ఆధ్యాత్మిక సౌరభం... ఆనంద విహారం... | Happy Excursion spiritual aura ... ... | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక సౌరభం... ఆనంద విహారం...

Published Thu, Apr 10 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

ఆధ్యాత్మిక సౌరభం... ఆనంద విహారం...

ఆధ్యాత్మిక సౌరభం... ఆనంద విహారం...

విహారి

వెండి వెలుగులతో అబ్బురపరిచే హిమవత్పర్వతాలు..
 అలల సడులతో అలరించే సరోవరాలు..  
 పరమేశ్వరుడు కొలువైన ప్రదేశంగా పేర్కొనే కైలాసగిరి సందర్శన..
 ఒక్కసారి చూసినా జీవితకాలం గుర్తుండిపోయే రమణీయ దృశ్యాలు..
 ఇవన్నీ కైలాస - మానస సరోవర యాత్రలో అడుగడుగునా కళ్లకు కడతాయి.
 ఇటు ప్రకృతి రామణీయకత, అటు ఆధ్యాత్మిక సౌరభాలను అనుభూతించే అరుదైన విహారం ఈ కైలాస - మానస సరోవర యాత్ర.

 
కైలాస - మానస సరోవరయాత్ర ఇలా వెళ్ళి, అలా వచ్చేసే తీర్థయాత్ర కాదు. ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యాత్రకు నేను మరో 44 మందితో కలసి వెళ్ళాను. ఆ రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు నుండి మా యాత్ర మొదలైంది.

ఢిల్లీ వెళ్లి, అక్కడి నుండి విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు సాయంత్రం చేరాం. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు ట్రావెల్ బస్సులో టిబెట్ చేరుకున్నాం. అటు నుంచి ఎత్తై సుందర ప్రదేశం నాగర్‌కోట్ సందర్శించి, దాదాపు 300 కి.మీ దూరమున్న నేపాల్ చివరి ప్రదేశమైన తోతాపాణి చేరుకున్నాం. ఇక్కడికి దగ్గరలోనే నేపాల్-చైనా సరిహద్దు ఉంది.

ఈ రెండు భూభాగాల మధ్య ఉన్న నది మీదుగా రాకపోకలు సాగించడానికి ఏర్పాటుచేసిన వంతెనను ‘ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జి దాటే సమయంలో లగేజీని మోయడానికి కూలీల అవసరం ఉంటుంది. మనం ఒక బ్యాగును కష్టపడి మోయవలసి వస్తే అటువంటి ఐదు బ్యాగులను ఒక నేపాలీ మహిళ వీపు మీద వేసుకొని సునాయాసంగా అటువైపు చేరుస్తుంది.
 
ఎముకలు కొరికే చలిలో...
 
అటువైపు చైనా ఆక్రమిత టిబెట్ భూభాగాన్ని జుగ్ము అంటారు. జుగ్ములో వీసా, పాస్‌పోర్టుల తనిఖీలు పూర్తిచేసుకున్న తరువాత ఇక్కడి నుండి హిమాలయ పర్వత చరియలను, లోయలను వీక్షిస్తూ సాయంకాలం 5 గంటలకు ‘న్యాలం’ చేరాం. మన రూపాయలను ఇక్కడే ‘యువాన్’లోకి మార్చుకోవాలి. ఇక్కడికి రాగానే అందరికీ తల భారంగా, వాంతు వచ్చినట్లు అనిపించడం మొదలైంది. దీనికంతటికీ కారణం - ఎత్తై భూభాగానికి వెళ్లటమే.

విపరీతమైన చలిగాలుల వల్ల చేతికి, కాళ్లకు సాక్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే! వాతావరణానికి అలవాటు పడటానికి మాకు కొన్ని మాత్రలు ఇచ్చి రెండు రాత్రులు, ఒక పగలు అక్కడే ఉంచారు. మూడవరోజు ఉదయం 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ‘సాగా’ మీదుగా ‘న్యూ డొంపా’ అనే ప్రాంతం చేరుకున్నాం. సాగా దగ్గర 30 కి.మీ. తప్ప తక్కిన రోడ్డంతా విమానాశ్రయంలో మాదిరి ‘రన్ వే’ లా అనిపించింది.

ఈ ప్రాంతంలో ఎక్కడా విద్యుత్ లేదు. సౌరవిద్యుత్, జనరేటర్లతో మాత్రమే కొంతసేపు దీపాలు వెలుగుతాయి. ఆ రోజు రాత్రి ‘న్యూ డొంపా’లో బస చేసి, ఉదయం 150 కి.మీ ప్రయాణించి మానససరోవరం చేరుకున్నాం. ప్రయాణంలో ఎక్కడ చూసినా ఇసుకతిన్నెలు, మేటలే. ఎక్కడా పచ్చని చెట్టూ చేమా లేవు. వర్షానికి ఇసుకలో మొలిచే పచ్చికను మేస్తూ జడల బర్రెల్లాంటివి గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని గ్రామాలు కనిపించాయి. మట్టి ఇళ్ల్లలోనే అక్కడి వారి నివాసం.
 
ముగ్ధ మనోహర సరోవరం
 
మానస సరోవరం 20-25 కి.మీ ఉండగా కైలాస పర్వతం కనిపిం చింది. అది మాటల్లో వర్ణించలేని అద్భుతం. శరీరంలో ఒక విధమైన ప్రకంపనలు. ఇక్కడ నుంచి చైనా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలుష్య రహిత బస్సులో 25 కి.మీ ప్రయాణించాం. మానస సరోవర పరిక్రమ చేయించుకుంటూ ఒకచోట ఆపారు. హిమగిరులు కరిగి వచ్చిన నీళ్లు... చాలా చల్లగా, అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయి. తెల్లవారుజామున రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్యన శివపార్వతులతో పాటు దేవతలు ఈ సరోవరంలో స్నానాలు ఆచరిస్తారని ప్రతీతి. ఆ సమయంలో సరోవరాన్ని తిలకించడానికి భక్తులు రాత్రి జాగరణ చేసి ఈ ప్రాంతానికి చేరుకుంటారట. ఆ రోజు సరోవరంలో స్నానం చేసి, రాత్రి 12 గంటల తర్వాత లేచి, తిరిగి మానస సరోవరం ఒడ్డుకు చేరుకున్నాం. తెల్లవారు జామున సరోవరపు అందాలను తిలకించడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ అద్భుతాన్ని చెప్పడానికి మాటలు చాలవు.
 
ప్రాణవాయువు అందని గిరి పరిక్రమ

మరుసటి రోజు ఉదయం కైలాసగిరి పరిక్రమకు వెళ్లాం. యమద్వారం గుండా కైలాస పరిక్రమ పూర్తిచేయాలంటే మూడు రోజులు పడుతుంది. 30 కి.మీ. తప్పక నడవాలి. టిబెటియన్లకూ, చైనీయులకూ ఈ 54 కి.మీ పరిక్రమ చేయడానికి ఒక్కరోజు చాలు. అంత వేగంగా నడవగలరు వారు. ఇక్కడ పరిక్రమకు గుఱ్ఱాల మీద ప్రయాణించవచ్చు. ఇక్కడి జుతుల్‌పుక్ ప్రాంతం చేరుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. దారీ తెన్నూ ఉండదు. ప్రాణవాయువు తక్కువ. హృద్రోగ సమస్య ఉన్నవారు ఈ ప్రాంతానికి వెళ్లరు. సాధారణ భక్తులు పరిక్రమ చేయాలంటే కర్పూరం వాసన చూస్తూ, ఆక్సిజన్ సిలెండరును చేతపట్టుకొని వెళతారు. మూడవ రోజు వాహనాల్లో ప్రయాణం చేసే వీలుంటుంది. పరిక్రమ పూర్తయిన తర్వాత మేం బస చేసిన చోటుకి వచ్చి, మరుసటి రోజు తిరుగు ప్రయాణమయ్యాం. ఈ యాత్రలో కైలాస పరిక్రమ అతి కష్టం. కానీ అత్యుద్భుతమైన ఆ ప్రాంతాలను వీక్షించాలనే సంకల్పం ముందు అది పెద్ద కష్టం అనిపించదు.

 - మాంగాటి గోపాల్‌రెడ్డి (వ్యాసకర్త)
 
ఇలా వెళ్లాలి...
కైలాస్ - మానస సరోవర్ యాత్ర దాదాపు15 రోజులు.
     
ఢిల్లీ - ఖాట్మండ్ - టిబెట్ - న్యాలం మీదుగా మానస సరోవర్ చేరుకోవాలి.
     
న్యాలంలో మన రూపాయలను చైనా కరెన్సీ ‘యువాన్’లోకి మార్చుకోవాలి.  భారతీయ కరెన్సీ 10 రూపాయలకు ఒక చైనా ‘యువాన్’ ఇస్తారు.
     
న్యాలంలో సిమ్ కార్డులు లభిస్తాయి. అక్కడి నుంచి మన ప్రాంతానికి ఎస్టీడీ ఫోన్ చేసుకోవాలంటే నిమిషానికి 3 యువాన్లు ఛార్జి.
 
కైలాస్ యాత్రకు వెళ్లడానికి ముందు వైద్య పరీక్షలు (ఇ.సి.జి, రక్తపరీక్షలు, హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ షుగర్, స్ట్రెస్ పరీక్షలు) అవసరం అవుతాయి.
 
 అన్ని ప్రధాన నగరాల నుంచి కైలాస్ - మానస సరోవర్ యాత్రకు బుక్ చేసుకోవడానికి ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి.
 
ఈ యాత్రకు ఒక్కొక్కరికీ దాదాపు 77 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
 
ఏటా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనువైన సమయం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement