
వేరుశనక్కాయలు టైమ్‌పాస్ కోసం అని చాలామంది అనుకుంటారు. అలా వాటిని తినేవారు తాము టైంపాస్ చేస్తున్నామనే భ్రాంతిలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడం అనే తమ పనిని తాము సైలెంట్‌గా చేసేస్తాయి వేరుశనక్కాయలు. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... వేరుశనక్కాయలను ‘బ్రెయిన్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. వేరుశనగలో ఉండే విటమిన్–బి3 పోషకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది.
మన మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయం వల్ల మన మూడ్స్ బాగుంటాయి. వేరుశనక్కాయలు తిన్నప్పుడు అందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్ బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశలో, నిస్పృహలో ఉన్నవారు టైంపాస్ కోసం వేరుశనక్కాయలు తింటే మూడ్స్ బాగుపడి డిప్రెషన్ దూరమవుతుంది. వేరుశనక్కాయల్లో – విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్–బి3గా పిలిచే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.