నూతన సంవత్సర శుభ్ర కాంక్షలు | new year celebration 15 | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సర శుభ్ర కాంక్షలు

Published Wed, Dec 31 2014 10:40 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year celebration 15

ఈ సంవత్సరం మార్చి నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారో, ఎప్పుడు నిర్వహిస్తారో, ఎలా నిర్వహిస్తారో, ఇంకా చెప్పాలంటే ఎందుకు నిర్వహిస్తారో, ఏ విశ్వవిద్యాలయంలో ఎక్కడ, ఎలా ప్రవేశాలు జరుగుతాయో చెప్పగలిగిన జ్యోతిషుడికి, హుద్ హుద్ స్థాయిలో చందాలు వేసుకుని, విద్యార్థులంతా ఊరేగింపులు, సత్కారాలు జరపాలని తీర్మానించడమైంది.
 
మనకు ఒకప్పుడు ఒక రాష్ట్రపతి ఉండేవారు. ‘కలలు కనండీ కలలు కనండీ’ అంటూండేవారాయన (ఇప్పటికీ ఆయన అదే మాట చెప్తారు రాష్ట్రపతి కాకున్నా). అప్పట్లో ప్రజలకు అర్థమయ్యేది కాదు; సమస్యలు ఎలా ఉన్నాయంటే నిద్రే పట్టదు; ఇంక కలలు ఎలా కనాలి అని. ఇప్పటికీ ప్రజల సమస్య అదే.

కానీ 2014లో మనకు దైవవశాన లభించిన తాజా తాజా ప్రధానమంత్రి, తాజా తాజా ముఖ్యమంత్రులు ఆ కలల్ని ఎగిరి గంతేసి పట్టుకున్నారు. వాళ్లది సామ్యవాదం కనక తమ కలలు అందరివీ, అందరి కలలూ తమవి అనుకున్నారు. అందుచేత గబగబా వేదికల మీద, పత్రికా గోష్టుల్లో కలలు కనేసి, అందరికీ పంచేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఒకే కలలు వస్తున్నాయి. పే.....ద్ద భవనాలు, వీధికొక యూనివర్సిటీ, కులానికో భవనం.. చవగ్గా అనేక రకాల చీపుర్లు.. నామకరణం వేళకు లాప్‌టాప్‌లు, ఇండియాలో తయారైన చైనా గోడలు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీలు... ఇలా అనంతమైన కలలు. ఫ్రాయిడ్ గనక ఇప్పుడు పుడితే తన ‘ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ ఎంత చెత్త పుస్తకమో గ్రహించి, సరికొత్త పుస్తకాన్ని రాస్తాడు.
 
గత సంవత్సరం మనకు లభించిన ఈ దైవాంశ సంభూతుల కలల్ని ఈ సంవత్సరం నిజం చేయడం భారతపౌరులుగా మన కర్తవ్యం. ముందు చీపురునే తీసుకుందాం. ఎవ్వరి ఇళ్లలోను ఇకపై వ్యాక్యూమ్ క్లీనర్‌లు ఉండేందుకు వీల్లేదు. ఒకవేళ ఉంటే బయటకు పారేయండి. ఎర్ర రిబ్బను చీపుర్లు, నల్లరిబ్బను చీపుర్లు, నీలం చీపుర్లు, ఇలా మీకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు రిబ్బన్లున్న చీపురులను తయారు చేయడం, వాడడం మన తక్షణ కర్తవ్యం. కావాలంటే అన్నీ కాషాయరంగు చీపుర్లయినా ఫర్వాలేదు. చల్తా. అలా కొన్నాక ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిల్లిపాదీ ఊడ్చేందుకు టైం టేబిల్ వేసుకోవాలి.
 
అలా ఊడవడం కొత్త సంవత్సరానికి చాలా అవసరం. ఊడ్చిన తర్వాత శుభ్రంగా ఉన్న దేశంలో మనం అన్నిటినీ తయారుచేసుకుందాం. వీలైతే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ లో కూడా తయారు చేసుకుందాం. ఎందుకంటే మేడిన్ ఇండియా ఎంత ముఖ్యమో, మేడిన్ ఆంధ్రా, మేడిన్ తెలంగాణా కూడా అంతే ముఖ్యం.
 
కొత్త సంవత్సరం అనగానే అందరికీ కొత్త ఆశలు, కొత్త తీర్మానాలూ ఉంటాయట. రెండూ తీరకూడదట కూడా. తీరిపోతే మళ్ళీ సంవత్సరానికి తాజాగా కొత్త ఆశలు కల్పించుకోవడం కష్టం కాబట్టి అవి తీరకుండా భగవంతుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాడట. అసలు భగవంతుడికి చాలా బద్ధకం. అందుకే పెళ్లిని ‘ఏడేడు జన్మల బంధం’ అన్నాడు. ప్రతి జన్మలోనూ ఒక్కో అబ్బాయికీ, అమ్మాయికీ కొత్తగా జంటను కుదర్చడం తనకు టైం వేస్టని, ఏడు జన్మల వరకూ మీరే కలిసి ఏడవండి అని చెప్పేశాడు. మనమేమో అది పవిత్ర జన్మజన్మల బంధం అనుకుంటాం. అమాయకులం కదా! ఇంతకూ కొత్త ఆశలు మనం దేనిపై పెట్టుకోవాలిట? భారతదేశంలో ప్రజలకు ఉత్సాహం కలిగించేవి రెండే (ఏ టీవీ ఛానెల్‌ని అడిగినా అదే చెప్తారు): సినిమాలు, రాజకీయాలు కనక ఈ కింది తీర్మానాలు చేద్దాం.
 
మహేశ్‌బాబు ‘వన్’ లాంటి సినిమాలు చేయడం మానేసి , పోకిరి-2 అతడు-3 చేయవలెనని తీర్మానించడమైనది  చిరంజీవి 150వ చిత్రం మరో నాలుగేళ్ళ వరకూ వస్తూనే ఉండవలెననీ, ఈ లోగా ‘ఈ భూమి మీద సూర్యచంద్రులు తిరుగాడినంతకాలం నిలిచే’’ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, మళ్లీ దాన్ని పీట మీద కూర్చోబెట్టి ఢిల్లీలో ఆయన మంత్రిగా వెలగాలని తీర్మానించడమైనది ‘వందకోట్ల సినిమాలు’ వంటి విశేషణాలు ఇష్టం లేదంటూనే 300 కోట్ల జాబితాలో చేరానా లేదా అని చూసుకునే అమీర్‌ఖాన్ మరిన్ని ‘సందేశాత్మక’ చిత్రాలతో మనల్ని సన్మార్గంలో నడిపించాలని తీర్మానించడమైంది  బ్రహ్మానందం చెంపదెబ్బలు తినని తెలుగు సినిమా ఏదైనా పొరబాటున విడుదల అయితే, దాన్ని నిషేధించాలని తీర్మానం చేయడమైనది.
   
కుటుంబ సభ్యులతో మాటలు తగ్గించాలని తీర్మానించడమైంది. దీనివల్ల పరిసరాల్లో ధ్వనికాలుష్యం తగ్గుతుంది. రోజు అమ్మానాన్నలు తాము ఈరోజు వండుకున్న వంటలూ, తిరగబోతున్న ప్రదేశాలు, ఆఫీసులో చేసిన పనులు, వాటన్నిటి ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టాలి. వీలైతే తమ పాస్‌పోర్టు ఫోటోలతో. ఎందుకంటే తమ పిల్లలు తమ పేర్లను గుర్తిస్తారో లేదో. తాము రాసిన దానికి ‘లైక్’ కొట్టమని పిల్లలకు ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌లో లేదా వాట్సాప్‌లో సందేశం పంపాలని తీర్మానించడమైనది.

కొత్త సంవత్సరానికి ఈ తీర్మానాలు
అంతం కావు; ఆరంభం..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement