ప్రపంచం... అతడి గ్రామం!
ఒక పత్రికలో ఎయిడ్స్ బాధితుడికి సంబంధించిన వార్త ఒకటి చదివాడు సోమెన్ దేవ్‌నాథ్. సొంత ఇల్లు అంటూ లేని ఒక ఎయిడ్స్ బాధితుడు కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు దీనస్థితిలో చనిపోయాడు. ఆ వార్త చదివి సోమెన్ మనసు చెదిరిపోయింది. తాను ఉండే బసంతి (పశ్చిమబెంగాల్) గ్రామంలో ఈ వార్త గురించి కనిపించినవారికల్లా చెప్పి బాధపడిపోయాడు.
నలుగురితో చెబితే బాధ తరిగిపోతుంది అంటారు. తరగడం మాట అలా ఉంచి తన వంతుగా ఏదైనా చేయాలనే తపన మాత్రం పెరిగిపోయింది.
ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఎయిడ్స్ గురించి వీలైనంత ఎక్కువగా అధ్యయనం చేశాడు. బెంగాల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి శిక్షణ పొందాడు.
తన దగ్గర ఉన్న సమాచారాన్ని వివిధ ప్రాంతాల ప్రజలతో పంచుకోవడానికి సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు.
వృక్షశాస్త్రం, ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీలు ఉన్న సోమెన్‌ను ‘‘హాయిగా ఉద్యోగం చేసుకొంటూ, కడుపులో చల్ల కదలకుండా బతకవచ్చు కదా!’’ అని చాలామంది సలహా ఇచ్చారు.
సోమెన్ దృష్టిలో హాయిగా బతకడం అంటే అది కాదు. తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. హాయిగా బతకడం అంటే వాటికి చేరువ కావడమే.
అందుకే తన క్షేమం గురించి ఆలోచించకుండా బయలుదేరాడు. అయితే ఈ ప్రయాణం నల్లేరు మీద బండి నడక కాలేదు.
అనేకసార్లు చావు తప్పి కన్ను లొట్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2009లో సోమెన్‌ను పాకిస్థాన్‌లో తాలిబన్‌లు అపహరించారు. 24 రోజుల పాటు వారి చెరలో ఉండాల్సి వచ్చింది.
ఒకొక్కరోజు ఒక్కో నరకం చూడాల్సి వచ్చింది.
వారి దగ్గర ఒక రోజు క్లీనర్ పని చేయాల్సి వచ్చేది. మరోరోజు వంట పని...ఇలా ఎన్నో!
‘‘ఇక నా పని అయిపోయినట్లే’’ అనుకున్నాడు సోమెన్.
చనిపోతున్నాననే బాధ కంటే తన లక్ష్యం చేరకుండానే చనిపోతానేమో అనే బాధ అతడిని పీడించింది. ఒకరోజు అదృష్టం అతడి తలుపు తట్టింది.
‘‘ఇతడు ప్రమాదకర వ్యక్తి కాదు’’ అని నిర్ధారించుకున్న తాలిబన్‌లు సోమెన్‌ను విడిచి పెట్టారు.
‘హమ్మయ్య’ అనుకుంటూ మళ్లీ సైకిల్ ఎక్కాడు. ఇక్కడితో అతని కష్టాలేమీ ఆగిపోలేదు. వివిధ దేశాల్లో ఆరుసార్లు దొంగల బారిన పడ్డాడు. అల్లరిమూకల చేత దాడికి గురయ్యాడు. ఆకలిబాధలు ఎదుర్కొన్నాడు.
పదహారు సంవత్సరాల్లో ప్రపంచాన్ని చుట్టి రావాలనే అతని సంకల్పాన్ని ఇవేమీ నీరుగార్చలేకపోయాయి.
‘‘ఇక నా వల్ల కాదు... అనుకునే పరిస్థితులు చాలా వచ్చాయి. అవి నన్ను పరీక్షిస్తున్నట్లుగా అనిపించాయి. అయితే ఆ పరీక్షల్లో నేను నెగ్గాను. ఒక మంచి పనికి ముందు ఇలాంటి కష్టాలు సాధారణమే అనే విషయం నాకు తెలుసు. ప్రజల నైతిక మద్దతుతో నా యాత్ర జయప్రదం అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అంటున్నాడు ప్రసుత్తం ఆఫ్రికాలో పర్యటిస్తున్న సోమెన్.
కేవలం ఎయిడ్స్ గురించిన అవగాహన తరగతులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్య శాంతి, సామరస్యం అవసరమంటూ ప్రచారం చేస్తున్నాడు.
‘‘మనుషులు అనేక రకాలుగా విడిపోతున్నారు. శాంతి లోపిస్తుంది. హింస భయపెడుతుంది. ప్రజలందరూ రకరకాల అడ్డుగోడలను తొలగించుకొని ఐకమత్యంగా సుఖశాంతులతో నివసించాలి. ఇదే జీవితపరమసత్యం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’’ అంటున్నాడు సోమెన్.
‘‘మరి మీ కుటుంబం సంగతి ఏమిటి? వాళ్లు ఎప్పుడు గుర్తుకు రారా?’’ అని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా - ‘‘ఈ ప్రపంచమే నా కుటుంబం’’ అంటాడు తాత్వికంగా.
‘‘కష్టపడే వాళ్లు, నలుగురికి సహాయపడే వాళు,్ల అందరూ నా వాళ్లే అనుకునేవాళ్లు... ప్రాంతాలతో నిమిత్తం లేకుండా నాకు బంధువులు. వారి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. నేను ప్రపంచపౌరుడిని’’ అని కూడా అంటాడు. సోమెన్ తన యాత్రలో తనకు తెలిసిన విషయాలను చెబుతున్నాడు. తెలియని విషయాలను ప్రజల నుంచి నేర్చుకుంటున్నాడు. ఒక దేశానికి సంబంధించిన అనుభవాలను వేరే దేశంలో పంచుకుంటున్నాడు. తనను ఆకర్షించిన వ్యక్తుల గురించి అదే పనిగా చెబుతుంటాడు.
‘‘నా సందేశం ఒకరికి చేరితే చాలు, అది వారి కుటుంబానికి చేరుతుంది, ఆ కుటుంబం ద్వారా ఊరికి చేరుతుంది. ఇలా సందేశం విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటాడు.
పలుదేశాల అధ్యక్షులు, మంత్రులు, ముఖ్య అధికారులను కలుసుకోవడం కంటే పేదవాళ్లు, శ్రామికులతో మాట్లాడడం తనకు ఆనందాన్ని ఇచ్చే విషయం.
2004లో తన సైకిల్ యాత్రను మొదలుపెట్టిన సోమెన్ ఇప్పటి వరకు 75 దేశాలు పర్యటించాడు.
తన యాత్ర 2020లో పూర్తవుతుందని చెబుతున్నాడు సోమెన్. ఈ యాత్ర తరువాత గ్లోబల్ విలేజ్ నిర్మించాలనుకుంటున్నాడు.
‘‘ఇదొక ఆదర్శ గ్రామం. స్వయంసమృద్ధి, పర్యావరణ స్పృహతో ఏర్పాటయ్యే ఈ గ్రామంలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు... మొదలైనవి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులను ఈ గ్రామం ప్రతిబింబిస్తుంది. ఈ గ్రామాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను కలుసుకున్న ప్రజలకు అంకితం చేస్తాను’’ అంటున్నాడు సోమెన్.
సోమెన్ ప్రపంచయాత్ర విజయవంతం కావాలని, అతడు కోరుకున్న ‘విశ్వగ్రామం’ నిర్మాణం కావాలని నిండు మనసుతో ఆశిద్దాం.