చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో... | Heart diseases in women | Sakshi
Sakshi News home page

చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో...

Published Thu, Jan 18 2018 1:27 AM | Last Updated on Thu, Jan 18 2018 1:29 AM

Heart diseases in women - Sakshi

ఆడపిల్లకి ఎన్నో కష్టాలు. కన్నతల్లికి ఎన్నో శోకాలు. బంగారుతల్లికి ఎన్నో వ్యథలు. ఇది చాలక ఎన్ని శారీరక బాధలో!అన్ని బాధల్లో ఎన్ని వివక్షలో! ఇవి తెలుసుకుంటే చెల్లి జాగ్రత్త పడుతుందని.. గుండెకోతను తప్పించుకుంటుందని.. ఈ వివరాలను అందిస్తున్నాం.మహిళలలో గుండెవ్యాధులు... వాటికి  కారణాలూ...తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే..ఆమె తన వ్యథలను జయిస్తుందని..శారీరక బాధలను ఎదుర్కొంటుందని మా నమ్మకం... మా విశ్వాసం.

గుండెపోటు చికిత్సలో విదేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష...
గుండెపోటు వచ్చినప్పుడు పురుషులకు ఇచ్చే చికిత్సే మహిళలకు అందడం లేదన్న ఆందోళనకరమైన విషయం ఈమధ్యే వెల్లడయ్యింది. ఒక స్వీడిష్‌ అధ్యయనంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో స్వీడన్‌లోని 1,80,368 మంది గుండెపోటుకు గురైన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి. మొదటిసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చి కోలుకున్న తర్వాత, మళ్లీ అదే రెండోసారి వచ్చినప్పుడు మృతిచెందే మహిళల సంఖ్య... పురుషులతో పోల్చి చూస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. 

ఈ విషయమై బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ వ్యాఖ్యానిస్తూ... ‘నిజానికి సామాజికంగా చూస్తే గుండెజబ్బులు అనగానే అదేదో పురుషులకే వచ్చేవనే  అభిప్రాయం ఉంది. కానీ మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే గుండెపోటుతో మృతిచెందే మహిళలే ఎక్కువ’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేసింది బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌. పరిశోధకులు ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారం (డేటా)ను ‘యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌’తో పాటు ‘ద కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌’కు చెందిన ఆన్‌లైన్‌ కార్డియాక్‌ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. 

ఆ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన సత్యాలు చాలా దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గుండెపోటుకు గురైన పురుషులకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో... చాలా మంది మహిళలకు అదే చికిత్స లభ్యం కావడం లేదు. 

ఇదే అధ్యయనంలో కో–ఆథర్‌గా వ్యవహరించిన యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ క్రిస్‌గేల్‌ ఇందుకు కారణాలు చెబుతున్నారు. ఆయన చెబుతున్న అంశాలివి... ‘‘బయటనుంచి చూస్తే సాధారణ ప్రజానీకంతో పాటు ఆరోగ్యరంగంలో సేవలందిస్తున్న చాలామంది ప్రొఫెషనల్స్‌లో చాలామంది... గుండెపోటు వచ్చిన రోగులందరినీ ఒకేలా పరిగణిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తి అనగానే మధ్యవయస్కుడైన ఒక పురుషుడు స్థూలకాయాన్ని కలిగి ఉండి, డయాబెటిస్‌తో బాధపడుతుంటాడనీ, అతడికి పొగతాగే అలవాటుంటుందని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రా అలాగే ఉండలనేమీ లేదు. జనాభాపరంగా చూస్తే  గుండెపోటు విస్తృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో అది మరింత ఎక్కువ’’ అని ప్రొఫెసర్‌ క్రిస్‌గేల్‌ పేర్కొన్నారు. 

జెండర్‌ పరమైన తేడా ఎందుకంటే... 
గుండెపోటు వచ్చిన వారికి అందించే చికిత్సలో భాగంగా చేసే బైపాస్‌ సర్జరీ లేదా స్టెంట్స్‌ అమర్చడం వంటి వైద్యసేవలు పురుషులతో పోలిస్తే మహిళలకు 34 శాతం తక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు... పురుషులకు ప్రిస్క్రయిబ్‌ చేసే స్టాటిన్స్‌ (మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు రెండోసారి మళ్లీ రాకుండా నివారించేందుకు గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లోని పూడికను తొలగించే మందులు) కూడా మహిళలకు 24 శాతం తక్కువగా రాస్తున్నారు. 

గుండెపోటుకు చికిత్స అందించే  మూడు ముఖ్యమైన చికిత్సలూ స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలంటూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మహిళలకు అవి అందకపోవడమే జరుగుతోంది. ఒకవేళ మహిళలకు కూడా పురుషులకు ఇచ్చే చికిత్సే దొరికితే గుండెపోటుతో మృతిచెందే స్త్రీ, పురుషుల సంఖ్యలో ఇప్పుడు గణనీయంగా ఉన్న తేడా చాలావరకు తగ్గుతుందని ఈ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.

మరికొన్ని అంశాలు... 
ఈ అధ్యయనంలో భాగంగా చూసినప్పుడు ఏడాదిలో ఇంగ్లాండ్‌లో దాదాపుగా 1,24,000 మంది పురుషులు గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరితే... మహిళల్లో ఆ సంఖ్య దాదాపు 70,000 గా ఉంది. ఈ గణాంకాలను మరీ నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసిన సత్యం మరింత విభ్రాంతికి గురిచేసింది. ప్రొఫెసర్‌ గేల్‌ చెబుతున్న వివరాల ప్రకారం ‘‘గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరే దాదాపు 50 శాతం మహిళలకు పురుషుల్లాంటి వ్యాధినిర్ధారణ పరీక్షలు  జరగడం లేదు లేదా వారి విషయంలో తప్పుడు నిర్ధారణ (మిస్‌ డయాగ్నోజ్‌) జరుగుతోంది. ఇక అది వారికి అందించే మొత్తం చికిత్సను తప్పుదారి పట్టిస్తోంది. అంటే మొదట మనమో అంశాన్ని మిస్‌ చేశామంటే... అది ఆ మొత్తం చికిత్స ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా మహిళల్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది’’ అని ఆయన వివరించారు. అంతేకాదు... ఈ అధ్యయనంలో లభ్యమైన విషయాల్లో మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కేవలం ఒక్క గుండెపోటు మాత్రమే కాదు... డయాబెటిస్, హైబీపీ లాంటి ఇతర రుగ్మతల విషయంలోనూ మహిళలే ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. 

ఇక బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్‌ జెరేమీ పియర్‌సన్‌ మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం వెంటనే ఆయా అంశాలపై దృష్టిసారించాలని చెబుతున్నాయి. మనం అత్యవసరంగా ఈ అంశంపై దృష్టిసారించి, అందరిలోనూ అవగాహన పెంపొందేలా పూనుకోవాలంటూ సూచిస్తున్నాయి. కేవలం ఒక చిన్న జాగ్రత్త అంటే... పురుషులకు అందించే చికిత్సే మహిళలకూ అందించడం అన్న చర్య ద్వారా పరిస్థితులను తేలిగ్గానే మార్చేందుకు అవకాశం ఉంది. అప్పుడు తమ ప్రియమైన వారిని కోల్పోయే పరిస్థితి రాకుండా చేసి,  మనమెన్నో కుటుంబాలను ఆదుకోవచ్చు’’ అంటున్నారు జెరేమీ. 

భారతదేశంలో ఇలా...
గుండెపోటు విషయంలో పురుషులకూ, మహిళలకు తేడా ఉందంటే మీరు నమ్ముతారా? మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ వల్ల రుతుక్రమం కొనసాగినంతకాలం మహిళలకు ఒక సహజ రక్షణ ఉంటుంది. కానీ ఒకవేళ చికిత్స విషయానికి వస్తే... సామాజికంగా మహిళలకు అందాల్సిన చికిత్స విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. ఇదేదో వివక్ష ఎక్కువగా ఉండే మనలాంటి సంప్రదాయ దేశాల్లో మాత్రమే కాదు... బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకునే యూరోపియన్‌ దేశాల్లోనూ ఇదే తేడా కొనసాగుతోంది. స్వీడన్, ఇంగ్లాండ్‌లో జరిగిన అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అధ్యయనం కొనసాగిన ఆ దేశాల్లోనూ, ఇక మనదేశంలోని మహిళా రోగుల స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పనిలో పనిగా కొన్ని నివారణ చర్యలూ, మరికొన్ని జాగ్రత్తలు కూడా. 

గుండెజబ్బు విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు... అవి ఎందుకు? 
భారతీయ స్త్రీ, పురుషుల్లో గుండెజబ్బుల విషయంలో కనిపించే తేడాలేమిటి? అవి ఎందుకు అనే అంశాన్ని పరిశీలిద్దాం. మహిళల్లో గుండెజబ్బుల అంశానికి వస్తే కనిపించే వ్యత్యాసాలు, అసమానతలకు కారణాలను ఐదు అంశాల్లో వివరించవచ్చు... 
అవి ...

మొదటిగా స్త్రీల విషయంలో మెనొపాజ్‌ వరకు ఈస్టొజ్రెన్‌ వల్ల గుండె జబ్బుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో సుమారు యాభైయ్‌ యేళ్ళలో ఎక్కువ అయ్యే గుండె జబ్బు ఆడవాళ్ళలో అరవయ్‌ యేళ్ళకు ఎక్కువవుతుంది. ఒక వయసు వరకూ మహిళల్లో గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. 

కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్‌ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్‌ వచ్చినా లేదా పొగతాగే అలవాటు ఉన్నా మహిళలకు లభించే ఈ సహజ రక్షణ తొలగిపోతుంది. యాభై ఏళ్లలోపు వయసువారిలో మహిళలో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవ. కానీ యాభై–అరవైలలో ఈ అవకాశాలు ఇద్దరిలోనూ సమానం. అయితే అరవై ఏళ్లు దాటాక గుండెజబ్బులు మహిళల్లోనే ఎక్కువ. ఒకవేళ గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగిస్తే... వీళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. 

మహిళల్లో గుండెపోటు లక్షణాలు
గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్‌), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. 

మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ 
మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఆ అంశాలనే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి... 

వయసు ∙ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ∙రక్తపోటు ∙మధుమేహం ∙రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం ∙పొగతాగే అలవాటు ∙స్థూలకాయం ∙శారీరక శ్రమ/వ్యాయామం అంతగా లేకపోవడం ∙ఒత్తిడి.

ఇక కొలెస్ట్రాల్‌ విషయానికి వస్తే రుతుక్రమం ఆగిన తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ వంటి కొవ్వు పదార్థాల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్‌ పాళ్లు తగ్గడం వంటి అంశాలు కూడా గుండెజబ్బుల రిస్క్‌ను మరింత పెంచుతాయి. మహిళల్లో రుతుక్రమం ఆగాక రక్తపోటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే రుతుక్రమం ఆగిన మహిళలు తరచూ గుండెజబ్బుల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. 

హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీతో సహజ రక్షణ కరవే... 
కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్‌ వల్ల సహజంగానే మహిళల దేహంలో ఉత్పత్తి  కావడం వల్ల అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం ఒక విశేషం.  

నివారణ: ∙మహిళలు వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్‌ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి ∙ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. ∙రక్తపోటు, డయాబెటిస్‌ కొలెస్ట్రాల్‌ పాళ్లు పెరగడం వంటివి ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. 

డాక్టర్‌ శ్రీదేవి, సీనియర్‌ కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

రెండవది, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా పురుషులతో పోలిస్తే... మహిళలలో అవి పది శాతం సన్నగా ఉంటాయి. ఈ అంశం కూడా రక్తనాళాల్లో పూడిక త్వరగా చేరేందుకు దోహదపడుతుంది

మూడవది, గుండె జబ్బు వచ్చినపుడు లక్షణాల బట్టి వైద్యులు తర్వాతి పరీక్షలూ, చికిత్సా చేబడుతారు. ఈ లక్షణాలు మహిళలలో విభిన్నంగా ఉండడమే కాకుండా, అందరు మహిళలలో ఒకే రకంగా ఉండవు. అందువలన మహిళలలో గుండె జబ్బు కనుక్కోవడం ఆలస్యం అవుతుంది. 

నాలుగవది, వైద్యులు కూడా స్త్రీల చికిత్స విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు.

ఐదవది, స్త్రీలలో చికిత్సకు సంబంధించిన కాంప్లికేషన్స్‌ అధికంగా ఉంటాయి.

చివరిగా, పితృస్వామ్య సమాజంలో మహిళల యొక్క గుండె జబ్బులపై పెట్టే ఖర్చు మగవారి జబ్బుకి పెట్టే ఖర్చు కన్నా తక్కువగా ఉండటం ఒక సమస్య. దీనిని సమస్య అనడం కంటే సామాజిక వివక్ష అనడమే కరెక్ట్‌.

స్త్రీ, పురుషుల మధ్య గుండె పోటు చికిత్సలో విభేదాలు భారతదేశంలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చేసిన అనేక పరిశోధనల బట్టి ఈ విషయం తేట తెల్లమవుతుంది. 

డీమాట్‌ రెజిస్ట్రీ...: డీమాట్‌ రెజిస్ట్రీ అనే పరిశొధనలో, ప్రఖ్యాత గుండె నిపుణులు శ్రీనాధ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని విపులీకరించడానికి ప్రయత్నించారు. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్‌ చేసే సమయంలో పురుషులకన్నా స్త్రీలలో మందుల ప్రిస్కిప్ష్రన్‌ అసంపూర్తిగా ఉందని ఈ పరిశొధనలో తేలింది. అసలు పురుషులలో కూడా పాశ్చాత్య దేశలతో పొలిస్తే మందుల మోతాదు కరెక్ట్‌ గా లేదని అదే పరిశోధనలో బయటపడటం మరొక సంగతి. 

దక్షిణ భారత దేశంలోనూ ఈ లింగ భేదాలు ఖచ్చితంగా కనిపించాయి. అయితే కేరళలో మాత్రం ఈ వివక్ష కొంచెం తక్కువగా ఉందని అక్కడి పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. 

డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, 
సీనియర్‌ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ మాదాపూర్, హైదరాబాద్‌

జాగ్రత్తలు : ∙మహిళల్లో రుతుక్రమం ఆగాక లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ గుండెజబ్బు లక్షణాలను పసిగడితే గుండెపోటును నివారించే అవకాశముంది ∙రిస్క్‌ ఫ్యాక్టర్లలో నివారించగలిగే అవకాశం ఉన్నవి అంటే... కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం వంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement