నవలోకం సృష్టికర్తలు!
ఆటబొమ్మలు పట్టుకోవాల్సిన చేతులు... సత్తు బొచ్చెలు పట్టుకుంటున్నాయి. బడిదారి పట్టాల్సిన పాదాలు... గుడి మెట్ల దగ్గరకు నడుస్తున్నాయి. అక్షరాలు వల్లె వేయాల్సిన పెదాలు... ‘అమ్మా, భిక్షమేయండి’ అని అడుక్కుంటున్నాయి. సిగ్నళ్ల దగ్గర, ఆలయాల ముందర, దుకాణాల పంచన... ముష్టివాళ్ల రూపమెత్తిన పసివాళ్లను చూస్తే గుండె భగ్గుమంటుంది. కానీ వారి జీవితాలను మార్చాలన్న ఆలోచన ఎందరి మస్తిష్కాల్లో మెదులుతుంది? కానీ ఆ నలుగురికీ ఆ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఆ వైజాగ్ కుర్రాళ్లు వడివడిగా అడుగులు వేశారు. నవలోకాన్ని నిర్మించారు!
విలువలు పతనమైపోతున్న ఈ రోజుల్లో కొత్త తరానికి విలువల్ని నేర్పేందుకు ఓ నూతన ప్రాజెక్టును ప్రారంభించారు నరేశ్ బృందం. ఇందులో భాగంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొంత స్థలాన్ని నెలకు రూ.15 వేలకు అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ పూర్తి గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు చేపట్టారు. రెల్లుగడ్డి, వెదురు, తాటి దుంగలతో కాటేజులు నిర్మించారు. మధ్యలో కొలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై నిపుణుల సాయంతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. యువకుల్లో సామాజిక సేవాదృక్పథం కల్పించేందుకు శిక్షణనిస్తారు. పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నైతిక విలువల్ని నేర్పిస్తున్నారు!
నరేశ్‌కుమార్ బీటెక్ చేశాడు. ఎమ్మెస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అంతలో అతడిలో మథనం మొదలైంది. ఎక్కడికో వెళ్లి ఏదో చేయడమేంటి! ఎమ్మెస్ చేసి, లక్షలు సంపాదించడం వల్ల కలిసొచ్చేదేంటి! మనవల్ల మన ప్రాంతానికి, మనవాళ్లకి ఏం ఒరిగింది అని! దాంతో విదేశాలకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాజం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన క్లాస్‌మేట్సతో కలిసి ఆశ్రమాలకు వెళ్లేవాడు.
రకరకాల సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఆ క్రమంలో అతడికి కోటా రాకేష్‌రెడ్డి, సాల్మన్ జార్జ్ క్యాంప్‌బెల్, రాజశేఖర్‌లు పరిచయమయ్యారు. రాకేష్‌రెడ్డి బీటెక్, ఎంబీఏ చే సి రూ.లక్ష జీతాన్ని ఇచ్చే ఎల్‌అండ్‌టీలో జాబ్ వదిలేసాడు. సాల్మన్ మంచి జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి పెట్టేశాడు. రాజశేఖర్ కెనడాలోని ఐబీఎంలో సుమారు రూ.2 లక్షలు జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చేశాడు. వాళ్లు కూడా నరేశ్‌లాగే సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఉన్నారు. ఆలోచనలు కలిశాయి. అభిప్రాయాలు ఒకటయ్యాయి. దాంతో నలుగురూ కలిసి వైజాగ్‌లో ‘జెన్‌యువ’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వేర్వేరు వృత్తులు చేపట్టినా... ఎక్కువ సమయాన్ని తమ ఎన్జీవోకే కేటాయిస్తున్నారు.
బాలల బంధువులయ్యారు...
తమ సేవను విస్తరించేందుకు మురికివాడల్లో తిరుగుతున్నప్పుడు నరేశ్ బృందాన్ని ఓ విషయం బాధపెట్టింది. చాలామంది పిల్లలు బడికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతున్నారు. మాసిన గుడ్డలు, మురికి అంటిన దేహాలతో ఉన్న వారిని చూసి వీరి మనసులు కలుక్కుమన్నాయి. వారందరినీ బడికి పంపాలని తీర్మానించుకుని కంచరపాలెం వంతెన వద్ద సామాజిక భవనంలో చిన్నారులకు చదువు చెప్పడం మొదలు పెట్టారు. కొందరిని వేర్వేరు పాఠశాలల్లో చేర్పించారు. కానీ వాళ్లు చదువుకోవడానికి ఇష్టపడేవారు కాదు. బడికెళ్లకుండా రోడ్లమీద తిరుగుతుండేవారు. వారి తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం ఉండేది కాదు. మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే... వారిలో చాలామంది పిల్లలు యాచకులు కావడం! తల్లిదండ్రుల నిర్లక్ష్యం, కుటుంబ తగాదాలు వంటి వాటి కారణంగా ఆ పిల్లలు అలా తయారయ్యారని అర్థమైంది నరేశ్ బృందానికి. వెంటనే ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. పిల్లలందరినీ ఓ చోట చేర్చి, కౌన్సెలింగ్ చేయాలని ప్రయత్నించారు.
కానీ వారి రియాక్షన్ వింతగా ఉండేది. ముష్టి ఎత్తితే రోజుకు నాలుగొందలు వస్తాయి, చక్కగా బిర్యానీ తిని జగదాంబలో సినిమా చూసొచ్చి హాయిగా నిద్రపోతాం, ఆ పని మానేస్తే మాకవన్నీ ఎవరిస్తారు అనేవారు వాళ్లు. అంతకన్నా దారుణం ఏమిటంటే వారిలో చాలా మంది డ్రగ్ ్సకు కూడా అలవాటుపడ్డారు. తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం వారిని సంపాదించే యంత్రాలుగా మార్చేశారు. అవన్నీ తెలిశాక తాము అనుకున్నది సాధించడం అంత తేలిక కాదని తెలిసొచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడాది పాటు కృషి చేసి ఓ ఇద్దరిని మాత్రం మార్చగలిగారు.
పిల్లలకు డబ్బులు అందకుండా చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిర్ణయించుకుని... తాము కూడగట్టిన ఓ 50 మంది యువకులతో చైతన్య కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువ చ్చారు. 13 లక్షల కరపత్రాలను పంపిణీ చేసి బాల యాచకులకు డబ్బులు అందకుండా చేశారు. బాల యాచకులకు డబ్బులు ఇవ్వద్దంటూ బీచ్, ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు, బ్యానర్లతో ప్రచారం నిర్వహించారు. పిల్లల్ని యాచకవృత్తి వదిలేవరకు ఓపిగ్గా వెంటపడ్డారు. దీంతో పిల్లలతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. పిల్లలూ పెద్దలూ కలిసి సుమారు 1800 మంది యాచక వృత్తిని వదిలేశారు. వేరే ప్రాంతాల నుంచి యాచకత్వానికి వచ్చేవారికి కూడా అక్కడ జనం డబ్బులు వేయరని తెలిసిపోయింది. అందుకే బయటివాళ్లు కూడా రావడం లేదు.
యాచక వృత్తిని వదిలేసిన యాభై మంది చిన్నారులు జెన్‌యువ ఆశ్రమంలో వసతి పొందుతూ, భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుత్నారు. మరొక 50 మందికి వసతి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన సొంత భవనాన్ని నరేష్‌కుమార్ హోమ్‌కు ఇచ్చేశారు. దాతల సాయం తో కొత్త నిర్మాణాలను ప్రారంభించారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు... వారికి ఉపాధి కల్పించడానికి ఎకోఫ్రెండ్లీ అలంకరణ వస్తువుల షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. ఓ నర్సరీని కూడా పెట్టి, దాని ద్వారా కొందరికి ఉపాధి కల్పించారు. ఈ కృషి ఇలాగే కొనసాగితే, అందరూ నడుం బిగిస్తే... మన దేశంలో అసలు యాచక వృత్తి అన్నదే ఉండదు అంటారు నరేశ్‌కుమార్. నిజమే. కృషి ఉంటే కానిది ఏముంది!
- వి.ఆర్.కాశిరెడ్డి,
గమనిక
ఫ్యామిలీ లోపలి పేజీల్లో కొన్ని శీర్షికలు ఈవారం నుంచి కొన్ని మార్పులతో కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు మెయిన్‌లో వస్తున్న ‘సాగుబడి’, ‘సాహిత్యం’ పేజీలు ఇకపై ప్రతి గురు, శనివారాల్లో ఫ్యామిలీ లోపలి పేజీల్లో మరింత సమగ్రంగా, ఆకర్షణీయంగా రానున్నాయి. ప్రతి బుధవారం వస్తున్న ఆమె-అతడు స్థానంలో అస్త్ర - శాస్త్ర పేజీలు మరింత ఆసక్తికరంగా, మరింత సాధికారికంగా రాబోతున్నాయి. పాఠకులు ఈ మార్పును గమనించగలరు.
- ఎడిటర్