అమ్మే గ్రాండ్‌మాస్టర్... | My mother Viswanathan Anand | Sakshi
Sakshi News home page

అమ్మే గ్రాండ్‌మాస్టర్...

Published Tue, Nov 15 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

తల్లి సుశీలతో చెస్ ఆడుతున్న విశ్వనాథన్ ఆనంద్

తల్లి సుశీలతో చెస్ ఆడుతున్న విశ్వనాథన్ ఆనంద్

మా అమ్మ విశ్వనాథన్ ఆనంద్

విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇండియాకి మొదటి గ్రాండ్‌మాస్టర్. రాజీవ్ ఖేల్త్న్ర పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు. చదరంగాన్ని భారతీయులు మర్చిపోకుండా గుర్తు చేసి, పతాకస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆనంద్. ఆందుకే జాతి ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. తాను ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా ఎదగడంలో తల్లి సుశీల పాత్రను అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు ఆనంద్.

‘‘మా అమ్మ నాకు మాత్రమే రోల్‌మోడల్ కాదు. అమ్మదనానికే రోల్‌మోడల్. ఆమె పిల్లలకు ఒక సంగతిని చాలా నైపుణ్యంగా చెప్పేది. పిల్లల్లోని నైపుణ్యాన్ని త్వరగా గ్రహించేది. నేను అమ్మకూచిని. ఆమె వెంటే తిరిగేవాడిని. అమ్మకు చెస్ ఆడడం హాబీ. నాతో ఆడుకునేది. ఎవరైనా ‘‘ఆనంద్‌కు ఆట నేర్పిస్తున్నావా’’ అంటే... ‘‘నేను చెస్ ఆడుకోవడానికి మంచి ప్రత్యర్థిని తయారు చేసుకుంటున్నా’’ అని నవ్వేది.

నాతో చెస్ ఆడేది. చెస్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పేది కాదు. ఆటలో భాగంగానే పావులు ఎలా కదపాలో చెప్పేది. ఒక ఎత్తు ఎందుకు వేయాలో చెప్తూ, ఆ ఎత్తు ఎప్పుడు వేయాలో చెప్పేది. తన దగ్గర పావులలో ఎన్ని రకాల ఎత్తులకు అవకాశం ఉందో వివరిస్తూ... తాను అప్పుడు ఏ స్టెప్ తీసుకోనుందో చెప్పేది. చెప్పాక తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నదో నన్ను ఊహించి చెప్పమనేది. అలా మా మధ్య బ్రెయిన్‌గేమ్ సాగేది. అలా పలక- బలపం కంటే ముందు చదరంగం పావులు కదిపాను. ఐదేళ్ల వయసులో మొదలైన నా చెస్ ప్రయాణంలో ప్రతి ఎత్తులోనూ అమ్మ ఉంది. ప్రముఖ క్రీడాకారులతో వేసిన అనేక ఎత్తులను అమ్మ దగ్గర వేసిన అనుభవం నాది.

అమ్మ మంచి కోచ్!
అమ్మ ఎంత మంచి కోచ్ అంటే... ప్రాక్టీస్‌తో బుర్ర వేడెక్కే పరిస్థితి ఎప్పుడూ రానిచ్చేది కాదు. ఎత్తు వేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నా, ఎక్కువ మథనం చేసినా ఇట్టే పట్టేసేది. ‘‘నువ్వు అలసిపోయావు’’ అని చెప్పకుండా ‘‘నాకు పనుంది నువ్వు కొంచెం సేపు బయట ఆడుకో’’ అని పంపించేసేది.

క్రీడాకారుడిగా...
నాలో చెస్ అనే బీజాన్ని వేసింది అమ్మేనంటే... చదరంగం బీజాలు మన జీన్స్‌లో ఉన్నాయనేదామె. తన పుట్టింటి వారసత్వాన్ని నా ద్వారా కొనసాగిస్తున్నానని చెప్పేది. అమ్మ వాళ్లింట్లో అందరూ కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుంటూ చెస్ బోర్డు తీస్తారు. నేను క్రీడాకారుడిగా పొరుగూళ్లకు వెళ్లాల్సినప్పుడు అమ్మ వెంట లేకుండా వెళ్లేవాడిని కాదు. మరీ చిన్నతనం కావడం, అమ్మను వదిలి ఉండడం తెలియకపోవడంతో అలా అలవాటైంది.

నా కోసం అమ్మ రాజీ!
మాది అత్యంత సంపన్న కుటుంబం కాదు. కానీ నాన్న రైల్వేలో ఉన్నతాధికారి. అమ్మ పుట్టింట్లో ఎక్కువ మంది లాయర్లు. అలా అమ్మ జీవితం సౌకర్యవంతంగా ఉండేది. అలాంటిది 1983లో అహ్మదాబాద్‌లో నేషనల్స్‌కి వెళ్లినప్పుడు మాకిచ్చిన బస చాలా అసౌకర్యంగా ఉంది. నాకప్పుడు పదమూడేళ్లు. ఆర్గనైజర్లని అడగగలిగిన వయసు కాదు. కానీ అమ్మ కూడా అడగలేదు. ఆ గదిలోనే సర్దుకుపోయింది. ఎందుకలా అని తర్వాత నేనడిగితే... ‘ఎవరితోనైనా గొడవపడినా, గొడవను చూసినా ఆ ప్రభావం మెదడు మీద చాలా గంటలసేపు అలాగే ఉంటుంది. మెదడు అలజడికి లోనయితే రేపు ఆట ఆడేటప్పుడు సరిగ్గా ఎత్తు వేయలేవు’ అన్నది. నా కెరియర్ కోసం ఆమె సౌకర్యాలను త్యాగం చేసింది,  డిమాండ్ చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నా చిన్న బుర్ర గందరగోళానికిలోనుకాకూడదని హుందాగా వ్యవహరించింది. అమ్మలో నేను చూసిన విజ్ఞత, పరిణతి అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా అమ్మ చాలా గ్రేట్ అనిపిస్తుంది.

నా కోసం ఎయిర్‌పోర్టుకి!
నేను గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లు గెలిచినప్పుడు బిడ్డ ఉన్నతికి సంతోషించే అందరు అమ్మల్లాగానే మా అమ్మ కూడా సంతోషపడింది. అయితే నేను గాటాకామ్‌స్కీతో ఓడిపోనప్పుడు అమ్మ నాతో లేదు. ఓటమికి ఎక్కడ కుంగిపోతానేమోనని బెంగపడింది. నేను చెన్నైలో దిగేటప్పటికి ఎయిర్‌పోర్టులో నా కోసం ఎదురు చూస్తోంది. అలా కొంతకాలానికి అమ్మ జీవితం నా చదరంగమే అయింది. ఎప్పుడూ టోర్నమెంట్‌ల షెడ్యూళ్లు తెలుసుకోవడం, క్యాలెండర్ తయారు చేసుకోవడంలోనే కనిపించేది. అప్పట్లో ఫోన్ సౌకర్యం ఇప్పుడున్నంతగా లేదు. ఎక్కడికి ఫోన్ చేయాలన్నా ట్రంక్‌కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. ఆ కాల్ కట్ కావడం, మళ్లీ చేయడంలో చాలా డబ్బు ఖర్చయ్యేది. అప్పుడప్పుడూ ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆనంద్ ట్రంక్‌కాల్స్ కోసం ఖర్చు చేసిన డబ్బుతో సగం ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఉండవచ్చు అంటుండేది.

టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్!
నా సహ చెస్ క్రీడాకారులు అమ్మను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించినప్పుడు నాకు అమ్మలో అనేక కోణాలు తెలిశాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ మాన్యుయెల్ ఆరోన్ మాట్లాడుతూ ‘ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్’ అన్నాడు. కొడుకుగా నేను చూసిన అమ్మకంటే మా అమ్మ చాలా ఎక్కువ అని అప్పుడు అనిపించింది. గర్వంతో నా గుండె పొంగిపోయింది. పైగా ఆ ప్రశంసలను విన్నది అమ్మను కోల్పోయిన క్షణాల్లో కావడంతో ఉద్వేగం కన్నీళ్లుగా ఉబికింది. పేరుకు తగినట్లుగా ఆనందంగా ఉండాలని నాకు చెప్పేది. తాను కూడా పేరుకు తగ్గట్టే అత్యంత సౌశీల్యమైన వ్యక్తిత్వంతో రాణించింది.

కూర్పు: వాకా మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement