
అమ్మలా నాన్నతో
విరహము కూడా సుఖమే కాదా! విరహపు చింతన మధురము కాదా! వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా’’ ఇది మాయాబజార్‌లోని పాట...
వి‘యోగం’
‘‘విరహము కూడా సుఖమే కాదా! విరహపు చింతన మధురము కాదా! వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా’’ ఇది మాయాబజార్‌లోని పాట. వియోగం అంటే ఏమిటో బ్రెజిల్‌కి చెందిన రఫేల్ డెల్ కోల్‌కి బాగా తెలుసు. ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య 2013లో ఒక యాక్సిడెంట్‌లో చనిపోయింది. అప్పట్నుంచీ నాలుగేళ్ల పాప రైసీనా, భార్య తీపి జ్ఞాపకాలు మాత్రమే ఆయనకు తోడు. భార్యతో వివిధ సమయాల్లో కలిసి దిగిన ఫొటోలు చూస్తూ గడిపేస్తున్నాడు. తన పాప రైసీనాలోనే తన భార్య ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాడు. ఈ మధ్యే తన భార్యతో ఎక్కడెక్కడ, ఏయే ఫొటోలు దిగాడో అదే రకం ఫొటోలను తన కూతురితో దిగాడు. భార్య ఏ డ్రస్సులు వేసుకుందో అలాంటి డ్రస్సులే కూతురికి కుట్టించాడు. భార్య చెప్పులను కూతురు వేసుకుని ఫోజులనిచ్చింది. ఈ ఫొటోషూట్ వియోగంలోనూ ‘యోగం’ ఉందని చెప్పక చెబుతున్నాయి.
విషాదం
ఆయన పేరు ఇమాద్ హసన్. అమెరికన్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనకి ఇంగ్లీషు రాదు. అమెరికన్ సైనికులకు అరబ్ తెలియదు. అందుకని పత్తికొండ నాగప్పను కాటన్ మౌంటెన్ కోబ్రా ఫాదర్ లా అనువదించే ఒక దుబాసీని పెట్టుకున్నారు. ‘‘నువ్వు అల్ కాయిదాకి చెందిన వాడివా?’’ అని ఇంగ్లీషులో అమెరికన్ సైనికుడు అడిగాడు. ‘‘అవును నాది అల్ కాయిదేయే’’ అని గర్వంగా అరబ్‌లో అన్నాడు ఆ వ్యక్తి. అంతే! రాత్రికి రాత్రి ఆయన్ని సప్త సముద్రాలకు అవతల ఉన్న క్యూబాలోని గ్వాంటనమో బే జైలులోకి తోసేశారు.
ఇది 2002లో జరిగింది. పన్నెండేళ్ల తరువాత అనువాదకుడు చేసిన పొరబాటేమిటో అమెరికాకి తెలిసి వచ్చింది. ఇంతకీ ఇమామ్ హసన్ ఏమన్నాడంటే నాది అల్ కాయిదాయే అని. అల్ కాయిదా అనే పేరుతో యెమెన్‌లో ఒక ఊరుంది. ఆయన తన ఊరి గురించి అడుగుతున్నారనుకుని ఊరి పేరు చెప్పాడు. అమెరికా వాడి ప్రశ్న కరెక్టే. ఇమాద్ జవాబూ కరెక్టే. కానీ అనువాదకుడి లెక్క తప్పింది. అనువాదకుడికి భాష తెలుసు కానీ భూగోళ శాస్త్రం తెలియదు. ఆయన విషయాన్ని అర్థం చేసుకోకపోవడంతో అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు పుష్కరకాలం పుర్తయ్యాక ఇమాద్ హసన్ బయటకు వచ్చాడు. ఇది విషాదం కాక ఇంకేమిటి?
http://www.newsweek.com/2015/09/18/emad-hassan-guantanamo-bay-hunger-strike-al-qaeda-370475.html
విశేషం
ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ సర్జరీలతో విసిగి వేసారిపోయిన మోడలింగ్ రంగానికి కనకాంబరం నవ్వు, పారిజాతమంత బ్యూటీని తీసుకుని వచ్చేసింది ఓ పందొమ్మిదేళ్ల చిన్నది. క్రేజీ కాదు... ఫోర్ జీ అంటూ వచ్చిన మొలకన వ్వుల చిలక రాత్రికి రాత్రి దేశవాసులందరికీ సుపరిచితురాలైపోయింది. పక్కింటి పిల్లలా ఉండే ఈ అమ్మాయి దేశంలోని అడ్వర్టయిజ్‌మెంట్ రంగాన్ని ఏలేస్తోంది. ఆమె ఎవరు; ఆమె పేరేమిటి, ఆమె ఊరేమిటి అంటూ గూగుల్ గాగుల్స్‌తో యువతరం నెట్టింట్లో వెతికేస్తోంది. www.quora.com వంటి సైట్లలో ప్రశ్నోపప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏ దివిలో విరిసిన పారిజాతమో అని కుర్రకారు క్రేజీగా అడిగేస్తోంది. ఆమె పేరు సాషా ఛెత్రీ. ఆమె భోపాల్‌లో విరిసిన పారిజాతం. ఇంకా కాలేజీ చదువు పూర్తి కాలేదు. కాపీ రైటర్‌గా పనిచేస్తోంది. కలం కాపీ రైటింగ్ చేస్తున్నా ఆమె కలలు మాత్రం మోడలింగ్. తమాషా ఏమిటంటే సాషా మొదటి అడ్వర్టయిజ్ మెంట్ కే నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది.
విలక్షణం
ఆ పాపకు ఏదో తెలియని దిగులు. తండ్రి నిత్యం చికాకుగా ఉంటున్నాడు. ఆయన పొలానికి వెళ్తే ఆమె మనసు కీడు శంకిస్తోంది. వెనకే పరుగులు తీస్తోంది. మాటున దాగి తండ్రి ఏం చేస్తున్నాడో చూస్తోంది. కాసిని చినుకులు కురిసే సరికి ‘‘అమ్మయ్య ఇక దిగుల్లేదు’’ అనుకుంటోంది. అంతలోనే వాన ఆగిపోయింది.
మళ్లీ దిగులు. ఇంట్లోని పొడవాటి తాడును ఆమె తండ్రికి కనపడకుండా దాచేసింది. ‘‘మొన్న సీతా వాళ్ల నాన్న పోయాడు... నిన్న విమల వాళ్ల నాన్న ఉరేసుకున్నాడు... మా నాన్న కూడా...’’ ఈ ఆలోచన రాగానే ఆ పాపకి నిద్ర పట్టలేదు. తెల్లారి లేచేసరికి నాన్న లేడు. పరుగున వెళ్లి తాడు కోసం చూసింది. తాడు కనిపించలేదు. పాప గుండె ఆగింది. వెంటనే పొలం వైపు పరుగులు తీసింది. దూరంగా నాన్న చెట్టు కొమ్మకి తాడు బిగిస్తున్నాడు. పాప పై ప్రాణం పైకే పోయింది. ‘నాన్నా’ అని అరుస్తూ తండ్రి వైపు దూసుకు వెళ్లింది. ఆ తరువాత ఏమైంది? ఏమీ కాలేదు... వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేసి మేము రైతుకు చెబుతాం. రైతు బాధల్ని నివారిస్తాం అని ఓ ప్రైవేటు వాతావరణ వార్తల కంపెనీ అడ్వర్టయిజ్‌మెంట్ ఇది. తరువాత సీన్లో చెట్టు కొమ్మ ఉయ్యాలలో పాప ఊగుతూ ఉంటుంది. తండ్రి ఊపుతూ ఉంటాడు. లక్షల మంది చూసిన ఈ విలక్షణ యాడ్‌ని మీరూ చూడండి!
https://www.facebook.com/TSrujanaReddy/videos/920000634728222/?fref=nf
ఇది విన్నారా?
ఎవరన్నారు మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడని? ఇంగ్లండ్‌లోని గ్రేట్ యార్ మౌత్‌లో మైకేల్ జాక్సన్ ఇప్పటికీ తిరుగాడుతూనే ఉన్నాడు. ఆయన్ని అందరూ ఫాబియో ఫెర్నాండెజ్ అన్న పేరుతో పిలుస్తున్నారు. ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. అచ్చు మైకేల్ జాక్సన్‌కి జిరాక్స్ కాపీలా ఉండే ఫాబియో కూడా మూన్ వాకర్ మరణించాడంటే ఒప్పుకోడు. ‘‘అచ్చు మైక్‌లా ఉండడం నా అదృష్టం’’ అంటాడు. తమాషా ఏమిటంటే ఫాబియోకి ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేకుడానే మైకేల్ జాక్సన్ పోలికలు వచ్చాయి.
http://metro.co.uk/2015/09/15/meet-the-amazing-michael-jackson-lookalike-who-got-the-look-without-surgery-5392283/
ఇది చూశారా?
నోరు భగ్గుమనిపించే మిరపకాయను పరపరా నమిలేసి, ఆ తరువాత చెప్పండి షేక్స్‌పియర్ డైలాగులు! ఇదీ రోసీ కాలిన్స్ అనే ఫోటోగ్రాఫర్ తన చిల్లీ మోనోలాగ్స్ (మిరప ఘాటు మాటలు) ప్రాజెక్టులో నటులకు విసిరిన సవాల్. కొరివికారం, గొడ్డుకారం సూరేకారంలా గొంతులో ఢాం ఢాం అంటూంటే మనోళ్లు డైలాగులు చెప్పే వైనం చూసి తీరాల్సిందే!
http://news.yahoo.com/blogs/trending-now/actors-attempt-to-recite-shakespeare-after-eating-super-hot-chili-peppers-175744321.html
ఇది చదివారా?
సైకిల్‌పై గునగునమంటూ వచ్చేస్తున్న ఈ బుల్లెమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఈమె అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడబోతున్న హిల్లరీ క్లింటన్. ఎన్నికల సీజన్‌లో ఇమేజీ బిల్డింగ్‌కోసం ఫోటో ఆల్బంలోని పాత ఫోటోలను ఆమె బయటకి తీసి, సోషల్ మీడియాలో ప్రచారానికి తెచ్చింది. ప్రపంచ పెద్దన్న అమెరికాకు నాయకత్వాన్ని కోరుకుంటున్న ఈ పెద్దమ్మ ‘ఫోటోకి ఓటు’ పథకాన్ని అమలు చేస్తోంది. చదివితే మీకే తెలుస్తుంది.
http://www.politico.com/story/2015/09/hillary-clinton-2016-vintage-images-nostalgia-213615