అమ్మో! హైపర్ పిల్లలు!! | he reasons for children in hyperactivity disorder | Sakshi
Sakshi News home page

అమ్మో! హైపర్ పిల్లలు!!

Published Thu, May 28 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

అమ్మో! హైపర్ పిల్లలు!!

అమ్మో! హైపర్ పిల్లలు!!

అల్లరి, దుడుకుతనం... ఇలాంటి గుణాలు పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపిస్తాయి. తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడతాయి. కొన్ని సార్లు అది మితిమీరుతుంది. హోమ్‌వర్క్ నుంచే కాదు అటు ఆటలనుంచి ఇటు టీవీ నుంచీ క్షణ క్షణానికీ దృష్టిమళ్లిపోతుంది. పిల్లల్లో చురుకుదనం చాలా సాధారణం. అవసరం కూడా. దాన్ని సహజమైన గుణంగానే పరిగణించాలి. అయితే ఒకస్థాయికి మించిపోయి పిల్లలకూ, వారితోపాటు పెద్దలకూ ఇబ్బంది కలిగించేంతగా ఉన్నప్పుడే పిల్లల చురుకుదనాన్ని, అతిచురుకుదనంగా (హైపర్ యాక్టివిటీ)గానూ, ఒక సమస్యను పరిగణించాలి.
 
పిల్లల్లో మితిమీరిన చురుకుదనం కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), ప్రవర్తనాపరమైన లోపాలు (కాండక్ట్ డిజార్డర్స్), ఆటిజం, బైపోలార్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్స్ వంటి ఉన్నప్పుడు పిల్లల్లో అతి చురుకుదనాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి.
 
తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలు
తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించాలని పిల్లలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారు కోరుకునే అటెన్షన్‌గానీ / సమయంగానీ తల్లిదండ్రుల నుంచి లభించనప్పుడు వారు అల్లరి చేసి తమ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు.  తల్లిదండ్రులు చాలా బిజీగా ఉన్న ఈ ఆధునిక కాలంలో పిల్లలకు వారు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్తారు. అలసిపోయి వస్తారు. వారి అలసట, విసుగు పిల్లలపై చూపిస్తారు. పిల్లలు సహజంగానే చేసే కొద్దిపాటి అల్లరిని కూడా భరించగలిగేంత సహనం, ఓపిక వీళ్లకు ఉండదు.

కానీ నిజానికి పిల్లల ఆరోగ్యం, సహజ వికాసం కోసం తల్లిదండ్రుల అటెన్షన్ చాలా ముఖ్యం. ఆ సమయాన్ని కేటాయించడం తల్లిదండ్రుల బాధ్యత.  ఇప్పుడు తల్లిదండ్రులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలను ఆగకుండా చదివించడం కొన్ని కుటుంబాల్లో ఒక తప్పనిసరి పరిస్థితిగా మారింది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ బాల్యాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. అప్పుడు పిల్లల పరిస్థితి అర్థమవుతుంది. ఎలాంటి శారీరకమైన కదలికలు లేకుండా కూర్చుంటే పిల్లల్లో అసహనం (రెస్ట్‌లెస్‌నెస్) కలుగుతాయి.

దాంతో పిల్లలు హైపర్‌యాక్టివిటీకి పాల్పడతారు. కాబట్టి పిల్లలకు శరీరం అలసిపోయేలా ఆటలాడేందుకు (ఫిజికల్ యాక్టివిటీకి) తగినంత సమయం ఉండాలి.  ఇక ఈ ఆధునిక యుగంలో మరో సమస్య టీవీ, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్స్ ద్వారా వస్తోంది. దీన్ని ఒకరకమైన జాడ్యం (అడిక్షన్‌లాగా) పిల్లల్లో వ్యాపిస్తోంది. పిల్లలు ఈ టీవీ, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్‌లోని హింస ఎక్కువగా ఉండే గేమ్స్‌కు/హారర్ చిత్రాలకూ బానిసలైపోవడం వల్ల గంటల తరబడి వీటికి అతుక్కుపోతున్నారు. దాంతో శరీరానికి అవసరమైన కదలికలు లేకపోవడం వల్ల ఎదుగుదల కూడా దెబ్బతింటోంది. కండరాలు బలహీనంగా మారిపోతున్నాయి.
 
పిల్లల్లో హైపర్‌యాక్టివిటీకి కారణాలు

పిల్లల ఎదిగే వయసులో వారికి చదువుతో పాటు శారీరక కదలికలు (యాక్టివిటీ) చాలా ముఖ్యం. మానసికమైన వికాసానికి ఇది కూడా తోడ్పడుతుంది. మన మెదడులో 10 టు ద పవర్ ఆఫ్ 12 కణాలు ఉంటాయి. ఒక్కో కణం నుంచి మరో కణానికి 10 టు ద పవర్ ఆఫ్ 4 వైర్లు (నిజానికి అవి నర్వ్ ఫైబర్లు) కలుపుతూ ఉంటాయి. అంటే మన మెదడు 10 టు ద పవర్ ఆఫ్ 16 వైర్లు కలిగిన ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. మెదడు నిర్మాణం, దానికి అవసరమైన మార్పులు చిన్న వయసులోనే జరుగుతాయి. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో మెదడును ఒక మైనపుముద్దతో పోల్చవచ్చు.

మనం దాన్ని ఎలా మలిస్తే అలా మారుతుంది. కాబట్టి మొదటి 16 ఏళ్ల సమయంలో పిల్లలకు ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తే అది జీవితాంతం వారిలో ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో అతిచురుకుదనానికి  (హైపర్ యాక్టివిటీకి) కారణాలు పరిశీలిద్దాం...  తగినంత నిద్ర లేనప్పుడు వారు అతిచురుగ్గా మారిపోతారు. చిరాకు కనబరుస్తారు.  పోషకాహార లోపం వల్ల కూడా అతిచురుకుదనం కలిగే అవకాశం ఉంది.  వాతావరణ కాలుష్యం కూడా ఎదిగే మెదడుపై తీవ్రప్రభావం కనబరుస్తుంది.

ఇందులోని లెడ్ వంటి కాలుష్యాలు/వ్యర్థపదార్థాలు, వారు తీసుకునే ఆహారంలో ఉండే పెస్టిసైడ్స్ వంటివి పిల్లల ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు పిల్లల రక్తంలో ఉండే లెడ్ వంటి విషాలు ఎంత కొద్దిమోతాదుల్లో ఉన్నా అది పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. దీనిప్రభావం వల్ల పిల్లలను ప్రవర్తనాలోపాల (కాండక్ట్ డిజార్డర్స్) వైపునకు నెడుతుందనేది డబ్ల్యూహెచ్‌ఓ పరిశీలన.
 
అతిచురుకుదనాన్ని సమస్యగా ఎప్పుడు పరిగణించాలి

పిల్లలకు కనీసం నాలుగేళ్లు దాటితేగానీ వారి హైపర్‌యాక్టివిటీని ఒక సమస్యగా గుర్తించలేం. ఎందుకంటే అతిచురుగ్గా ఉండటం ఈ వయసులోపు వారికి ఒక సహజగుణం. దీన్ని వ్యాధి/సమస్యగా పరిగణించకూడదు.  నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల పిల్లల్లో కూడా కొంత దుందుడుకుదనం, చురుకుదనం సహజమే. చుట్టూ పరుగెత్తడం, ఒకే విషయాన్ని తరచి తరచి అడగడం వంటివి వీరు చేస్తారు. అయితే ఇది స్థాయికి మించినా, ఈ దుడుకుదనం వల్ల ఇతరులకు సమస్యగా పరిణమిస్తున్నా, పిల్లలు తినడానికి కూడా ఒక చోట కూర్చోకుండా...  వారికి ఇష్టమైన కథలు చెబుతున్నా వినిపించుకోకుండా, నిలకడగా లేకుండా ఉంటున్నా దాన్ని సమస్యాత్మకమైన పరిస్థితిగా పరిగణించవచ్చు.  

ఏడు నుంచి పన్నెండేళ్ల పిల్లలు కనీసం ఆటలు ఆడేటప్పుడైనా కొంత నిలకడ చూపగలగాలి. ఆట పూర్తయ్యేవరకూ నికలడగా ఉండాలి. వీళ్లలో ఈ నిలకడ గుణం లోపించినప్పుడు, ఇతర పిల్లలను సైతం ఆటలాడకుండా విసిగిస్తున్నప్పుడు, తమ అవకాశం రాకుండానే తొందరపడుతున్నప్పుడు... దాన్ని సమస్యాత్మకమైన అతిచురుకుదనంగా పరిగణించవచ్చు.  టీవీని కూడా వీరు నిలకడగా చూడలేరు. ఒక కథను ఫాలో అవుతూ అది పూర్తయ్యేవరకూ ఆ ఛానెల్‌నే చూస్తూ ఉండలేరు. చేసేపనుల్లో తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో వారి చర్యలు ఇతరులకూ/తమకూ ఇబ్బందిగా పరిణమించినప్పుడు దాన్ని సమస్యగా గుర్తించాలి.
 
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
పిల్లలకు తగినంత సమయం కేటాయించండి.  స్కూల్లోనూ, ఇంటిదగ్గరా చదువుతో పాటు, ఆటపాటలకూ తగినంత సమయం ఇవ్వండి. వారు తగినంత విశ్రాంతి తీసుకోడానికీ అవకాశం ఇవ్వండి.  పిల్లలు హైపర్‌యాక్టివిటీని ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు గుర్తించినప్పుడు వారిని కచ్చితంగా కొంత సమయంపాటు విశాలమైన మైదానాలలో ఆటలకు వదలాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వారు తగినంతగా ఆటలాడి శారీరకంగా అలసట పొందితే ఈ హైపర్ యాక్టివిటీ సహజంగానే తగ్గుతుంది.  

పిల్లలు కుదురుగా కూర్చొని ఒక పనిని పూర్తిచేసినప్పుడు వారిని ప్రశంసించండి. ఇదెంతో కీలకం. పిల్లల్లో ఒక వ్యాపకం, కళను పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రశంస ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లలు సాధించగల గమ్యాలను నిర్దేశించండి. అవి సాధించగానే ప్రశంసించండి.  పిల్లలకు కొన్ని చిన్నచిన్న ఆటల వంటి యాక్టివిటీస్‌ను కల్పించాలి. ఉదాహరణకు దారంలో పూసలు ఎక్కించడం, ఏ రంగు పూసలను, ఆ రంగు పూసలుగా విడదీయడం వంటివి. 

ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి.  పిల్లలు అతిచురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వారిని దూషించడం, తక్కువచేసి మాట్లాడటం అస్సలు చేయకూడదు.  పిల్లలు టైమ్-టేబుల్ ఫాలో అయ్యేలా అలవాటు చేయాలి. ఇది క్రమంగా జరగాల్సిన పని. అంతేగానీ ఒకేసారి జరగాలని కోరుకోకండి.  పిల్లలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకునేలా చూడండి. శారీరక, మానసిక వికాసానికి ఇదెంతో కీలకం.
 - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై.
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement