అలా నేర్చుకున్నాను...
మనోగతం
బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో హోటల్లో తినీ తినీ ‘ఇక నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవాల్సిందే’ అనుకున్నాను. నేను అనుకున్నానో లేదో మా వాళ్లు ఒక అందమైన అమ్మాయిని చూశారు.
‘‘అమ్మాయికి వంట రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది’’ అనే మాట విని నెత్తి మీద ఆర్‌డీఎక్స్ పేలినట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టాను.
‘‘అదేమీ పెద్ద విషయం కాదనుకోండి...’’ అన్నాడు నాన్న.
‘‘అదే అసలు విషయం’’ అని నాలో నేను గొణుక్కున్నాను.
‘‘అమ్మాయికి వంటరాదు కాబట్టి ఆమె నచ్చలేదు’’ అని చెప్పడం న్యాయం కాదు కాబట్టి ‘ఓకే’ అనేశాను.
‘‘ఇవ్వాళ టిఫిన్ చేశాను. తిని ఓకేనా కాదా చెప్పండి’’
‘‘ఇవ్వాళ బెండకాయ వేపుడు చేశాను. తిని బాగుందో లేదో చెప్పండి’’ ఇలా అడిగేది మా ఆవిడ.
‘‘ఆమె చేసిన టిఫిన్ టిఫిన్ కాదని, కూర కూర కాదని ఎలా చెప్పాలి? ఓరి భగవంతుడా... ఏమిటీ శిక్ష ’’ అనుకునేవాడిని. ఆమెను చిన్న మాట అనడానికైనా మనసొప్పేది కాదు. అలా అని ఆమె వంటల మంటలను మింగలేను కదా! ఇక ఇలా కాదనుకొని ఆ ఇళ్లు, ఈ ఇళ్లు తిరిగి పనిగొట్టుకొని రకరకాల వంటలు నేర్చుకున్నాను. దినపత్రికల వంటలు పేజీలు చాలా శ్రద్ధగా సేకరించేవాడిని. నేను వంటలు నేర్చుకోవడంతో పాటు, మా ఆవిడకు అర్థమయ్యేలా సులభంగా చెప్పాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి... ఇప్పుడు నా కంటే ఆవిడ వంట చక్కగా చేస్తుంది!
-బి. శేఖర్, హైదరాబాద్