జీవితంలో బరువుబాధ్యతలుంటాయి...అవి తప్పనిసరి. అలా అని బాధ్యతగా బరువు పెంచుకుంటే ఎలా? అసలు మనిషి ఎంత బరువుండాలి? కొంచెం బొద్దుగా ఉన్న అప్పటి హీరోయిన్లు ఆరోగ్యంగా లేరనా? జీరోసైజ్‌లో ఉన్న నేటి హీరో హీరోయిన్లు చాలా హెల్దీ అనా? సోషల్ మీడియా కుంపటి ఒకటి దాంతో వచ్చే బరువైన సలహాల్లో ఏది ఒప్పు... ఏది ముప్పు అన్నది ఎలా తెలుసుకోవాలి?ఈ గురువారం నుంచి బరువు దించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఎందుకంటే... ‘భారము మీదే కదా!’
ఇప్పుడంటే సన్నగా ఉండటమే అందం అనే భావన బలపడిందిగానీ గతంలో బొద్దుగా ఉండటాన్నే ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించేవారు. సినిమాల్లో భానుమతి, సావిత్రి... ఆ తర్వాత సౌందర్య, నగ్మా... ఇలా పిసరంత లావుగా ఉన్నవాళ్లనే అందమైనవారుగా ఎంచేవారు. కానీ ఆ రోజులు పోయాయి. లావుగా ఉండటం సౌందర్యానికి ఆటంకంగా అనారోగ్యానికి చిహ్నంగా భావించే పరిస్థితులు వచ్చాయి. ఊబకాయం కేసులు పెరుగుతున్న కొద్దీ మనుషులూ తద్వారా దేశాలూ దాని గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు.
ప్రపంచానికీ, దేశాలకూ అస్వస్థతా!?
ఊబకాయం వల్ల డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, స్లీప్ ఆప్నియా, డిప్రెషన్ వంటి దాదాపు 65 రకాల జబ్బులు నేరుగా వస్తాయన్నది ఇప్పటికే తేలిన సంగతి. అయితే వీటితో పాటు మరో 100 రకాల ఆరోగ్య సమస్యలకు కూడా బరువు పెరగడమే పరోక్ష కారణం అని తెలుస్తోంది. ఊబకాయం వల్ల ఇప్పటివరకూ మనం ఊహించని సామాజిక, ఆర్థిక అస్వస్థతలు కూడా ఏర్పడుతున్నాయి.
ఉదాహరణకు...
∙ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 4 కోట్ల మంది ప్రీ–స్కూల్ వయసు పిల్లలు స్థూలకాయం వల్ల మరణిస్తున్నారని 2007 నాటి ఒక ర్యాండమ్ అధ్యయనంలో తెలిసింది. మరి ఇదే సమస్యతో మరణిస్తున్న యువత సంఖ్య ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 28 లక్షలు. ఇంత విలువైన మానవ వనరులను మనం కోల్పోతున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాజానికి జరుగుతున్న తీరని నష్టం.
∙పిల్లల్లో ఆధునిక ఆహారంతో స్థూలకాయం వస్తోందని గ్రహించి కార్లలో పిల్లల కోసం స్టాండర్డ్ సీట్ కొలతలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు అమెరికాలో 2,50,000 మంది పిల్లలను అధ్యయనం చేశారు. దాని ఫలితంగా ఇప్పుడున్న కొలతల కంటే సీట్లు పెద్దవి చేయాల్సిందేనని తేలింది. అలా పెద్దవి చేస్తే గాని ఊబకాయం ఉన్న చిన్నారులకు అవి సరిపోవని తెలిసి ఎర్గానమిక్ నిపుణులు అవాక్కయారు. ఇలా స్థలంపై పడే ఒత్తిడీ, కార్ల సీట్ల ప్రామాణికతను పునర్నిర్వచించడం, వాటి తయారీ... ఇవన్నీ అనుకోని ఖర్చులూ, సమాజంపై అదనపు భారాలే. ∙మిగతా వారితో పోలిస్తే ఊబకాయులకు సాధారణంగా రకరకాల జబ్బులు వస్తాయన్నది తెలిసిందే కదా. అమెరికాలో ఊబకాయం ఉన్నవారు తమ జబ్బులకోసం ఖర్చు చేస్తున్న డబ్బు భారతీయ కరెన్సీలో చూస్తే ఏడాదికి 18,61,785 కోట్ల రూపాయలు. ఇది కేవలం డబ్బు పరంగా దేశానికి వాటిల్లుతున్న నష్టం కాగా... వారు పెట్టే సెలవులు, ఆఫీసు ఎగ్గొట్టే రోజులు లెక్కేస్తే దాదాపు నాలుగు కోట్ల పనిదినాలని తేలింది. ఇదీ అమెరికా వంటి అగ్రదేశం చవిచూస్తున్న నష్టం. అది ఆర్థిక అస్వస్థతకు ఒక పక్కా ఉదాహరణ.
మానసికంగా వేధింపులూ ఉంటాయి...
లావుగా ఉన్నవారు ఎంత గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నప్పటికీ, ఎంతటి సమర్థులైనప్పటికీ వారిని రకరకాలుగా అవమానిస్తారు. చనువును బట్టి నేరుగా కూడా విమర్శిస్తారు. రకరకాల నిక్‌నేమ్‌లతో పిలుస్తుంటారు. ఆయిల్‌డ్రమ్ము, రోడ్డురోలర్, దిబ్బరొట్టె, లడ్డూ లాంటి పేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తుంటారు. దాంతో లావుగా ఉన్నవారు న్యూనతకు గురవుతుంటారు. స్థూలకాయులు డిప్రెషన్‌లోకి కూరుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం వైద్యపరమైన అంశం కాగా వారు ఆత్మన్యూనతకు గురికావడం కూడా దీనికి తోడయ్యే అంశం. అంటే దీన్ని బట్టి తెలిసేదేమిటంటే. ఒకరు ఎంతటి మంచి స్థానంలో ఉన్నా, ఎంతగా ప్రభావితం చేయగల పొజిషన్‌లో ఉన్నా ఫిట్‌నెస్ లేకపోతే వారు మరోరకంగా కూడా న్యూనతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఒక్కోసారి కెరీర్‌ను సైతం ప్రభావితం చేస్తుంటాయి.
అదనపు బరువుతో ఖర్చు ఆకాశంలోకి ఎగిరింది
యూఎస్ ఎయిర్‌లైన్స్ 2000 సంవత్సరంలో సరదాగా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా విమానం టికెట్టు వెల ఒకటే కదా. మరి అలాంటప్పుడు ఊబకాయం ఉన్నవారి ఆ అదనపు బరువుపై తాము ఏడాదికి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దామని అనుకున్నారు. సరదాగా వారు చేసిన ఈ పరిశీలన సీరియస్‌గా గుండెలు బాదుకునేలా చేసింది. ఇలా అదనపు బరువున్న వారి కోసం వారు కాల్చిన అదనపు ఇంధనం 132.48 కోట్ల లీటర్లు కాగా అందుకు వారు చేసిన వ్యయం రూ. 1896.81 కోట్లు. ఇది ఒక దేశానికి తాను ఏమాత్రం ఊహించని కోణంలో ఊహించని విధంగా జరుగుతున్న నష్టం.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి?
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–4... అంటే 2015–16 లెక్కల ప్రకారం భారత్‌లోని ఊబకాయం చిత్రపటం ఇలా ఉంది. భారత్‌లో లావుకు/అధిక బరువుకు ప్రామాణికంగా పరిగణించే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 20.7 శాతం కాగా... పురుషులు 18.9 శాతం. తెలంగాణలో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 28.1 శాతం కాగా... పురుషులు 24.2 శాతం. అదే ఆంధ్రప్రదేశ్‌లో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 33.2 శాతం కాగా... పురుషులు 33.5 శాతం. అంటే మొత్తం దేశంలో ప్రజల ఊబకాయాలతో పోలిస్తే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్... ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఊబకాయాలు ఎక్కువే. అయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఊబకాయం మరింత ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడో వంతు మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒక అపోహ వ్యాయమం చేస్తున్నందున బరువు పెరగదు, కాబట్టి ఏమైనా తినేయవచ్చు.
ఒక వాస్తవం
ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తగినంత వ్యాయామం చేస్తున్నాం కదా అని ఏదైనా తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఊబకాయం రాకుండా ఉండేందుకు వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదు. అలాగని తిండి ఒక్కటి తగ్గిస్తే కూడా ఫలితం నాస్తి. వీలైనంత తక్కువ కేలరీలతో ఆహారం తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఊబకాయంతో వచ్చే ప్రత్యక్ష ఆరోగ్య సమస్యల్లో కొన్ని ఇవి...
ఊబకాయంతో కొన్ని జబ్బులు తప్పక వచ్చే ముప్పు ఉంది. దినచర్యల్లో చురుకుదనం లోపించడం, , ఆయాసంతో పాటు వాటిలో ఇవి కొన్ని... ∙డయాబెటిస్ ∙గర్భాశయంలో నీటితిత్తులు ( పీసీఓడీ–పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) ∙హైబీపీ స్లీప్ ఆప్నియా (గురక, నిద్రలో ఊపిరి తీసుకోవడం సాధ్యం కాకపోవడం) ∙ఆర్థరైటిస్ ∙గుండెజబ్బులు ∙కొన్ని రకాల క్యాన్సర్లు సంతానలోపం, అంగస్తంభన లోపాలు, లావు కారణంగా లైంగిక సామర్థ్యం తగ్గడం (విరులిటీ) ∙హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం ∙జీర్ణక్రియ మందగించడం ∙మానసిక (సైకోసొమాటిక్ ) సమస్యలు ∙మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ∙మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ∙కీళ్లనొప్పులు నడుము నొప్పి ∙డిప్రెషన్ వంటివి. అసలు ఊబకాయం కాస్మటిక్ అంశం కాదనీ, దాన్ని జబ్బుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.
జబ్బులెందుకు వస్తాయి?
ఒళ్లు పెరిగితే జబ్బులోస్తాయని తరచూ వింటూ ఉంటాం. అయితే ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుందామని వర్జీనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. కొవ్వు కణజాలంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఊబకాయంతో గతి తప్పడం వల్ల ఊబకాయులకు జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధన చెబుతోంది. శరీరంలోని స్వేచ్ఛాణువులు (ఫ్రీ రాడికల్స్) కొవ్వు కణాలకు అతుక్కోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుందనీ మంట/వాపుల రూపంలో ఉండే ఈ స్పందన ఎక్కువ కాలంపాటు కొనసాగితే వ్యాధిగా పరిణమిస్తుందని ఇప్పటికే మనకు తెలుసు. అయితే ఇది అన్ని రకాల కొవ్వు కణాల విషయంలో నిజం కాదని తాజా పరిశోధన చెబుతోంది. కొవ్వులకు అతుక్కున్న స్వేచ్ఛాణువులు కొన్ని రోగ నిరోధక కణాలపై ప్రభావం చూపి అవి అతిగా పనిచేసేలా చేస్తున్నాయని ఫలితంగా మంట/వాపులు మొదలవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వ్లాడ్ సెర్‌బూలియా అంటున్నారు. కురచగా ఉన్న కొవ్వులకు స్వేచ్ఛాణువులు అతుక్కున్నప్పుడు ఆరోగ్యానికి మేలు జరుగుతోందని వ్లాడ్ బృందం గుర్తించింది. ఆరోగ్యకరమైన కొవ్వు కణజాలాంతో పోల్చినప్పుడు ఊబకాయపు కణజాలంలో కురచ కొవ్వు కణాలు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వ్లాడ్ తెలిపారు.
తగ్గడానికి సింపుల్ మార్గాలు
బరువు తగ్గడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆహారనియమాలు పాటిస్తూ ఆచరించేవి, వ్యాయామ రీతులను అనుసరిస్తూ చేసేవి... ఇలా ఎన్నో ఉన్నప్పటికీ చాలా తేలిగ్గా అందరూ అనుసరించగలిగే కొన్ని మార్గాలను ఇక్కడ సూచిస్తున్నాం.
∙భోజనానికి అరగంట ముందు అరలీటరు నీళ్లు తాగాలి. ఆ ప్రక్రియ జీవక్రియల వేగాన్ని 24–30 శాతం పెంచుతుంది. దాంతో వాస్తవంగా దహనమయ్యే క్యాలరీల కంటే మరికొన్ని అదనంగా దగ్ధమవుతాయి.
∙కాఫీలు, టీలలో పాలు, పంచదార వాడకూడదు. సాధారణ కాఫీ, టీలకు బదులు బ్లాక్‌కాఫీ, బ్లాక్ టీ తాగడం మంచిది. దీని కంటే గ్రీన్ టీ తాగుతుండటం ఇంకా మేలు.
∙బాగా పొట్టు ఒలిచిన పిండిపదార్థాలకు (రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్స్‌కు) బదులుగా పొట్టు తీయని ముడి ఆహారాలు తీసుకోవాలి. కార్భోహైడ్రేట్లను వీలైనంతగా తగ్గిస్తే ఇంకా మంచిది.
∙తిండి కలిగితే కండకలదోయ్... కండ కలవాడే మనిషోయ్ అన్న సూక్తి అక్షర సత్యం. ఆ తిండి ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ కండ పెరగడం ఫిట్‌నెస్ కోసం అయి ఉండాలి. ఇక్కడ తిండి కండ పెరగడం కోసమే తప్ప కొవ్వు పెరగడం కోసం కాదు. కొన్ని తిండ్లతో కొవ్వు పెరుగుతుందనీ... కొవ్వు పెరిగేవాడు రోగి అవుతాడని గుర్తుంచుకోవాలి.
∙రాత్రిపూట డిన్నర్ తర్వాత బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్రష్ చేసుకొని ఉన్నందువల్ల మళ్లీ ఏదైనా తినడానికి వెనకాడతారు.
∙ఆకలైనప్పుడే తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ఇలా తినడమే బరువు తగ్గడానికి మంచి మార్గం.
∙భోజనం చేసే సమయంలో మెల్లగా చాలాసేపు నములుతూ తినాలి. దీనివల్ల తక్కువ తినడంతోపాటు తక్కువ ఆహారంతోనే కడుపు నిండుతుంది.
∙ఆహారంలో మిరియాలు వాడిన పదార్థాలను తింటే బరువు తగ్గుతుంది. వాటిలోని కొన్ని పోషకాలు జీవక్రియలను పెంచడం వల్ల క్యాలరీలు త్వరగా దహనమవుతాయి... ఆకలి కూడా కాస్తంత తగ్గుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువ.
∙ఆహారంలో పిండిపదార్థాలు, కొవ్వుల కంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
∙కూల్‌డ్రింక్స్, చక్కెరతో ఉండే సోడాలు, ఫ్రూట్‌జ్యూస్‌లు వద్దు. పండ్లరసాలకు బదులు పండ్లే తినండి.
∙చిన్న చిన్న దూరాలకు వాహనం వాడకండి. వాహనం మీద వెళ్లాల్సి వస్తే సైక్లింగ్ చేస్తూ వెళ్లండి. లేదా నడవండి. దీనివల్ల మూడు ప్రయోజనాలు... ఇంధనం తక్కువ కాలడం వల్ల డబ్బు ఆదా. కాలుష్యం తగ్గడం ఆరోగ్యానికి దోహదపడుతుంది. అలాగే వ్యాయామ ఫలితం కూడా దక్కుతుంది.
∙టీవీ చూసే సమయంలో రిమోట్ దగ్గరగా ఉంచుకోకండి. దాంతో ఛానెల్ మార్చాలనుకున్నప్పుడల్లా టీవీ దగ్గరకు నడిచివెళ్లే అవసరం ఏర్పడుతుంది.
∙ఆఫీసు లేదా వర్క్‌ప్లేస్‌లో మూడు లేదా అంతకులోపు అంతస్తులకోసం మెట్లు వాడండి.
∙బరువు తగ్గడానికి బరువులు ఎత్తే వ్యాయామాల కంటే ఏరోబిక్ వ్యాయామాలు, స్లో జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు చాలా మంచివి.
∙కంటినిండా నిద్రపోవాలి. ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేమికీ, ఊబకాయానికి సంబంధం ఉంది. నిద్రసరిగా పోని పిల్లల్లో 89 శాతం మందికి, పెద్దల్లో 55 శాతం మందికి ఊబకాయం వస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. పైన పేర్కొన్న సాధారణ, సింపుల్ ఉదాహరణలు కాకుండా బరువు తగ్గడానికి అనేక ఆహారప్రక్రియలు, వ్యాయామ రీతులు, సూర్యనమస్కారాలు, యోగా వంటి ప్రక్రియలు వంటి ప్రత్యేకమైన మార్గాలున్నాయి. మరింత విపులమైన కథనాల రూపంలో వాటిని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
గమనిక : ఈ సూచనలు సమగ్రం కాకపోవచ్చు. వీటిలో కొన్ని కొందరికి సరిపడకపోవచ్చు. శరీరతత్వాన్ని బట్టి మనిషికీ మనిషికీ మారవచ్చు. అందుకే నిపుణుల సలహాలు తప్పనిసరి!
– డాక్టర్ కె. శివ రాజు
సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment