ఆవిరి స్నానంతో గుండెపోటు అవకాశాలు తగ్గుముఖం!
వారంలో కనీసం ఒకసారి వేడి నీటి ఆవిరి (సానా)తో సాన్నం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనం స్పష్టం చేసింది. వారానికి నాలుగు నుంచి ఏడుసార్లు ఆవిరి స్నానం చేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు 61 శాతం వరకూ తగ్గుతాయని ‘న్యూరాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది. ఈస్టర్న్ ఫిన్‌ల్యాండ్, లీచెస్టర్, ఎమోరీ, కేంబ్రిడ్జి, ఇన్స్‌బ్రక్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు 53–74 మధ్య వయస్కులపై ఈ అధ్యయనం చేశారు.
ఫిన్లాండ్ తూర్పు ప్రాంతంలో ఉండే వీరికి ఆవిరి స్నానం బాగా అలవాటు. వారానికి ఒకసారి చేసేవారిని ఒక గుంపుగా, రెండు మూడు సార్లు చేసేవారిని రెండో గుంపుగా, ప్రతిరోజూ చేసేవారిని మూడో గుంపుగా చేసి వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ వచ్చారు. దాదాపు 15 ఏళ్ల తరువాత గుండెపోటుకు దారితీసే అన్ని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఎక్కువసార్లు ఆవిరి స్నానం చేసేవారికి ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.
గుండెపోటు మాత్రమే కాకుండా ఆవిరి స్నానం ద్వారా గుండెజబ్బులతో మరణించే అవకాశం కూడా బాగా తగ్గుతుందని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సెటోర్ కునుట్‌సోర్ తెలిపారు. రక్తపోటును తగ్గించడంతో పాటు, రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం వంటి లాభాలు ఉన్నాయని వివరించారు.
జలగలు చెప్పే సౌరశక్తి ముచ్చట్లు...
జలగలకు, సౌరశక్తికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక ప్రత్యేక జాతికి చెందిన జలగలు.. నీటిలో పెరిగే నాచు మొక్కలను తినేసి.. వాటితోనే మొక్కల్లో మాదిరిగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని బతికేస్తున్నాయి అని మెయిన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే.. మొక్క మాదిరిగా ఓ జంతువు సూర్యుడి నుంచి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసుకుంటోందన్నమాట. అయితే ఏంటి అంటున్నారా! చాలానే ఉంది.
పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో మొక్కల అవసరం కూడా లేకుండా ఇంధనం.. తద్వారా విద్యుత్తును తయారు చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందంటున్నారు దేబాశిష్ భట్టాచార్య. కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఎలీసియా క్లోరోటికా రకం జలగ పచ్చగా ఉంటుంది. దాదాపు రెండు అంగుళాల వరకు పెరుగుతుంది.
నీటిలో ఉండే సూక్ష్మస్థాయి మొక్కలైన నాచును ఆహారంగా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అది నాచు మొక్కల్లోని కణాలను శరీరంలోకి జొప్పించుకుంటుందన్నమాట. ఆ తరువాత సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఈ కణాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసుకుని ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు బతికేస్తుంది. ఇదెలా జరుగుతోందో తెలసుకోగలిగితే కృత్రిమ ఇంధన తయారీ సులువు అవుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment