‘తన కోపమె తన శత్రువు... తన శాంతమె తనకు రక్ష...’ అని సుమతీ శతకకారుడు ఏనాడో చిలక్కు చెప్పినట్లు చెప్పాడు. ప్రతి చిన్న కారణానికీ భగ్గున మండిపడే అపర దుర్వాసులు ఆ నీతిని ఏమాత్రం పట్టించుకోకుండా నిత్యం ఎదుటివారి మీద ధుమధుమ లాడుతూనే ఉంటారు. చీటికి మాటికి చిర్రుబుర్రులాడే కోపాల్రావులు ఇకపై ఇతరులపై కోపించే ముందు కాస్త ఆలోచించి, కోపానికి కళ్లాలు వేయడం మంచిది. ఎందుకంటే, తరచుగా కోప తాపాలకు గురయ్యేవారు త్వరగానే బాల్చీ తన్నేసే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం 25–40 ఏళ్ల వయసులో ఉన్నవారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే, వాళ్లు మరో 35 ఏళ్లకు మించి బతికే అవకాశాలు ఉండవని అయోవా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు మెదడు నుంచి ‘అడ్రినలిన్’ విడుదలవుతుంది. ‘అడ్రినలిన్’ విడుదల ఎంత తక్కువగా ఉంటే అంత క్షేమం. చీటికి మాటికి కోపంతో మండిపడే వారిలో తరచుగా అడ్రినలిన్ విడుదలవుతుంది. ఇలా తరచు విడుదలయ్యే అడ్రినలిన్ డీఎన్‌ఏను దెబ్బతీసి, ‘మల్లిపుల్ స్కెలరోసిస్’ సహా పలు ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment