తరగతి గదిలోనే తగిన నైపుణ్యాలు | National Association of Software and Services Companies (Nasscom) | Sakshi
Sakshi News home page

తరగతి గదిలోనే తగిన నైపుణ్యాలు

Published Sun, Jul 20 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

National Association of Software and Services Companies (Nasscom)

గెస్ట్ కాలమ్
 
‘దేశంలో ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్ అనే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ వీటి ఏర్పాటుకు సంబంధించి అమల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల కారణంగా అనేక మంది ఔత్సాహికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలను సరళీకృతం చేస్తే దేశంలో మరెన్నో స్టార్టప్స్ ఏర్పాటవుతాయి’  అని అంటున్నారు.. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్మన్ ఆర్.చంద్రశేఖరన్. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ - త్రిచీలో 1979లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.. 1985లో ఐఐఎం-బెంగళూరులో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తి చేసిన ఆయనకు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్‌‌స (సీటీఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న ఆయన ఇటీవల నాస్కామ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. చంద్రశేఖరన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
నాస్కామ్ చైర్మన్‌గా మీరు అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న అంశాలు?
 
ఈ ఏడాది విస్తృత పరిధి గల మూడు అంశాలకు కార్యరూపమివ్వాలని ఎజెండాగా రూపొందించుకున్నాను. అవి.. ఐటీ పరిశ్రమకు రీ-బ్రాండింగ్ కల్పించడం.. రెండోది.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు ప్రోత్సాహం, మద్దతు ఇవ్వడం.. మూడోది.. స్కిల్ బిల్డింగ్.  వీటితోపాటు పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ లిటరసీని అభివృద్ధి చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టాం.
 
ఈ మూడు అంశాలను ఎజెండాగా ఎంచుకోవడానికి కారణం? ప్రస్తుత పరిస్థితుల్లో  సత్ఫలితాలు ఆశించడం సాధ్యమేనా?
 
రీ-బ్రాండింగ్‌కు సంబంధించి ఐటీ పరిశ్రమను కేవలం వ్యాపార- వాణిజ్య కోణంలోనే పరిగణించకుండా.. ఇన్నోవేషన్ హబ్‌గా, ఆయా సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే ప్రొవైడర్‌గా రూపొందించడమే ఉద్దేశం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయంలో ఐటీ రంగంలో అపారమైన నైపుణ్యం ఉంది.  2020 నాటికి ఐటీ పరిశ్రమ 300 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మద్దతు, ప్రోత్సాహం ఇస్తున్నాం. దీనికి కొనసాగింపుగా పరిశ్రమ సుస్థిర వృద్ధి బాటలో పయనించేందుకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు స్కిల్-బిల్డింగ్‌ను మరో ఎజెండాగా రూపొందించుకున్నాం. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వనరులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇవి ఆచరణ సాధ్యమే.
 
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్‌లలో ప్రస్తుత పరిస్థితులపై మీ అభిప్రాయం?

దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూరియల్ కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని అడ్డంకులు ఔత్సాహికులను నిరుత్సాహపరుస్తున్నాయి. ఒక సంస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటోంది. కంపెనీల చట్టం ప్రకారం- నమోదు ప్రక్రియ, మూలధన సమీకరణలు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ప్రస్తుత పన్ను నియంత్రణ విధానాల కారణంగా స్టార్టప్స్‌కు నిధులు అందించే విషయంలో సీడ్ ఫండింగ్, ఏంజెల్ ఫండింగ్ సంస్థలు అనేక పరిమితులు ఎదుర్కొంటున్నాయి. లాభదాయకత సాధించాల్సి ఉన్న టెక్నాలజీ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై అమలు చేస్తున్న టీడీఎస్ కూడా అహేతుకంగా, భారంగా మారుతోంది. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించి.. కొత్త కార్పొరేట్ చట్టంలోనైనా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలను సరళీకృతం చేయాలి. అప్పుడు మరెన్నో స్టార్టప్స్ ఏర్పాటవుతాయి.
 
స్టార్టప్స్ ఔత్సాహికులకు పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తోంది?
 
ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు పరిశ్రమ వర్గాలు నాస్కామ్ తదితర ఉమ్మడి సంస్థల ద్వారా నిరంతరం చేయూతనిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాస్కామ్ 10,000 స్టార్టప్స్ ఇనీషియేటివ్‌కూ రూపకల్పన చేసింది. 2013లో ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా రాబోయే పదేళ్లలో పది వేల టెక్నాలజీ స్టార్టప్స్‌కు రూపకల్పన చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా.. పరిశ్రమ ప్రముఖులను, ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను నాస్కామ్ ఒకే వేదికపైకి  తీసుకొస్తుంది. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుంది. ఏంజెల్ ఇన్వెస్టర్స్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను మరింత మందిని కలిసేలా చేసి.. ఔత్సాహికుల అవకాశాలను విస్తృతం చేస్తుంది. ఎంపికైన స్టార్టప్స్‌కు రూ.25 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఏంజెల్ ఇన్వెస్టర్స్ ద్వారా నిధులు సమకూరుతాయి. ఇప్పటికే రెండు దశల్లో పూర్తయిన 10,000 స్టార్టప్స్ ఇనీషియేటివ్స్ ప్రోగ్రామ్ ద్వారా.. 125 సంస్థలు లబ్ధి పొందాయి. ప్రస్తుతం మూడో దశ ప్రోగ్రామ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
 
విద్యార్థులను ఐటీ పరిశ్రమకు సరిపోయేలా ఉద్యోగ నైపుణ్యాలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు?
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధికి అత్యంత కీలకం.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు. చక్కటి ఉపాధి కల్పన విషయంలో అకడెమిక్‌గా బలమైన పునాది అవసరం. దీన్ని గుర్తించిన నాస్కామ్.. అభ్యర్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు, ప్రమాణాలు పెంపొందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) తో ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్యాలకు సంబంధించి నాస్కామ్.. పరిశ్రమ అవసరాలను, అందుకు సరితూగే శిక్షణ అంశాల వివరాలను ఎన్‌ఎస్‌డీసీకి తెలియజేస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు సదరు నైపుణ్యాలను అందుకునే విధంగా ఎన్‌ఎస్‌డీసీ మూల్యాంకన పరీక్షలు(ఎసెస్‌మెంట్ టెస్ట్స్) నిర్వహిస్తుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికేషన్ కూడా అందిస్తుంది. రిక్రూట్‌మెంట్స్ సమయంలో ఈ సర్టిఫికేషన్స్ అదనపు అర్హతగా ఉపయోగపడతాయి. నాస్కామ్ సభ్య సంస్థలు కూడా నియామకాల విషయంలో ఈ విధమైన ప్రమాణాలు పాటించేలా  కసరత్తు చేస్తున్నాం.
 
ఐటీ రంగంలో నియామకాలు తగ్గుతున్నాయనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
 
నియామకాలు తగ్గుముఖం పడుతున్నాయనడం వాస్తవం కాదు. ఐటీ రంగంలో హైరింగ్ ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే, సమస్య అంతా అభ్యర్థుల్లో నైపుణ్యాలతోనే! మంచి అకడెమిక్ రికార్‌‌డ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి అన్ని రంగాల్లో చక్కటి ఉద్యోగావకాశాలున్నాయి. కాబట్టి అభ్యర్థులు కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను పెంచుకోవాలి.
 
విద్యార్థులకు, ఇన్‌స్టిట్యూట్స్‌కు మీ సలహా?

గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులకు అకడెమిక్‌గా బలమైన పునాది ఉండాలి. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ సొంతమవుతాయి. కాబట్టి అకడెమిక్ సిలబస్‌ను నిరంతరం మూల్యాంకనం చేసి.. పరిశ్రమ అవసరాలకు తగిన రీతిలో మార్పులు చేయాలి. అధ్యాపకులు కూడా మరింత మెరుగైన బోధన అందించేందుకు ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ప్రాబ్లమ్ - సాల్వింగ్, ప్రాక్టికల్ అప్లికేషన్ స్కిల్స్ అందించే విధానాలను తరగతి గదిలో ప్రవేశపెట్టాలి. విద్యార్థులు కూడా వీటిపైనే దృష్టి సారించాలి. అప్పుడు మాత్రమే విషయ పరిజ్ఞానం లభిస్తుంది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాల బోధన, వాటికి సంబంధించి క్షేత్రస్థాయి శిక్షణ, ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిని కచ్చితంగా అమలు చేయాలి. ఫలితంగా విద్యార్థులకు ఆయా సంస్థలతో స్వయంగా మమేకమయ్యే అవకాశం లభిస్తుంది. దాంతోపాటు స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన వస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement