కొన్నా.. అమ్మినా.. ఆప్షన్ మీదే!
ఉమెన్ ఫైనాన్స్ / ఆప్షన్స్
ఈక్విటీ మార్కెట్‌లో షేర్‌లలో పెట్టుబడి పెట్టాలంటే ఆ షేర్ విలువ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని చెల్లించి ఆ షేర్‌లను పొందవలసి ఉంటుంది. అలాగే కొన్న తర్వాత వాటి విలువ తగ్గితే మూలధనాన్ని కూడా నష్టపోవలసి వస్తుంది. అలాగే కొంతమందికి పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో షేర్లు కొనడానికి డబ్బు అందుబాటులో లేకపోవచ్చు. వీటన్నిటికీ పరిష్కారమే ‘డెరివేటివ్స్’ . డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఈవారం అప్షన్స్‌పై అవగాహన కలిగించుకుందాం.
ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఇండెక్స్, షేర్ మార్కెట్ ధర మీద ఆధారపడి ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని సరిగా అవగాహన చేసుకొని ట్రేడ్ చేస్తే మంచి లాభాల పొందవచ్చు. అలాగే ఏ మాత్రం తేడా జరిగినా భారీగా నష్టపోవలసి వస్తుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా ఆప్షన్స్‌ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు ఈ ఆప్షన్స్ ఎలా పని చేస్తాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? వీటిలో ఉన్న రిస్క్ ఏమిటో చూద్దాం.
ఆప్షన్స్‌లో రెండు రకాలు ఉన్నాయి.
1. కాల్ ఆప్షన్. 2. పుట్ ఆప్షన్.
ఆప్షన్స్‌ని కొనేవారు ఏ షేర్ / ఏ ఇండెక్స్‌నైతే కొంటున్నారో ఆ షేరు / ఇండెక్స్ రేటు మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. ఆ ఆప్షన్‌కి ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఎటువంటి మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించనవసరం లేదు. అదే ఆప్షన్స్ అమ్మేవారైతే ఆ ప్రీమియం మొత్తాన్ని వారు పొందుతారు. కానీ వారు ఆ ఆప్షన్‌కు ఉన్నటువంటి మార్జిన్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఆప్షన్ అమ్మడం అనేది చాలా రిస్కుతో కూడుకున్నటువంటిది.
కాల్ ఆప్షన్ : ఈ ఆప్షన్‌ని కొనేవారు తాము తీసుకున్న షేరు / ఇండెక్స్.. స్ట్రైక్ ధర కన్నా పెరిగితే లాభపడతారు. ఒకవేళ తగ్గితే ఎటువంటి మొత్తాన్నీ చెల్లించనవసరం లేదు. కాకపోతే తాము కట్టిన ప్రీమియం సొమ్ము వెనక్కు రాదు. ఆ మొత్తాన్ని వారు నష్టపోతారు. అంటే కాల్ ఆప్షన్ తీసుకున్నవారికి గరిష్టంగా ఎంత నష్టపోతారనేది కచ్చితంగా తెలుస్తుంది. అదే కాల్ ఆప్షన్ అమ్మేవారైతే ఎంతైతే ప్రీమియం పొందుతారో ఆ సొమ్ము మాత్రమే వారి గరిష్ట లాభంగా ఉంటుంది. నష్టపోవలసి వస్తే మాత్రం అది అపరిమితంగా ఉంటుంది.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’