మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి
ఆత్మీయం
మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ఒక్క హిందూమతంలోనే ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి.
ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు.