
శక్తి ప్రార్థనలో లేదు, అది వినే దేవునిలో ఉంది!!
సువార్త
ఆహాబు రాజు దుర్మార్గపు పాలనలో ఇశ్రాయేలీయులు ఆర్థికంగా, ఆత్మీయంగా కూడా ఎంతో చితికిపోయిన కాలమది. అతని భయంతో ‘బయలు’ అనే విగ్రహానికి వాళ్లంతా ఆరాధనలు చేస్తున్న కాలంలో, ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని పక్షంగా నిలబడ్డాడు. పైగా కర్మెలు పర్వతం మీద, బయలు నిజమైన దేవుడైతే రుజువు చేయమంటూ అతని ప్రవక్తలను సవాలు చేశాడు. వాళ్లు విఫలమైన చోటే ఆకాశం నుండి బలిపీఠం మీద తన ప్రార్థనతో అగ్ని కురిపించి తన దేవుడు నిజమైన వాడంటూ రుజువు చేశాడు. అంతకాలంగా కరువుతో అలమటించిన దేశంపైన ఏలియా ప్రార్థనతో వర్షాలు కురిసి అంతా తెప్పరిల్లారు. (1రాజులు 18:37) యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన యాకోబు ఈ ఉదంతాన్ని ప్రస్తావించి నీతిమంతుడు చేసే మనఃపూర్వకమైన ప్రార్థన లో ఎంతో బలముందుంటున్నాడు (యాకోబు 5:16).
అయితే దేవుని వాక్యాన్ని తమకనుగుణంగా అన్వయించుకునే అతి తెలివితేటలతో చాలామంది ‘ప్రార్థన విజయం’ ‘ప్రార్థన శక్తి’ లాంటి నినాదాలు లేవదీసి సొంత ప్రార్థనా -పరిచర్య దుకాణాలు తెరిచారు. ఏమాత్రం కష్టపడకుండా, నష్టపోకుండా చేయగలిగింది ప్రార్థనాపరిచర్య కనుక దాంట్లో ‘ముందుకు’ దూసుకెళ్లిపోతున్నారు. ఈ మాటలు ప్రస్తావించిన యాకూబుతో సహా అపొస్తలులు, ఎంతోమంది ఆదిమ విశ్వాసులు గొప్ప ప్రార్థనాపరులు. ఎందుకంటే వాళ్లంతా తమ సర్వం పోగొట్టుకుని హతసాక్షులయ్యారు. నాడు కర్మెలు పర్వతం మీద ఏలియా చేసిన ప్రార్థనలో అహాబునెదిరించిన తెగింపు, దేవునికోసం పౌరుషముంది. అది మన ప్రార్థనల్లో ఉన్నాయా? ఏలియా తనకోసం ప్రార్థన చేసుకోలేదు. మరి మనం? మన కోరికలు, అవసరాలకోసం చేసే ప్రార్థనకు ఏలియా ప్రార్థనకున్న శక్తి ఎక్కడినుండి వస్తుంది? మనం ప్రార్థించినట్టు జరిగితే ‘ఇది నా ప్రార్థనావిజయం’ అంటూ ప్రగల్భాలు పలకడం, లేకపోతే ‘దేవుని చిత్తం’ అంటూ దాటేయడం సర్వసాధారణమైంది. అయితే ప్రార్థన చేయకూడదా? తప్పక చేయాలి. విశ్వాసికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మనకోసం మన ఆప్తులకోపం ప్రార్థన చేయడం మన ఆత్మీయ బాధ్యత. కాని దానికి ముందుగా ప్రార్థనకు సంబంధించి కొన్ని మూలాంశాలు తెలుసుకోవాలి. విశ్వాసిని దేవునితో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రక్రియ ‘ప్రార్థన’. ఈ అనుసంధానంలో విశ్వాసి తనకు సంబంధించి దేవుని చిత్తమేమిటో స్పష్టంగా తెలుసుకుంటాడు. కాబట్టి తానడుగుతున్న దానికన్నా, దేవుడివ్వాలనుకుంటున్నదే తనకు మేలు చేస్తుందన్న ఉన్నత స్థాయికి విశ్వాసి ఎదుగుతాడు. ‘నీ చిత్తమే సిద్ధించును గాక’ అంటూ యేసుక్రీస్తు నేర్పించి, కలువరికి ముందు గెత్సెమనెలో చేసిన ప్రార్థనకు మించిన ప్రార్థన ఈ లోకంలో లేదు.
అనుకోకుండా ఎదురైన ఆపదనుండి తప్పించమంటూ ప్రార్థన చేయడం సహజం కాని. అది దేవునికి తెలియదనుకొని ఆయనకే సమాచార మివ్వడానికి పూనుకోవడం సర్వజ్ఞాని, సార్వభౌముడు అయిన దేవుని అవమానించడమే!! ఈ ఆపదనుంచి తప్పించమని దేవుని అగడంతోపాటు దీనిద్వారా నాకు దేవుడేం నేర్పించాలనుకుంటున్నాడని కూడా ఆలోచించాలి. మన బాధ్యతారాహిత్యం, సోమరితనం, అతి తెలివితేటలు, జ్ఞానం లేకపోవడం వంటివి మన జీవితాల్లో చాలాఆపదలు రావడానికి కారణం కాదా? ఆపదనుంచి దేవుడు తప్పించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడంటూ చంకలు గుద్దుకోవడంకాదు, ఆపదలో ఎందుకు పడ్డామో గ్రహించి తప్పులు దిద్దుకోవడం అవివేకం, అవశ్యం కూడా!! శక్తి ప్రార్థనలో కాదు అది వినే దేవునిలోనే ఉంటుంది. దేవుని చిత్తానికనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే నిజమైన ఆత్మీయ విజయం!!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్