
సర్వభూతములలో ఉండే ఆత్మను నేనే!
మామిడిపూడి ‘గీత’
మన శరీరాలలో ఇరవై నాలుగు తత్త్వాలున్నాయి. వాటికే చతుర్వింశతి తత్త్వాలని పేరు. అవి: 5 పంచమహాభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 ఆ భూతాల తన్మాత్రలు: గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం. ఇవే ఇంద్రియార్థాలు లేక విషయాలు. 5 జ్ఞానేంద్రియాలు: ఘ్రాణం, జిహ్వ, చక్షువు, త్వక్కు, శ్రోత్రం. 5 కర్మేంద్రియాలు: వాక్పాణి పాద పాయూపస్థలు. మనస్సు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం. వెరసి 24. మన శరీరంలోని పదార్థాలు పృథివ్యాది పంచమహాభూతాలు- వీటి తన్మాత్రలైన గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు. వీటిని గ్రహించే జ్ఞానేంద్రియాలు అంటే ఘ్రాణం, జిహ్వ, నేత్రం, చర్మం, శ్రోత్రాలు. ఈ సందర్భంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన వాక్యాలు స్మరింపదగినవి.
అర్జునా! సర్వభూతములలో ఉండే ఆత్మను నేనే! భూతముల ఆదిమధ్యాంతములు నేనే. నేను సర్వభూతముల హృదయాలయందు ఉన్నాను. భూతముల యందు ఉన్న స్మృతి, జ్ఞానం, అపోహనం నా నుండే ప్రవర్తిల్లుతున్నాయి. నేను వేదవేద్యుడను. నేనే వేదాంతకర్తను. వేదవిదుడను నేనే.
అర్జునా! బుద్ధి, జ్ఞానం, అసమ్మోహం, ఓర్పు, సత్యం, శమదమలు, సుఖదుఃఖాలు, జనన మరణాలు, భయాభయాలు, అహింస, సమచిత్తత్వ, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి- ఈ వివిధ గుణాలు ప్రాణులకు నావల్లే కలుగుతున్నాయి. పరమాత్మ సర్వమయుడు అనడంలోనే ఈ విషయం విశదమవుతున్నప్పటికీ అది మన బుద్ధియందు స్థిరంగా నిలిచేందుకు భగవానుడు మరీ మరీ చెబుతున్నాడు.
కూర్పు: బాలు-శ్రీని