వేగంగా ఇంటికి వెళ్లిపోయేవారు. దేశ ఆర్థిక వనరులను పెంచడం కోసం, ఆ సమయంలో వారి భర్తలు ఆఫీసులో మిగతా పని పూర్తి చేసేవారు. 1970 తరువాత వివాహితమహిళలు పనినంతావారే స్వయంగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముగింపు: జపాన్‌లో మరమనుషులు ఎక్కువంటారు, అందుకేనేమో అక్కడ స్త్రీలను కూడా మరమనుషులుగా భావిస్తున్నారు. ఆమెకు ఒక మనసు ఉంటుందని, ఆమె అలసిపోతుందని, ఆమె కూడా ఉద్యోగంలో పైస్థాయికి ఎదగాలనుకుంటుందని అర్థం చేసుకునేలోగా ఎంతోమంది ఆత్మన్యూనతకు గురవుతూనే ఉంటారు. మరెంతోమంది చిన్న ఉద్యోగాలలోనే పదవీ విరమణ చేసేస్తారు.
నిషిమాస ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి పట్టా పొందాక, ఒక టెక్ట్స్‌బుక్ పబ్లిష్ చేయడానికి ఒక సంస్థలో పనిచేసింది. అక్కడ ఆమె చాలా బాగా, చురుకుగా పనిచేయడంతో త్వరగా పైస్థాయికి ఎదిగింది. నాలుగు సంవత్సరాల తరువాత వివాహం చేసుకుంది. పెళ్లయిన వారిని ఆ కంపెనీలో పార్ట్ టైమర్‌లుగా మారుస్తారు. నిషిమాస విషయంలో అదే జరిగింది. ప్రతిరోజూ బాస్ ‘నువ్వు ఆఫీసులో ఎక్కువ సమయం ఉండట్లేదు, నీ పిల్లల కోసం నువ్వు తొందరగా వెళ్లిపోతున్నావు’ అని సాధించడం మొదలుపెట్టడంతో, మరో ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టింది నిషిమాస.
‘నువ్వు ఎక్కువసేపు పనిచేయలేవు కదా? ఆలస్యం అయితే నీర్త నిన్ను అర్థం చేసుకుంటాడా’ అని అడిగారు అక్కడ.తను పనిచేసిన పబ్లిషర్ మాత్రం తన వివాహం గురించి అడగలేదు కానీ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. నిషిమాస 29వ ఏట గర్భం దాల్చింది. అయినా ఆమెకు ఎటువంటి సౌకర్యం లేదు ఆఫీసులో. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు ఉండేది. దాంతో మొదటిసారి గర్భస్రావం అయ్యింది. ఆ తరువాత కొన్నాళ్లకి మళ్లీ గర్భిణి అయ్యింది.
అయినా ఆఫీసులో చాలాసేపు పనిచేస్తూనే ఉంది. తన పనిలో కొంత భాగాన్ని మరొకరికి పంచమని అడగలేకపోయింది. రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్లిన వెంటనే బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, ‘‘అందరి కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోయావు, నీ కొలీగ్స్‌ని క్షమాపణలు అడుగు’ అని. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిషిమాస ఉద్యోగం మానేయాలనుకోలేదు. భర్త తాను పై పదవులకు ఎదగాలనుకున్నాడు. అందువల్ల పిల్లల బాధ్యత పూర్తిగా నిషిమాస తీసుకోవలసి వచ్చింది. తాను చాలా ఎక్కువసేపు కష్టపడుతున్నట్లు చెప్పేవాడు భర్త. కష్టపడుతున్నది ఎవరో అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment