నీ జీను ఫ్యాంటూ చూసి బుల్లెమ్మో...
ఈ పాటా గుర్తుంది...!
ఆ బుల్లెమ్మా గుర్తుంది!
ఎస్.. ఆమె ఇంద్రజ.
చేసినవి తక్కువ సినిమాలే అయినా సెల్యులాయిడ్‌పై ఆమె సొగసు చూడతరమా!
మోడ్రన్‌గా కనిపించే ఇంద్రజ పక్కా ట్రెడిషనల్...
కంప్లీట్ ఫ్యామిలీ విమెన్!
హీరోయిన్‌గా రాజభోగం చూసినా ఇంట్లో వంట తనే చేస్తుంది..
అవసరమైతే అంట్లు తోముతుంది..
బట్టలు కూడా ఉతుకుతుంది..
ఇంటి పనిలో...
ఇంతికి దొరికే హాయే వేరంటుంది ఆమె.
14 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై తళుక్కుమనబోతోన్న ఇంద్రజ తెలుగమ్మాయే అన్న విషయం చాలామందికి తెలీదు. ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఇంద్రజను అడిగి తెలుసుకుందాం...
ఎన్నాళ్లయ్యిందండీ మిమ్మల్ని చూసి..?
ఇంద్రజ: ఎన్నాళ్లు కాదండీ.. ఎన్నేళ్లూ అనండి. తెలుగు సినిమాలు చేసి పద్నాలుగేళ్లవుతోంది.
మరి... ఈ గ్యాప్‌లో ఇతర భాషల్లో కూడా చేయలేదా?
1999లో తెలుగులో చివరి సినిమా చేశా. కానీ, 2004 వరకు మలయాళం, తమిళ చిత్రాలు చేశాను. 2005లో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ఇదే. ముఖ్యంగా నా మాతృభాష తెలుగు ద్వారా మళ్లీ సినిమాలు మొదలుపెట్టడం ఆనందంగా ఉంది.
మరి... మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడనుకున్నారు... అనుకున్న తర్వాత అవకాశాల కోసం తెలుగు పరిశ్రమవారిని సంప్రదించారా?
మళ్లీ సినిమాల్లోకి రావాలా? వద్దా అనే విషయం గురించి ఆలోచించలేదు. మూడేళ్ల క్రితం నేను, మావారూ, పాప ఏదో ఊరెళుతున్నాం. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో నటీనటుల డేట్లు చూసే చలపతి పరిచయమయ్యారు. ‘ఎందుకు సినిమాలు మానేశారు. పెళ్లికి ముందెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారు కదా.. మీరు తప్పకుండా సినిమాలు చేయాలి’ అన్నారాయన. ఆ తర్వాత తర్వాత నాక్కూడా మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందనిపించింది. అలాంటి సమయంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో అవకాశం రావడంతో అంగీకరించాను.
ఈ సినిమాలో ఏ ప్రత్యేకత నచ్చి ఒప్పుకున్నారు?
ఇందులో నేను అజయ్‌కి భార్యగా నటించా. మావి లీడ్ రోల్స్. నాగశౌర్యది మా కొడుకు పాత్ర. నా పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు, నా వయసుకి అంత పెద్ద కొడుకు అంటే కరెక్ట్ కాదన్నాను. చేయనని కూడా చెప్పేశాను. కానీ, ఈ చిత్రదర్శకుడు త్రికోటి మాత్రం మీరే చేయాలని పట్టుబట్టారు. నా రీ-ఎంట్రీ ఘనత నిర్మాత సాయి కొర్రపాటికి, త్రికోటికే ఇవ్వాలి. అంతకు ముందు తల్లి పాత్రలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, వాటికి కథలో అంత ప్రాధాన్యం లేదు. ఈ పాత్ర అలా కాదు. పైగా, ఈ పాత్ర కోసం నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో టీనేజ్‌లోనే పెళ్లవుతుంది కాబట్టి, నాకో పెద్ద కొడుకు ఉంటాడు. ఆ కారణంగా ఇప్పుడు నా వయసెంతో తెరపై అలానే కనిపించవచ్చు.
మరి.. ‘బుడుగు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు కదా?
ఇందులో నాది అతిథి పాత్ర. సైకాలజిస్ట్ గీతారెడ్డిగా కనిపిస్తాను. బాగున్న అతిథి పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు.
మీరు తెలుగమ్మాయి కదా.. మరి వికీపీడియాలో మీ పేరు ‘రాజాత్తి’ అని ఉంది. అది తమిళ పేరు కదా..?
మేం తెలుగువాళ్లమే కానీ, మా పూర్వీకులు ఎప్పుడో చెన్నయ్‌లో స్థిరపడిపోయారు. నేను పుట్టింది కూడా అక్కడే. ఇక్కడ అమ్ములు, బుజ్జీ.. అని ముద్దుగా పిలుస్తాం కదా.. అలా తమిళంలో ముద్దుగా నన్ను రాజాత్తి అని పిలుస్తారు.
మరి.. ఇంద్రజ అనే పేరు ఎవరు పెట్టారు?
‘యమలీల’కన్నా ముందు నేను ‘జంతర్ మంతర్’ సినిమా అంగీకరించాను. అందులో నా పాత్ర పేరు ‘ఇంద్రజ’. ఆ చిత్రం ప్రారంభం నాడు ‘ఈ అమ్మాయి ఇంద్రజ అనే పాత్ర చేస్తోంది’ అని దర్శక, నిర్మాతలు అన్నారు. దాంతో శ్రీకాంత్ పక్కన ఇంద్రజ చేస్తోందని రాశారు పాత్రికేయులు. ఆ చిత్రదర్శకుడు భరత్.. ‘పేరు ఎలాగూ పబ్లిష్ అయ్యింది కదా.. ఆ పేరుతోనే కొనసాగితే బాగుంటుంది’ అన్నారు. దాంతో ఇంద్రజ పేరు ఫిక్స్ అయ్యింది.
మీ పూర్వీకులది ఏ ఊరు?
మీరు నవ్వుకున్నా సరే... నిజంగా నాకు తెలియదండి. ఎందుకంటే, మా ముత్తాతలకు ముందు తరంవాళ్లే తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయారు. అందుకని మా పూర్వీకులది ఏ ఊరో తెలియదు. తంజావూరు సరుక్కయ్ అగ్రహారంలో మా ముత్తాతలు ఉండేవాళ్లు. త్యాగరాజస్వామిగారి వంశ పారంపర్యంలో మా ముత్తాతల కుటుంబాలకు మూలాలు ఉండేవట.
ఓకే... ప్రస్తుతం మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి?
బేసిక్‌గా మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు మా ఇంటి పనులు మేమే చేసుకునేవాళ్లం. నేను సినిమాల్లోకొచ్చాక ఆర్థికంగా ఇంకా ఎదిగినా.. ఆ మధ్యతరగతి అలవాట్లు మాత్రం అలానే ఉన్నాయి. ఓ మామూలు గృహిణి ఎలా ఉంటుందో ఇన్నేళ్లూ నా జీవితం అలానే సాగింది. ఇంటిని చక్కబెట్టడం, పాపను చూసుకోవడం.. హాయిగా అనిపించింది.
మీకు పెళ్లయ్యిందని, తల్లి కూడా అయ్యారనీ చాలామందికి తెలియదు... రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా?
చెన్నయ్‌లో ఉన్నవాళ్లందరికీ నా పెళ్లి గురించి తెలుసు. ఇక్కడవాళ్లెవర్నీ పెద్దగా పిలవలేదు కాబట్టి, తెలియదు. అంతేకానీ రహస్య వివాహం ఏమీ చేసుకోలేదు.
ఇంతకూ మీది ప్రేమ వివాహమా?..
అవును. మావారి పేరు అబ్సర్. ఆయన మోడలింగ్ చేసేవారు. మంచి రచయిత, నటుడు. సినిమాలు చేయలేదు కానీ.. టీవీ సీరియల్స్‌లో నటిస్తుంటారు.
మీ ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది?
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆయన చాలా మంచి వ్యక్తి. తొలిచూపు ప్రేమ అని చెప్పలేను కానీ.. మా మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారింది.
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?
మేం ఇద్దరం ఒకరికి ఒకరు చెప్పుకోకపోయినా, ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం అని అర్థం చేసుకున్నాం. వన్ ఫైన్ డే ఇద్దరం కలిసి మాట్లాడుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
మీ మతాంతర వివాహానికి ఇంట్లోవాళ్లు అంగీకరించారా?
అబ్జర్ వ్యక్తిత్వం మావాళ్లకి నచ్చింది. వాళ్లింట్లోవాళ్లకి నేను నచ్చాను. దాంతో మేం పెళ్లి చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం రాలేదు.
తల్లయిన తర్వాత శరీరాకృతిలో మార్పు రావడం సహజం. కానీ, మీరు మునుపటిలానే ఉన్నారే?
అది నా అదృష్టం. ఇలా ఉండటం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఇంటి పనులు బాగా చేస్తాను. అదే నాకు మంచి వ్యాయామంలాంటిది. దానికి తోడు ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నేను పూర్తి శాకాహారిని. నేనిలా ఉండటానికి అది కూడా హెల్ప్ అయ్యింది.
పెళ్లి తర్వాత మీకు ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరం రాలేదా?
లేదు. ఒకవేళ మా ఆయనకు మాంసాహారం తినాలపిస్తే.. మా అత్తగారింటికి వెళతారు. లేకపోతే ఏదైనా హోటల్‌లో తింటారు. ఇప్పటివరకు ఇంట్లో నాన్‌వెజ్ వండింది లేదు.
రెండు భిన్న సంస్కృతులకు చెందిన ఇద్దరు కలిసి ఒకే జీవితం గడపడం సులువేనా?
మానసిక పరిణతి ఉంటే సులువే. ఓ వ్యక్తి మీద మరో వ్యక్తికి ఇష్టం ఏర్పడటానికి రకరకాల కారణాలుంటాయి. ఆ వ్యక్తి మనసు నచ్చి ఉండొచ్చు. ప్రవర్తనను ఇష్టపడొచ్చు. ఈ వ్యక్తితో మన జీవితం బాగుంటుందనిపించవచ్చు. అబ్జర్‌తో నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుందనిపించింది. నా గురించి కూడా తనకదే ఫీలింగ్. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునేంత పరిణతి, అవగాహన మాకు ఉంది.
పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేయాలనే విషయంపై మీవారేమైనా ఆంక్షలు పెట్టారా?
అలాంటిదేం లేదు. వాస్తవానికి ఆయన ప్రోత్సాహం వల్లనే సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ‘పెళ్లయినంత మాత్రాన ఇంట్లో కూర్చోవాలని లేదు. సినిమాలు చెయ్యి’ అని మావారు అనేవారు. కానీ, అవుట్‌డోర్ షూటింగ్స్ చేయాల్సి వస్తుందని నేనే ఇష్టపడలేదు. అయితే, సినిమాల్లో కొనసాగాలనుకున్న తర్వాత నేనూ, మావారూ ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఆ నిబంధన ప్రకారం నేను షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు, మావారు ఎక్కువసేపు పాపకు టైమ్ కేటాయిస్తారు. నేను ఇంటికెళ్లిన తర్వాత తన పనితో బిజీగా ఉంటారు.
ఇప్పుడు మీ పాప వయసెంత?
ఆరేళ్లు. ప్రస్తుతం తను ఒకటో తరగతి చదువుతోంది.
ఎప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం మీరు చేసిన ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లమ్మో...’ పాట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. ఆ పాట చేసినప్పుడు మీకెలా అనిపించింది?
అప్పుడు నేను సినిమాలకు కొత్త. డెరైక్టర్ చెప్పింది చేసేదాన్ని. అలాగే ‘జీనూ ప్యాంటు..’ పాట చేశాను. కొరియోగ్రాఫర్ చెప్పింది చేసేసేదాన్ని. అంతే. ఆ తర్వాత ఆ పాటకు వచ్చిన పాపులార్టీ చూసి, ‘ఓహో.. చాలా మంచి సాంగ్ చేశాం’ అనుకున్నా.
అప్పట్లో మీతో పాటు చేసిన కథానాయికల్లో మంచి స్థానానికి చేరుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు సౌందర్య. కానీ, మీరు అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోవడానికి కారణం?
నేను సినిమాల్లోకొచ్చినప్పుడు నా వయసు జస్ట్ 14. సో.. సినిమాల ఎంపిక విషయంలో పరిణతి ఉండేది కాదు. సౌందర్యగారు నాకన్నా సీనియర్. మా ఇద్దరికీ మధ్య దాదాపు ఆరేడేళ్ల వయసు వ్యత్యాసం ఉంది. పైగా ‘నేను నంబర్ వన్ కావాలి. అందరూ నా సినిమాలే చూడాలి’ అని కోరుకునే వ్యక్తిని కాదు. విధిని నమ్ముతాను. మనం ఏం చేయాలో దాని తాలూకు స్క్రిప్ట్‌ని ఆ దేవుడు ముందే రాసేస్తాడు. ఆ ప్రకారమే జరుగుతుందని భావించే మనసత్త్వం నాది. అందుకే నేను దేనికీ పెద్దగా బాధపడిపోవడం, ఆనందపడిపోవడం అనేది ఉండదు.
మొదట్నుంచీ మీది ఇదే తరహా మనస్తత్వమా?
అవును. ఆ దేవుడి దయ వల్ల నాకు చిన్నప్పుడే ఈ భావన ఏర్పడింది. అందుకే నేను దేన్నీ ప్లాన్ చేసుకోలేదు. ఎలా జరిగితే అలా.. అంతే. ఒకసారి మనం ‘జీవితం’ గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరైనాసరే చిన్నప్పుడు బాగా చదువుకోవాలనుకుంటాం. పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం చేయాలనుకుంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చే దశలో మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఎలాంటి రోగాల బారిన పడకుండా, ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా, మంచంలో పడే అవకాశం రాకుండా, ప్రశాంతంగా నిద్రలోనే ఆ దేవుణ్ణి చేరుకోవాలని కోరుకుంటాం. సో.. జీవితం మొత్తం ఎంత పాకులాడినా చివరి కోరిక మాత్రం ఎవరికైనా ఇదే అయ్యుంటుంది. అందుకే.. దేనికీ పెద్దగా పాకులాడకూదు.
మీకు దైవభక్తి ఎక్కువా?
అవును. నేను ఆ షిరిడీ సాయినాథుని భక్తురాల్ని. ఆ దేవుడంటే ఎంత భక్తి అంటే.. నా డెలివరీ టైమ్‌లో ఆ కష్టం తెలియకుండా ఆ దేవుడు సహాయం చేశాడనేంత. ఆ షిరిడీ సాయిబాబా స్వయంగా నన్ను ఆ పుట్టపర్తి బాబాకి అప్పగించారేమో అని నా నమ్మకం. బాబాలో నేను తండ్రిని చూసుకుంటాను.
పూజలు బాగా చేస్తారా?
లేదు. గుడికి కూడా వెళ్లను. ఆ దేవుడు మనం చేసే పూజల వల్ల సంతోషపడిపోతాడంటే నమ్మను. దేవుడు నిజంగా ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? తన విగ్రహం ముందు ఓ గ్లాసుడు పాలు పెట్టి, ఆ తర్వాత దాంతో పాయసం చేసుకుని తిన్నప్పుడు కాదు. అదే పాలుని తిండికి లేక అల్లాడుతున్న పిల్లలకు ఇచ్చినప్పుడు. ఇతరులకు సహాయం చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే.
ఓకే.. మీ పాప గురించి మాట్లాడుకుందాం... భవిష్యత్తులో తను హీరోయిన్‌గా చేస్తానంటే ఒప్పుకుంటారా?
ఓ తల్లిగా నాకు ఓకే కాదు. ఎందుకంటే, ఇది శాశ్వతమైన వృత్తి కాదు. ఒక పర్మినెంట్ ఇన్‌కమ్ ఉండదు. వస్తే.. వస్తుంది. లేకపోతే లేదు. అందుకని, బాగా చదువుకుని తన కాళ్ల మీద తను నిలబడగలిగే ఉద్యోగం సంపాదించుకోవాలని నాకుంది. అప్పుడు, ఒకవేళ పేషన్ కోసమే సినిమాలు చేస్తానంటే సమ్మతిస్తాను. అంతేకానీ, సినిమాలే కెరీర్ అంటే నేను ఒప్పుకోకపోవచ్చేమో. కానీ, మన చేతుల్లో ఏముంది? ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది.
- సంభాషణ: డి. జి. భవాని
హీరోలు 50, 60 ఏళ్ల వయసులో ఉన్నా ఎంచక్కా హీరోలుగానే చేస్తారు. కానీ, హీరోయిన్లను మాత్రం 30 ఏళ్లు దాటితే అమ్మ, అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తారు. అది మీకెలా అనిపిస్తుంది?
నేను దీన్ని చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాను. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే.. పెళ్లి కాని ఆడవాళ్లను ఏ మగాడైనా తన లవర్‌గానో, భార్యగానో.. ఎలాగైనా ఊహించుకోవచ్చు. కానీ, పెళ్లయిన ఆడవాళ్ల గురించి అలా ఊహించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా తల్లయిన ఆడవాళ్ల గురించి నీచమైన ఊహలు చేయరు. అందుకే, పెళ్లయిన ఆడవాళ్లు డ్యూయెట్లు పాడితే అంగీకరించరు. అది అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పరిస్థితులు ఫర్వాలేదు. ఒకప్పుడు పెళ్లయిన తారలకు ‘ఓల్డ్ మదర్’ కారెక్టర్లు ఇచ్చేవారు. ఇప్పుడు ‘యంగ్ మదర్’ అనే కేటగిరీ ఉంది. అందుకే హ్యాపీ. అలాగే, పోలీసాఫీసర్, లాయర్.. ఇలాంటి పాత్రలు చేయాలని ఉంది. అమ్మ, అక్క, వదిన పాత్రలూ చేస్తా. కానీ, ఆ కథకు ఆ పాత్ర ప్రాణం పోసేట్లు ఉండాలి. అప్పుడే చేస్తా.
నాది రహస్యవివాహం కాదు!
Published Sat, Sep 6 2014 11:15 PM | Last Updated on Wed, Aug 29 2018 9:35 PM
Advertisement
Advertisement