
నెస్సెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్‌వెన్షన్... ఈ సామెత ఇప్పటికి ఎన్నో వందలసార్లు నిరూపితమైంది. ఇప్పుడు మణిపూర్‌లోని ముక్తామణిదేవి మరోసారి నిరూపించింది. ఒకప్పుడు కూతురికి చెప్పులు కొనడానికి డబ్బుల్లేని మహిళ ఇప్పుడు చెప్పుల తయారీలో అవార్డులందుకుంటోంది. విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆమె చేతిలో అల్లాఉద్దీన్ అద్భుత దీపమేదీ లేదు. ఉన్నదల్లా ఊలుతో చక్కగా అల్లగలిగిన కళ మాత్రమే. తన చేతిలో ఉన్న కళ తనకు అన్నం పెడుతుందని ముక్తమణి ఊహించను కూడా లేదు. ఇల్లు గడవడానికి చేతినిండా డబ్బు ఉంటే ఆమెలో దాగిన ఆ కళ ఎప్పటికీ బయటకు వచ్చేది కాదేమో.
ఓ రోజు... ముక్తామణి దేవి చిన్న కూతురు స్కూలు షూని చించేసుకుని వచ్చింది. కొత్త షూస్ కొనడానికి చేతిలో డబ్బు లేదు. ‘కొత్త షూస్ వచ్చేనెలలో కొందాం, అప్పటి వరకు స్లిప్పర్స్ వేసుకుని వెళ్లు’ అనడానికి వీల్లేదు. ఆ కాన్వెంట్ స్కూల్‌లో యూనిఫామ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా రాజీ పడరు. ఏదో ఒకటి చేసి స్కూలుకి షూస్‌తోనే వెళ్లాలి. రాత్రి భోజనాలయిన తర్వాత ఊలు ముందేసుకుని కూర్చుంది. చిరుగును కనిపించనివ్వకుండా ఊలుతో అల్లింది. రెండో షూని కూడా జత షూతో పోలి ఉండేటట్లు ఊలుతో అల్లేసింది. ఇప్పటికైతే గండం గడిచింది... చాలనుకుందామె. కొత్త షూస్ కొనేవరకు వీటినే వేసుకెళ్లు అని కూతురికి నచ్చచెప్పి పంపించింది.
టీచర్ కళ్లు పడ్డాయి
స్కూల్లో సాయంత్రం డ్రిల్ క్లాస్. టీచర్‌పర్యవేక్షణలో పిల్లలందరూ లైన్‌లో నిలబడ్డారు. టీచర్ కళ్లు ఆ అమ్మాయి షూస్ మీద పడ్డాయి. టీచర్ ఆ అమ్మాయి కాళ్ల వైపే చూస్తూ దగ్గరకు వస్తోంది. యూనిఫామ్ ప్రకారం లెదర్ షూస్ ఉండాలి లేదా లెదర్‌ను పోలిన రెగ్జిన్ షూస్ అయినా ఉండాలి. టీచర్ తన షూస్‌ను చూస్తూ రావడంతో భయపడిపోయింది. ‘‘ఇలాంటి షూస్ మా అమ్మాయికి కావాలి. ఎక్కడ దొరుకుతాయి’’ అని అడిగింది. ఇది జరిగింది 1989లో.
అలా మొదలైంది
ముక్తామణి దేవికి ఆర్థిక కష్టాల నుంచి అలా విముక్తి దొరికింది. టీచర్ కోసం ఒక జత ఉలెన్ షూస్‌ను అల్లి ఇచ్చింది. మణిపూర్‌లో దాదాపు ప్రతి ఒక్కరికీ నిట్టింగ్ (ఊలుతో అల్లడం) వచ్చి ఉంటుంది. స్వెట్టర్‌లు, టోపీలు, సాక్స్ అల్లుతారు. అవసరార్థం... గండం గట్టెక్కడానికి తాను చేసిన పని ఓ ప్రయోగం అని తెలిసొచ్చిందామెకి. దాంతో 1990లో ‘ముక్త షూస్ ఇండస్ట్రీ’కి శ్రీకారం చుట్టింది. ఊలుతో చిన్న పిల్లలకు, మహిళలకు, మగవాళ్లకు రకరకాల షూస్, సాండల్స్‌ను అల్లడం మొదలుపెట్టారు.
ఇప్పుడామె దగ్గర పన్నెండు మంది మహిళలు పని చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌లలో స్టాల్స్ పెడుతోంది. ఢిల్లీలో జరిగిన మణిపూర్ సంగయ్ ఫెస్టివల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఆమెలో ఉత్సాహాన్ని ఇనుమడింపచేసింది. పాదాలకు వెచ్చని రక్షణనిచ్చే ఉలెన్ షూస్‌కి చలిదేశాల్లో ఆదరణ ఉంటుందనుకుంది. ముక్త షూస్ ఇప్పుడు ఆస్ట్రేలియా , యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, మెక్సికోతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ముక్తా మణి దేవికి ఇప్పుడు 59 ఏళ్లు. దాదాపుగా ముప్పయ్ ఏళ్ల అనుభవం. ఇన్నేళ్లలో ఆమె సుమారు వెయ్యి మందికి ఊలుతో షూ తయారీలో శిక్షణనిచ్చింది.
సిటీ గ్రూప్ నుంచి మైక్రో ఎంట్రప్రెన్యూర్‌షిప్ నేషనల్ అవార్డు (2006), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ నేషనల్ అవార్డు (2008), మాస్టర్ క్రాఫ్ట్స్‌పర్సన్ స్టేట్ అవార్డు (2008), వసుంధర ఎన్ ఈ ఉమన్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2013–14 అవార్డు (2015) అందుకున్నది. నేషనల్ ఇన్సూరెన్స్, టెలిగ్రాఫ్ కంపెనీలు... తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న అవార్డులకు ఈ ఏడాది ముక్తామణిదేవిని ‘ట్రూ లెజెండ్స్ అవార్డ్స్ 2018’కు ఎంపిక చేశాయి.
ఈ అవార్డు అందరిదీ!
అవార్డు అందుకోవడం ఎవరికైనా సంతోషదాయకమే. అయితే ఇది నేను ఒక్కదాన్నే అందుకోవాల్సింది కాదు. మా యూనిట్ అభివృద్ధి కోసం నాతోపాటు పని చేస్తున్న మహిళలందరిదీ. నా ప్రయత్నంలో ఇంతమంది సహకరిస్తున్నారు. – ముక్తామణి దేవి, ముక్త షూస్ పరిశ్రమ ఫౌండర్
– మంజీర