ఆరోగ్యానికి మోదం... బాదం!
గుడ్ ఫుడ్
గుప్పెడు బాదం పలుకులు రోజూ తినేవారికి రోగనిరోధక శక్తి పెరిగి అంత తేలిగ్గా అనారోగ్యాలు దరిచేరవన్న సంగతి అందరికీ తెలిసిందే. బాదంతో ఒనగూరే మరికొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.బాదం గింజలు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులు నట్స్ అన్నింటిలోనూ బాదంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాదంలోని ఎల్–కార్నిటిన్ అనే పోషకం మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది. అందుకే మంచి జ్ఞాపకశక్తి కోసం, భవిష్యత్తులో అలై్జమర్స్ డిసీజ్ నివారణ కోసం బాదం బాగా ఉపయోగపడుతుంది.
∙బాదం తీసుకునే వారు అంత తేలిగ్గా బరువు పెరగరు. అందుకే ఊబకాయం నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయి. నిగారించే చర్మం కోసం, నల్లటి మెరుపుతో కూడిన కురుల కోసం బాదంలోని పోషకాలు తోడ్పడతాయి. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బాదం పలుకులు తీసుకునే వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులకు దోహదపడే ‘సీ–రియాక్టివ్ ప్రోటీన్’ అనే పదార్థాన్ని బాదం తగ్గిస్తుంది. తద్వారా ఇది అనేక గుండెజబ్బులను నివారిస్తుంది.