ఇటీవలే తరచూ జ్వరం వస్తూ, తగ్గుతూ ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను.
ఇటీవలే తరచూ జ్వరం వస్తూ, తగ్గుతూ ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. ఆయన నాకు హెచ్‌ఐవీ ఉన్నట్లు చెప్పారు. నాకు ఎయిడ్స్ వచ్చినట్టే కదా? చావు తప్పదా?
- సుదీప్ (పేరు మార్చాం), బాపట్ల
మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. హెచ్‌ఐవీ వైరస్ సీడీ4 కణాలను తగ్గించి వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది. హెచ్‌ఐవీ అనే వైరస్ సోకినవారు, అది హెచ్‌ఐవీ దశలోనే ఉన్నప్పుడు మాత్రం మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అసలు వాళ్లకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు. అయితే హెచ్‌ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బతీస్తూ పోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కౌంట్) ప్రతి మైక్రోలీటర్‌కూ 200 కంటే తగ్గితే.... అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చేయవచ్చు.
నాకు హెచ్‌ఐవీ సోకింది. ఇక నేను దీన్ని నా పిల్లలకు అంటించేస్తానేమో, నా నుంచి వారికి సోకుతుందేమో అనే ఆందోళన ఎక్కువగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- సుధాకర్ (పేరు మార్చాం), గుంటూరు
సాధారణంగా హెచ్‌ఐవీ వచ్చిన తల్లిదండ్రులు పడే ఆందోళనలో ఇదే ప్రధానం. అలాంటి భయాలు వద్దు. ఇది కేవలం రక్తం, శరీర స్రావాలలు, అసురక్షితమైన సెక్స్ ద్వారానే సంక్రమిస్తుంది. కానీ ఒకేచోట నివసించడం, అందరూ అవే పాత్రలను వాడటం, పిల్లలను దగ్గరికి తీసుకోవడం, వారికి ముద్దు పెట్టడం వల్ల సోకదు. కాబట్టి నిరభ్యంతరంగా అలాంటి వారికి ఎవరైనా సేవలందించవచ్చు. కాకపోతే... మన చేతులపై గాయాలుంటే వాళ్ల రక్తం, శరీర స్రావాలు దానికి అంటుకోకుండా చూడాలి. వారి రక్తం, శరీర స్రావాలు, రక్తం అంటిన దూది, సూది లాంటి వాటిని జాగ్రత్తగా తొలగించాలి/డిస్పోజ్ చేయాలి. మీరు మీ భార్యతో సెక్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్‌నర్‌తో సెక్స్ సమయంలో కండోమ్ వాడటం తప్పనిసరి.
డాక్టర్ టి.జి. కిరణ్‌బాబు
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్
సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్