
బిగెస్ట్ స్పెషల్ పిజా గ్రాండ్ మా
ఈ అవ్వ ప్రత్యేకంగా తయారుచేసిన అతి పెద్ద పిజ్జాను ఇప్పటి వరకు 72,45,705 మంది చూశారు. ఈ అవ్వేమీ సెలబ్రిటీ కాదు. వయసు తొంభై పైమాటే. మట్టి పాత్రలు, కట్టెల పొయ్యి, ఇనుప వస్తువులు, ఆరుబయట ప్రకృతిలో పక్షుల కిలకిలల మధ్య, ఆకుల గలగలల మధ్య అతి సామాన్యంగా అవలీలగా కిలోలుకిలోలు వండుతుంది. సెలబ్రిటీలకు ధీటుగా ఉంటారు ఈ అవ్వ వంటలకు ప్రేక్షకులు. బోసి నవ్వుల అవ్వ ఎంతో రుచికరంగా తయారు చేసిన వంటను తనే రుచి చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది. అవ్వ తయారుచేసిన వంట కంటె, అవ్వను చూస్తే, ‘ఈవిడ మన అవ్వ అయితే బాగుంటుంది’ అనిపిస్తుంది.
చికెన్ డ్రమ్‌స్టిక్ మస్తానమ్మ
మస్తానమ్మ చేసిన చికెన్ డ్రమ్‌స్టిక్ రెసిపీని 66,58, 359 మంది చూశారు. మాంసాహారపు వంటకాలను ప్రత్యేకంగా తయారుచేసిన మస్తానమ్మ 105 సంవత్సరాలు జీవించారు. ఆ వయసులోనూ ఐదు కేజీల బరువును మోశారు. ఆరుబయట కట్టెల పొయ్యి ముందు కూర్చుని, స్వయంగా అన్నీ తరుగుతూ, ఎంతో ఓపికగా వంటలు చేశారు. ఈ తాతమ్మ వంటలను లక్షలమంది మాంసాహార ప్రియులు చూస్తున్నారు. అన్నిటి కంటె చికెన్ డ్రమ్‌స్టిక్ వంటకాన్ని ఎక్కువ మంది చూశారు. కుడి వైపు పమిటతో ఉన్న మస్తాన్మ వంటకాలను ఎంతో ప్రేమగా వండింది. వయసుతో సంబంధం లేకుండా తయారుచేసుకున్న వంటకాలను ఎంతో సరదాగా రుచి చూశారు మస్తానమ్మ. దంతాలు లేకపోతేనేం, చిగుళ్లు ఉన్నాయిగా రుచి చూడటానికి అనే మస్తానమ్మ 105 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
మ్యాగీ నూడుల్స్ , బ్రెడ్ ఆమ్లెట్
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, తేజ్ మండీ చౌక్ దగ్గర ఈ అవ్వ వేగంగా మ్యాగీ నూడుల్స్, బ్రెడ్ ఆమ్లెట్ తయారుచేస్తూ కనిపిస్తారు. వాటిని తినటానికి ఎంతో మంది ఓపికగా నిరీక్షిస్తుంటారు. ఈ అవ్వ వంటకాలను వీడియోలో బంధించి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. రెండు నెలల కాలంలోనే 11,15,975 మంది వీక్షించారు. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం వీటిని తయారుచేçస్తున్న ఈ అవ్వ చేతి వంటను ఇష్టపడనివారు ఉంటారా. అందునాతల్లిదండ్రులకు దూరంగా, ఉద్యోగాల కోసం నగరాలకు వస్తున్నవారికి ఇంటి భోజనం, ఇంటి ఆప్యాయతలు తలపించేలా ప్రేమతో నిండిన ఆహారం దొరికితే విడిచిపెడతారా. అవ్వ ఇచ్చేవరకు ఓపికగా నిరీక్షిస్తున్నారు ఇక్కడకు వచ్చేవారంతా. అవ్వను హడావుడి పెట్టకూడదని వారికి తెలుసుగా.
వేగంగా రగడా
కవితకు నిండా ముప్పై సంవత్సరాలు లేవు. పనిలో చాలా చురుకు. ముంబైలోని చించ్‌పోక్లీ స్టేషన్‌కి సమీపంలో కవిత రగడా పట్టీస్ పావ్ వేగంగా తయారుచేస్తూ హుషారుగా కనిపిస్తారు. కవిత రగడాలు తయారుచేయటంలోనే కాదు, ప్యాకింగ్ చేయడంలోనూ అత్యంత వేగం చూపుతారు. ఈమె పని నైపుణ్యాన్ని వీడియో తీసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఆరు నెలలకే 33,31,272 మంది చూశారు. ఎంతో చురుకుగా అలసట కనపడనీయకుండా, అతి వేగంగా రగడా తయారుచేసి అందిస్తూ, మరో వైపు పార్సిల్స్ కడుతూ ఎవ్వరినీ ఎక్కువసేపు నిరీక్షించకుండా పని చేస్తున్న కవిత, ‘మేం సామాన్య మహిళలం కాదు, మేం కూడా సెలబ్రిటీ లమే’ అంటున్నట్లుగా అనిపిస్తారు.
నందిని వంట
హైదరాబాద్ చందానగర్ స్వాగత్ హోటల్ పక్కన, రోడ్డు మీద చికెన్ బోటీని అతి తక్కువ ధరకు అందిస్తున్నారు మూడు పదులు కూడా నిండని నందిని. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ తాను ఒక్కర్తే స్వయంగా తయారుచేసి, పన్నెండు గంటలకు వంటకాలను మోసుకొచ్చి, ఆకలితోఉన్నవారికి సాయంత్రం నాలుగు గంటల వరకు అతి తక్కువ ధరలో భోజనం పెడుతున్నారు నందిని. ఆమెను వీడియోలో బంధించి అప్‌లోడ్ చేశారు. ఆమె చలాకీగా వంటలు వడ్డించటం, వచ్చిన వారిని నవ్వుతూ పలకరించటాన్ని ఇప్పటి వరకు 40,48,611 మంది చూశారు.
ఇందులో ఒక్కరూ సెలబ్రిటీలు కాదు. సంపన్న కుటుంబాల వారు కాదు, అందంగా అలంకరించుకుని, మేకప్ వేసుకుని కూడా ఉండరు. మన ఇంట్లో ఉండే అమ్మ, అవ్వ, అక్క, వదిన, చెల్లి వంటివారు వీరందరిలో నిండుగా కనిపిస్తారు. వీరంతా కుటుంబాలను చక్కగా పోషించుకుంటున్న స్వాభిమానులు. శక్తిమూర్తులు, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవారు. కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, ఆకలితో ఉన్న ఎంతోమందిని సంతృప్తులను చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment