
269 వాల్ మార్ట్ స్టోర్స్ మూసివేత
అమెరికా రిటైల్ మార్కెటింగ్ దిగ్గజం వాల్మార్ట్ తాజా ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగులలో ఆందోళన మొదలైంది.
వాషింగ్టన్: అమెరికా రిటైల్ మార్కెటింగ్ దిగ్గజం వాల్మార్ట్ తాజా ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. 269 వాల్మార్ట్ స్టోర్లు మూసివేయాలని భావిస్తున్నట్లు ఆర్కాన్సస్ కు చెందిన ఓ కంపెనీ తెలిపింది. స్టోర్స్ మూసివేతతో పదహారు వేలమంది వాల్మార్ట్ సిబ్బంది రోడ్డున పడనున్నారు. ఇందులో ఆరు వేల మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. అమెరికాలోని 154 స్టోర్స్, విదేశాల్లోని (బ్రెజిల్)115 స్టోర్లను మూసివేయనుంది. బ్రెజిల్లో ఇప్పటికే 60 వాల్ మార్ట్ స్టోర్స్ బంద్ అయ్యాయి. బ్రెజిల్ దేశవ్యాప్తంగా వాల్మార్ట్ స్టోర్ల ఆదాయం 5 శాతం పడిపోయిందట.
వీలైనంత వరకు కొందరు ఉద్యోగులను తమ అనుబంధ కంపెనీల్లోకి బదిలీ చేశారు. జనవరి చివరికల్లా ఈ తతంగం పూర్తవుతుందని వాల్మార్ట్ సీఈవో డౌగ్ మెక్మిలన్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏం అవుతుందోనని స్టోర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2011లో యుద్ధప్రాతిపదికన వాల్మార్ట్ రిటైల్ మార్కెట్లో స్టోర్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వాల్మార్ట్ స్టోర్స్ ప్రస్తుతం అంత లాభదాయకంగా పనిచేయడం లేదు. దీంతో ఆయా స్టోర్లను మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అమెరికా వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు మరో 405 స్టోర్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఈవో చెబుతున్నారు.