సన్మార్గం : మొహర్రం స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి
మొహర్రం అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు హసన్, హుసైన్ (ర అన్ హుం). ముస్లింలకే కాదు. ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన ‘కర్బలా’ దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారి కుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతిసామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు వారు చేసిన కృషి, వేలాది శత్రుసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీరఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టుల, దుర్మార్గులైన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది.
ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో హ. అబూబక్ ్రసిద్ధిఖీ (ర) ఖలీఫాగా (ప్రజాప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హ. ఉమర్ (ర), హ. ఉస్మాన్ (ర), హ. అలీ(ర) గార్లు ఖలీఫాలుగా ఎంపికయ్యారు. వీరి పరిపాలనా కాలంలో న్యాయం, ధర్మం నాలుగుపాదాలపై నడిచాయి. అన్ని రంగాల్లోనూ సమతూకం నెలకొని ఉండేది. ఎలాంటి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు లేకుండా సమన్యాయం, గౌరవమర్యాదలు లభ్యమయ్యేవి. ఈవిధంగా వీరి పరిపాలనాకాలం ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని సృజించింది. చివరి ఖలీఫా హ. అలీ (ర) తరువాత ప్రజలు యథాప్రకారం తమ ప్రతినిధిగా హ. హసన్ (రజి) గారిని ఎన్నుకున్నారు. కాని కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. తరువాతి పరిణామాల్లో యజీద్ తనను తాను రాజుగా ప్రకటించుకుని గద్దెనెక్కారు. గత్యంతరం లేని స్థితిలో అత్యధికులు అతడి రాజరికాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఈవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. వాళ్లు ఈ బలవంతపు రాచరికానికి ఎదురు తిరిగారు. ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత హ. ఇమామె హుసైన్ (రజి) భుజస్కంధాలపై పడింది.
ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్‌తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించి కయ్యానికి కాలుదువ్వింది. దాంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు మొదలైంది. శతృవులతో శక్తివంచన లేకుండా పోరాడుతూ ఇమాం పరివార సభ్యులు ఒక్కొక్కరే నేలకొరిగారు. ధర్మ సంస్థాపన కోసం సాగిన ఈ పోరులో చివరకు ఇమాం హుసైన్ (రజి) ఒక్కరే మిగిలారు. అది మొహర్రం మాసం పదవతేదీ. శుక్రవారం. పోరు సాగుతూనే ఉంది. ఒకవైపు నమాజు సమయం మించిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజును విస్మరించని ఆ మహనీయుడు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇమ్మని అడిగారు. అందుకు అంగీకరించిన శత్రుసైన్యం ఇమాం సజ్‌దా నుండి లేస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించి, యుద్ధనీతికి తిలోదకాలిచ్చి, ప్రార్థనలో ఉన్న ఆ మహనీయుడిని సజ్దా స్థితిలోనే బరిశతో పొడిచి చంపారు. అనంతరం ఆనందంతో చిందులు తొక్కారు. మృతవీరుల తలలను వారి దేహాలనుంచి వేరుచేసి, బరిశలకు, బల్లాలకు గుచ్చి ఎగిరారు, పానకాలు చేసుకుని తాగారు. పలావులు వండుకుని తిన్నారు. ఇదీ క్లుప్తంగా ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన.
ఇమాం హుసైన్ (రజి) ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారో, ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. విలువలు మంటగలసిపోతుంటే, పాలనావ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంటే, చూస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్య ప్రియుల లక్షణం ఎంతమాత్రం కాదు. వీటిని సమూలంగా మార్చాలంటే ‘మొహర్రం’ పేరుతో జరిగే అన్ని రకాల దురాచారాలని విసర్జించి, ఇమామె హుసైన్ (రజి) ఏ విలువలకోసం ప్రాణత్యాగం చేశారో ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవలసిందే!
- యండి ఉస్మాన్‌ఖాన్
ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్‌తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది.