వేదమంత్రంలాంటి పల్లెపాట!
‘విశ్వ శ్రేయస్సే కావ్యం’ అనేది అపురూపమైన అమృతమయమైన నానుడి. ఈ ప్రపంచంలో ఏ కవిత్వమైనా ప్రజలకు... ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాన్ని నవరసభరితంగా వివరించి సార్థకమౌతుంది. అనాదిగా ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న లెక్కలేనన్ని సమస్యల్లో అన్నిటికన్నా అతిముఖ్యమైనది స్త్రీపురుషుల నడుమ నడుస్తున్న ‘ప్రేమ-పెళ్లి’ అని నా అభిప్రాయం. శకుంతల దుష్యంతుల కాలం నుండి, నేటి వరకు ఈ సమస్య అంతటా ఉన్నదే. స్త్రీపురుష సంబంధాలను, సక్రమమార్గంలో నడిపించే పంథాలో కొసరాజుగారు రచించిన ‘మంచిమనసులు’ చిత్రంలోని ‘మావా... మావా...’ అనే పాట ఇందుకు మంచి ఉదాహరణ.
‘తప్పు... తప్పు...’ అనే రెండక్షరాలతో ప్రారంభమయ్యే ఈ పాట, ‘ప్రేమ’ అనే రెండక్షరాలకు మార్గనిర్దేశం చేస్తూ, మంచిచెడులను తెలియజెబుతుంది.
మావా! మావా! మావా!... ఏమే ఏమే భామా... అనే పల్లవిలోని పిలుపులు... పల్లె వాతావరణానికి చెందిన యువతీయువకులలో అల్లుకున్న అనురాగానికి అద్దం పడతాయి. పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదంటె/చుట్టు చుట్టు తిరుగుతారు మరియాదా... అనే వాక్యాలలో అలతి అలతి పదాలతో సాగిన కొసరాజుగారి రచన అమ్మచాటున ఉన్న అమ్మాయి మనసులోని భావాలను అభివ్యక్తం చేస్తుంది. అలాగే తాళి కట్టకుండ ముట్టుకుంటె తప్పుకాదా... అనే వాక్యంలో అమ్మాయికి, అబ్బాయికి మధ్య ఉండవలసిన హద్దును నిర్దేశిస్తుంది.
నీవాళ్లు మావాళ్లు రాకనే/ మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే/ సిగ్గుమాని ఒకరినొకరు సిగలు పూలు పెట్టుకుని/ టింగురంగమంటు ఊరు తిరగవచ్చునా/ లోకం తెలుసుకోక మగవాళ్లు మసలొచ్చునా... అనే చరణం... వైవాహిక సంబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.
పడుచుపిల్ల కంటబడితె వెంటపడుదురు/ అబ్బో వలపంతా ఒలకబోసి ఆశపెడుదురు/ పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్ల జిత్తులన్ని తెలుసులేవయ్యా/ మీ పుట్టు పూర్వపు కథలన్ని విన్నామయ్యా... అనే వాక్యాలలో అబ్బాయిలను తేనెటీగలుగా, అమ్మాయిలను పువ్వులుగా పోల్చడం... కవికుల గురువు కాళిదాసు కవిత్వ ప్రభావం ఉందనే విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అభినవ మధులోలుపస్త్వం తథా పరిచుంబ్యచూతమంజరీం
కమల వసతిమాత్ర నిర్వృతో మధుకర విస్మృతోస్యేనాం కథం!
ఈ శ్లోకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకంలోనిది.
ఓ మధుకరమా! కొత్త కొత్త తేనె కోసం అంగలార్చే నీవు అప్పుడు తియ్యమావిడి మొగ్గను అలా ఆస్వాదించి పువ్వు మోజులో పడి ఎలా మరిచిపోయావు. ఈ భావాలను ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. పై చరణంలో మాటలలో ఎంత నిజం దాగి ఉందో, ఎవ్వరికీ తెలియనిది కాదు. అవి అక్షరసత్యాలు. ఈ చరణం చివరిలో వ చ్చే మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
అతఃపరీక్ష్య కర్తవ్యం విశేషాత్ సంగతం రహః!
అజ్ఞాత హృదయేష్వేవం వైరీభముసౌహృదం!
‘అభిజ్ఞాన శాకుంతలం’లో దుష్యంతుడు శకుంతలను గర్భవతిని చేసి, ఆ తరవాత ఆమె ఎవరో తెలియదని నిరాకరించినప్పుడు, గుండెలు పగిలేలా ఏడ్చే శకుంతలను చూచి, కణ్వముని చెప్పే మాటలవి. ‘ఏడువు... ఇంకా బాగా ఏడువు... ముందే ముందు వెనుకలు బాగా ఆలోచించి ప్రేమించాలి. అందులో స్త్రీ పురుషులు ఏకాంతంలో ఒకటయ్యే విషయాన్ని ఇంకా ఇంకా బాగా ఆలోచించాలి. హృదయాలను తెలియకుండా ప్రేమిస్తే ఆ ప్రేమే శత్రువు అవుతుంది’ అని భావం.
ఎంతో హృద్యంగా, గంభీరంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సాగే ఈ పాట, కొసరాజుగారి కవితాజ్యోత్స్న కమనీయం. కళ్యాణ రమణీయం.
కొత్త కొత్త మోజుల్ని కోరువారు/ రోజూ చిత్రంగ వేషాలు మార్చువారు/ టక్కరోళ్లుంటారు టక్కులు చేస్తుంటారు/ నీవు చెప్పే మాట కూడ నిజమేనులే/ స్నేహం దూరంగా ఉన్నపుడే జోరౌనులే ... అనే మాటలు ఈ పాటలో పురుషుని అతి వేగానికి కళ్లెం వేసేవిగా పెంచి పెద్దజేసే ఒక పెద్ద దిక్కులా ఉన్నాయి.
కట్టుబాటు ఉండాలి గౌరవంగ బ్రతకాలి/ఆత్రపడక కొంతకాలమాగుదామయ్యా... ఎంత గొప్పగా ఉన్నది వేదమంత్రంలా ఈ పాట. ‘భళ్లున పెళ్లయితే ఇద్దరికీ అడ్డులేదయ్యా’ అనే ఈ వాక్యం స్త్రీ పురుషులకు రెండు కళ్లుగా వందేళ్లు మంచిదారిలో నడిపే విధంగా ఉన్నాయి.
ఇటువంటి పాట ఎటువంటి ప్రేమికులనైనా ఒక ఇంటి వాళ్లను చేసేదాకా విశ్రమించదు కదా!
- సంభాషణ: నాగేష్