
సాధారణంగా చాలామంది తాము అనుకున్న పని జరగకపోయినా, కోరిన కోరిక తీరకపోయినా, ఆశించినది అందకపోయినా ‘ఆ భగవంతుడేమిటండీ!’ అంటాం. కానీ ఓ పని జరిగిందంటే ఆ పని జరగడం వెనుక ఒకడున్నాడని గుర్తు. ‘నీవు’ అనే వాడివి ఒకడుంటేనే ’బాగున్నావా?’ అని అడుగుతారు. బాగుండడం అనేది దేనిమీద ఆధారపడింది? ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం మీద. తీసిన ఊపిరి వదలకపోతే.. వదిలిన ఊపిరి తీయకపోతే శివం, శవం అవుతుంది. మరి ఊపిరి తీసిన వాడెవరు. నీవే. మరి పోయిన వాళ్ళందరూ ఊపిరి తీయడం చేతగాకనో, మర్చిపోయో వెళ్ళిపోయారా! ఊపిరి తీసి వదిలిపెడుతున్నంత కాలం నాన్నగారు, గురువుగారు, మామయ్యగారు, అన్నయ్యగారు... అబ్బో ఎన్ని అనుబంధాలో... ఆ వాయువు తీయడం ఆగిపోయింది.
చివరికి భార్య, పిల్లలు, బంధువులు కూడా ‘ఆయన శరీరం కట్టె, దాన్నెలా పట్టుకుంటాను’ అంటారు. అంటే నీ శుభాలన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని. దాన్ని పని చేయించేవాడు వేరొకడున్నాడు. నీవు నిద్రపోతున్నా దాన్ని సజావుగా పనిచేయిస్తున్నాడు కదా... వాడున్నాడని నమ్మడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి మనకి? అందుకే అన్నారు పెద్దలు శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించమని... మనం కనీసం ఈ మాత్రం ఉంటున్నామన్నా, పొద్దున్నే లేచి కాఫీనో, టీనో తాగుతూ పేపరు చదువుతూ భార్యాపిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నామన్నా కూడా అందుకు భగవంతుడి అనుగ్రహం ఉందని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment