హార్ట్‌ జబ్బులకు హాల్ట్‌ చెబుదాం | Nutrition to Be Taken To Prevent Heart Disease | Sakshi
Sakshi News home page

హార్ట్‌ జబ్బులకు హాల్ట్‌ చెబుదాం

Published Thu, Sep 26 2019 1:55 AM | Last Updated on Thu, Sep 26 2019 1:57 AM

Nutrition to Be Taken To Prevent Heart Disease - Sakshi

ప్రపంచంలో 1900 కి ముందు గుండెజబ్బులు అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. గుండెజబ్బులతో చనిపోవడం అన్నది కనిపించేదే కాదు. అయితే 1900 నుంచి 1960 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో గుండెజబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా అన్ని రకాల కారణాలతో వచ్చే మరణాలతో పోలిస్తే గుండెజబ్బు మరణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. అయితే 1960ల తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో గుండెజబ్బు మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. గుండెజబ్బుకు గల కారణాలూ, దాని లక్షణాలు తెలియడంతో పాటు దాన్ని నివారణ గురించి అభివృద్ధి చెందిన దేశాల వారికి బాగా అవగాహన పెరగడం వల్ల అక్కడ గుండెజబ్బుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

అయితే భారతదేశంలో ఆ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం (వరల్డ్‌ హార్ట్‌ డే) సందర్భంగా మన దేశంలో గుండెజబ్బుల పరిస్థితి గురించి, వాటిని నివారించే విషయంలో మనం తీసుకోగల జాగ్రత్తలు/నివారణ చర్యల గురించి కాస్తంత విపులంగా పరిశీలిద్దాం. అన్ని విషయాల్లోనూ ఉన్నట్లే... జబ్బులు వాటి నివారణ విషయాల్లోనూ ఒక పరిణామక్రమం ఉంటుంది. ఈ పరిణామక్రమంలోని దశలో అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ దాదాపుగా అన్నిదేశాల్లోనూ మొదటో... తర్వాతో ఇవే దశలు కొనసాగుతాయి.

మొదటి దశలో వచ్చే జబ్బులు
ఉదాహరణకు ప్రతిదేశంలోనూ మొదట అంటురోగాలు (కమ్యూనికబుల్‌ డిసీజెస్‌), పౌష్టికాహార లోపాలతో వచ్చే జబ్బులు బాగా ఎక్కువగా ఉంటాయి. మన అవగాహనతోనూ... మందులను కనుగొనడంతోనూ, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం ద్వారా జీవన నాణ్యతను మరింతగా పెంచుకోవడం వల్ల ఈ జబ్బులు క్రమంగా తగ్గిపోతాయి. కమ్యూనికబుల్‌ డిసీజెస్‌కు కలరా, ప్లేగు వంటి వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక పోషకాహార లోపాల వల్ల వచ్చే వాటికి బెరీబెరీ వంటి జబ్బులు ఉదాహరణగా నిలుస్తాయి. మానవాళి యాంటీబ్యాక్టీరియా మందులు కనుకున్న తర్వాత కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ వంటి కలరా, ప్లేగు వంటివి దాదాపుగా కనుమరుగయ్యాయి.

దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశల్లోనూ నాణ్యమైన నీటి సరఫరాతో నీరు కలుషితం కావడం వల్ల వచ్చే జబ్బులు తగ్గాయి. అలాగే మెరుగైన ఆహార పంపిణీ వల్ల పోషకాహార లోపంతో వచ్చే జబ్బులన్నీ బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల్లో పూర్తిగా మటుమాయమయ్యాయనే చెప్పవచ్చు. అయితే భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో అంటురోగాలు ఇప్పటికీ అడపాదడపా ప్రబలుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లాగా మనం వాటిని ఇంకా పూర్తిగా అరికట్టలేకపోయాం.

రెండో దశలో వచ్చే జబ్బులు
ఆ తర్వాతి వంతు నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ది. అంటే ఇవి అంటురోగాలు కాని జబ్బులన్నమాట. ఈ తరహా జబ్బులకు ప్రధానమైన ఉదాహరణగా గుండెజబ్బులను చెప్పవచ్చు. హైబీపీ, డయాబెటిస్‌ వంటి జీవనశైలికి సంబంధించిన జబ్బులూ ఈ కోవకే చెందుతాయి. అవి మళ్లీ గుండెజబ్బులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయి. వ్యాధులలో రెండో దశ అయిన ఈ గుండెజబ్బుల నివారణ విషయానికి వచ్చే సరికి... తమ దేశాల్లో మొదటిదశ జబ్బులు లేకపోవడం వల్ల ఆయాదేశాలు గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులపై పూర్తిగా దృష్టిపెట్టగలిగాయి. కానీ మనం ఇంకా అంటురోగులతో పోరాడుతూనే ఉన్నాం.

స్వచ్ఛమైన నీటి సరఫరా, దోమల నివారణ, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన్న అన్నది భారతదేశంలోని ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తిగా జరగనందువల్ల ఒకవైపు మొదటిదశ జబ్బులైన అంటువ్యాధులతో పోరాడుతూనే ఇంకా గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులతోనూ పోరు చేయాల్సివస్తోంది. పైగా భారతదేశంలో పౌష్టికాహారం ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో మొదటిదశలో వచ్చే పౌష్టికాహార లోపాల కారణంగా వచ్చే జబ్బులూ మనదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో పాశ్చాత్యదేశాల కంటే ఈ విషయంలోనూ కాస్తంత వెనకబడే ఉన్నాం. ఫలితంగా మనదేశంలో మొదటి దశ వ్యాధులు పూర్తిగా తగ్గకముందే రెండోదశ వ్యాధులతోనూ ద్విముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నందున మన అడుగులు తడబడుతూనే సాగుతున్నాయని చెప్పవచ్చు.

జన్యుపరమైన అంశాలూ కారణాలేనా?
ఇవన్నీ బయటి పరిస్థితుల కారణంగా గుండెజబ్బులకు దోహదపడే అంశాలైతే మరికొన్ని జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మిగతా జాతీయులతో పోలిస్తే... భారత జాతీయులకు అధికంగా గుండెజబ్బులు వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇంగ్లాండ్‌ వంటి యూరోపియన్‌ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లోనే గుండెజబ్బులు ఎక్కువ. పాశ్చాత్యదేశాల్లో స్థిరపడ్డ భారతీయులలో అక్కడి జీవనశైలికి అలవాటు పడ్డవారిలో కూడా భారతీయుల్లో జబ్బులు మరింతగా ప్రబలాయి. ఈ అన్ని పరిశోధనలూ, పరిశీలనల కారణంగా భారతీయుల్లో జన్యుపరంగా గుండెజబ్బులు ఎక్కువగానే వస్తాయని, కాబట్టి భారతీయుల్లో వీటిని నివారణ అంతగా సాధ్యం కాకపోవచ్చని  తొలుత అధ్యయనవేత్తలు భావించారు.

ఇదీ ఒక ప్రధానమైన ఆశారేఖ  
కానీ గుండెజబ్బుల విషయంలో మనదేశంలో నిశితంగా పరిశీలిస్తే... పట్టణప్రాంతాల్లో ఉన్న భారతీయులకూ, పల్లెల్లో ఉన్నవారికీ మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వ్యాయామం ఉండటంతో పాటు ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలి, ప్రాసెస్‌డ్‌ ఆహారం పట్టణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండి, పల్లెల్లో లేకపోవడం వంటి కారణాలతో పట్టణవాసుల్లో గుండెజబ్బులు ఎక్కువగానూ, పల్లెల్లో అంతగా లేకపోవడం నిపుణల దృష్టికి వచ్చింది. ఇది ఒక ఆశారేఖ. దీనితో తేలుతున్న విషయం ఏమిటంటే... మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మనం మనకున్న జన్యులోపాలను అధిగమించి గుండెజబ్బులను తగ్గించుకోవచ్చు!

ముందుంది ఒక పెనుసవాలు
అయితే ఇక్కడ మన ముందు ఒక పెనుసవాలు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పొగతాగే అలవాటు ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు పట్టణాల్లో కనిపించే ప్రాసెస్‌డ్‌ ఆహారాలు, కూల్‌డ్రింకులు, జంక్‌ఫుడ్స్‌ వంటివి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. ఈ విషయంలో పట్టణప్రాంతాలకూ, పల్లెలకు ఉన్న తేడా చెరిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాగే ఒకసారి శారీరక శ్రమ తగ్గించే వస్తువులు (గాడ్జెట్స్‌ ఉదాహరణకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్‌ మెషిన్‌ వంటివి), యాంత్రీకరణ వల్ల పల్లెల్లోనూ ఇప్పుడు వ్యాయామం తగ్గిపోతోంది. అలాగే వినియోగదారులు పెరగడం, రవాణా సదుపాయాలు మెరుగుకావడం వంటి అంశాలతో ఇప్పుడు కన్సూ్యమరిజమ్‌ కారణంగా ప్రాసెస్‌డ్‌ ఆహారం లభ్యత కూడా ఇప్పుడు  పల్లెల్లో బాగా పెరుగుతోంది.

ఇది వేగంగా జరుగుతున్నందున గుండెజబ్బుల విషయంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న తేడా వేగంగా చెరిగిపోవడానికి చాలాకాలం పట్టదు. ఇప్పటికీ మనం మొదటిదశ జబ్బులతోనూ, రెండోదశ వ్యాధులతోనూ ఒకేసారి పోరాడుతున్న ప్రస్తుత నేపథ్యంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న వ్యత్యాసం తగ్గిపోతే మనకిప్పుడు ఉన్న ఆర్థిక వనరులతోగానీ, లేదా వైద్య సదుపాయాల వంటి వనరులుగానీ ఈ తేడా చెరిగిపోవడంతో పెరిగిపోయే వ్యాధిగ్రస్తుల చికిత్సను మనం ఒకేసారి ఎదుర్కోవడానికి మనకున్న సామర్థ్యం పూర్తిగా సరిపోకపోవచ్చు.  

మన ఆశారేఖను వినియోగించుకోవాలిలా...
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుండెజబ్బుల విస్తృతిలో ఉన్న తేడాలను బట్టి మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెజబ్బులను అరికట్టుకోవచ్చని తేలింది. కాబట్టి... మనమీ ఆశారేఖను సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకు ఈ కింది నివారణ చర్యలు/జాగ్రత్తలు తీసుకోండి.  

నివారణ   
పొగ తాగడం మానండి:  పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉన్నా, మాన్పించండి. ఒకసారి హార్ట్‌ ఎటాక్‌ కానీ, గుండె జబ్బు కానీ వస్తే, దీర్ఘకాలం ఇబ్బంది పెట్టే దానితో బాధపడడం కన్నా, పొగ తాగే అలవాటు మానేయడమే సుఖం.

పౌష్టికాహారం తీసుకోండి: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే, పౌష్టికాహారం తీసుకోవాలి. మీరు తినే ఆహారాన్ని బట్టే – ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరగడం, రక్తపోటు రావడం, షుగర్, అధిక బరువు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, ఇతర పోషకాలు ఉంటూనే, క్యాలరీలు మాత్రం తక్కువుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, కాయధాన్యాలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, వేటమాంసం (రెడ్‌ మీట్‌) తక్కువ తినాలి.

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోండి: గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు చేరితే, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు శ్యాచురేటెడ్‌ కొవ్వు పదార్థాల లాంటివి తినకూడదు. ఒంట్లో చెడ్డ (ఎల్‌.డి.ఎల్‌) కొలెస్ట్రాల్, మంచి (హెచ్‌.డి.ఎల్‌) కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్‌ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో, ఎప్పటికప్పుడు చెక్‌ చేయించుకొని, జాగ్రత్తపడాలి.

రోజూ శారీరక శ్రమ చేయండి : రోజూ సగటున 45 నిమిషాల చొప్పున, వారానికి కనీసం అయిదారు రోజులు వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

బరువు చూసుకోండి : స్థూలకాయం, అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థూలకాయం అంటే హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, టైప్‌–2 డయాబెటిస్‌కు ముందు సూచన అయిన ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ లాంటివి వస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసేవే. కాబట్టి, సరైన ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బీఎమ్‌ఐ) ఉండేలా చూసుకోవాలి.


మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌) తగ్గించుకోండి: గుండె జబ్బులు రావడానికీ, ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికీ స్పష్టమైన సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెస్‌లో ఉన్నవాళ్లు అతిగా తినడం, ఎక్కువగా పొగ తాగడం లాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే, స్ట్రెస్‌ వల్ల యువతీ యువకుల్లో మధ్యవయసులోనే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.

మద్యపానం మానేయండి : అతిగా మద్యం తాగడం కూడా రిస్కే. దాని వల్ల రక్తపోటు పెరుగుతుంది. కార్డియోమయోపతీ, గుండెనొప్పి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వస్తాయి. గుండెజబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఒక్కటే. మనం నివారణకు పెట్టే ఖర్చుతో పోషకాహారాలు, వ్యాయామంతో పోలిస్తే... అది వచ్చాక చికిత్సకు అయ్యే ఖర్చు వందల రెట్లు ఎక్కువ. పైగా నివారణ చర్యలతో గుండెజబ్బులు రాకపోవడంతో పాటు మిగతా జబ్బులూ నివారితమవుతాయి. ఫిట్‌నెస్‌ బాగుంటుంది.గతేడాది, ఈ ఏడాది వరల్డ్‌ హార్ట్‌ డే థీమ్స్‌... ‘మై హార్ట్‌– యువర్‌ హార్ట్‌’తో పాటు ‘‘క్రియేట్‌ ఎ గ్లోబల్‌ కమ్యూనిటీ ఆఫ్‌ హార్ట్‌ హీరోస్‌’’. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే...  నా గుండెను రక్షించుకోవడం ఎలా... ఎదుటివాళ్ల గుండె ఆరోగ్యానికీ మనం చేయగలిగేదేమిటి?’ అనే చర్యలతో పాటు గుండెను రక్షించే నాయకుల తయారీలో మన కుటుంబాలను భాగస్వామ్యం చేయడానికి... ఇంటిలో వండిన ఆరోగ్యకరమైన వంటలే తినేందుకూ (ఇప్పుడు ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ కారణంగా జంక్‌ఫుడ్‌ మన గుమ్మం ముందుకే వస్తున్నాయి.

మన పిల్లలూ వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది).మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పక వ్యాయామం చేయడంతో పాటు పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు మానేసేందుకు; పిల్లలను సైతం చిన్నవయసు నుంచే వ్యాయామం వైపుకు మళ్లించేందుకు; ఇక ఆరోగ్యరంగంలో కృషి చేసేవారు తమ పేషెంట్స్‌ పొగతాగడం వంటి అలవాట్లు మానుకునేలాగా, కొలెస్ట్రాల్‌ తక్కువ ఉండే ఆహారం తీసుకునేలా అవగాహన తేవడం; మన విధాన రూపకర్తలు ఆరోగ్యకరమైన వ్యవస్థలను రూపొందించేలా విధానాలు రూపొందించడం; ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం కోసం కృష్టి చేయడంతో పాటు... పైన పేర్కొన్న నివారణ చర్యలను అందరూ పాటించేలా చేయగలిగితే ఈ వరల్డ్‌ హార్ట్‌ డే థీమ్స్‌కు న్యాయం జరిగినట్లే.

ఆహారపరమైన జాగ్రత్తలివి
►సాల్మన్‌ ఫిష్‌ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫార్సు చేసింది.

►ఓట్‌ మీల్‌ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేస్తూ... కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్‌ వీట్‌ బ్రెడ్‌ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే.

►స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.

►డార్క్‌ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్‌ చాక్లెట్లు, క్యాండీ బార్‌ల వల్ల ఉపయోగం ఉండదు. పైగా అవి కీడు చేస్తాయి కూడా.   

►విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్లు లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. జామపండ్ల వంటి విటమిన్‌ సి ఎక్కువగా ఉండే వాటినీ తినాలి. అయితే వీటిని కొరికి తినాలి తప్ప జ్యూస్‌లుగా చేసుకొని తాగకూడదు. ఏవైనా కారణాలతో కొరికితినలేని వారు జ్యూస్‌లుగా చేసుకొని తాగాల్సివస్తే అందులో పంచదార కలుపుకోకుండా, తాజా జ్యూస్‌లు తాగాలి.

►టొమాటోలలకూ కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. వీటిల్లో ఉండే లైకోపిన్‌ అనే పోషకం గుండెజబ్బులను నివారిస్తుంది.

►బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్‌నట్స్‌), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్‌ ‘ఇ’ ఉంటుంది.

►బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్‌ ఉంటుంది.

►పాలకూర, బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి.

►అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది.

►రోజూ నాలుగు కప్పుల గ్రీన్‌ టీ తాగడం కూడా గుండెజబ్బుల నివారణకు గణనీయంగా తోడ్పడుతుంది.


గుండెజబ్బులు రావడానికి కారణాలు
ఇప్పుడు గుండెజబ్బులు వచ్చేందుకు గల కారణాలను చూద్దాం. ఆహారంలో కొవ్వుపదార్థాలూ, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, హైబీపీ, షుగర్‌ వంటివి కొన్ని ప్రధాన కారణాలైతే... మనకు మనమే జబ్బులకు చేరువయ్యేలా చేసే మన చెడు అలవాట్లైన పొగతాగడం వంటివి ఇంకా గుండెజబ్బుల విషయంలో మనకు చేటు చేసే అంశాలు. ఇక వీటితో పాటు మారిన వృత్తుల నేపథ్యంలో మానసిక ఒత్తిడి బాగా పెరగడం, నిద్రలేమి వంటివి కూడా వచ్చి చేరాయి.

డాక్టర్‌ ఎమ్‌.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్,
మెడికవర్‌ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement